టొరంటో : భారత్ నుండి పలువురు దౌత్యవేత్తలను కెనడా వెనక్కి పిలిపించింది. భారత్‌లోని తమ దౌత్యవేత్తలను మలేషియా, సింగపూర్‌కు పంపినట్లు స్థానిక మీడియా శుక్రవారం తెలిపింది. న్యూఢిల్లీ వెలుపల భారత్‌లో పనిచేస్తున్న కెనడా దౌత్యవేత్తలలో అధిక శాతం మందిని మలేషియా, సింగపూర్‌కు తరలించినట్లు స్థానిక మీడియా సిటివి న్యూస్ తెలిపింది. కెనడాలో ఉన్న భారత్ దౌత్యాధికారుల సంఖ్యకు అనుగుణంగా సుమారు 41 మందిని అక్టోబర్ 10 నాటికి తొలగించాలని కెనడాకు భారత్ డెడ్‌లైన్ విధించింది. దీంతో భారత్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న కెనడా రాయబార కార్యాలయాల్లో పని చేస్తున్న దౌత్యాధికారుల్లో చాలా మందిని మలేషియా , సింగపూర్‌కు ఆ దేశం తరలించినట్లు వెల్లడించింది. ఖలిస్తానీ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన సంగతి తెలిసిందే. దీంతో అక్టోబర్ 10 నాటికి సుమారు 40 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కెనడాను భారత్ కోరిందని జాతీయ మీడియా నివేదించింది. గడువు ముగిసిన తర్వాత దేశంలో ఉన్న కెనడియన్ దౌత్యవేత్తల దౌత్యపరమైన అధికారాలను తొలగిస్తామని భారత ప్రభుత్వం హెచ్చరించిందని పేర్కొంది.