Oct 01,2023 07:05

వచ్చే ఎన్నికల రాజకీయాలలో మోడీ తలమునకలవుతున్నట్టే ట్రూడో మరింత తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్నారు. లిబరల్‌ పార్టీ నాయకుడైన ట్రూడో అసంతృప్తికి ఎదురీదుతున్నారు. తను అధికారంలో కొనసాగాలంటే ఖలిస్తానీ అనుకూలమైన 'న్యూ డెమోక్రటిక్‌ పార్టీ' మద్దతు తప్పనిసరి. ఖలిస్తానీ మద్దతుదారులను బుజ్జగించడానికి ఒక దారి మళ్లింపు ఎత్తుగడ అవసరమైంద ంటున్నారు. ఏదో విధంగా పట్టు చూపించుకోకపోతే తనను తప్పించి మరొకరిని ప్రధాని అభ్యర్థిని చేస్తారనేది ఆయన భయం. అందుకే భారత్‌తో సంబంధాలు దెబ్బ తింటాయని తెలిసీ ఈ రాజకీయ నాటకం నడిపిస్తున్నారని విమర్శకుల మాట.

            ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశంలో పెరిగిన విద్వేషాల సెగ ఇప్పుడు విదేశాలకూ తాకుతున్నదా? విశ్వగురు బిరుదుతో ఊరేగుతా మనుకుంటే వివాదాలు కూడా విశ్వవ్యాపితమవుతున్నాయా? అధీకృత దేశభక్తి జపం, దేశంలోనే గాక దేశం బయిట కూడా మోడీ మోత మోగించి ఆ గొప్పలతో ఓట్లు కొల్లగొట్టాలనే ఎత్తుగడ బెడిసికొడుతుందా? గత కొద్ది కాలంగా భారత్‌-కెనడాల మధ్య సాగుతున్న రాజకీయ దౌత్య వివాదం మరింత ప్రజ్వరిల్లడం ఆ కోణంలో చాలా ఆందోళనకరం అవుతున్నది. పాకిస్తాన్‌ను మినహాయిస్తే మరే దేశంతోనూ ఈ తరహా సమస్యలో మన దేశం చిక్కుకున్న దాఖలాలు లేవు. అలా అని మనకు విదేశాంగ విధానంలో సమస్యలు, సవాళ్లు లేనేలేవని కాదు. నిజానికి అమెరికా వత్తాసుగల పాకిస్తాన్‌ సాగించిన చొరబాట్లు ఎప్పుడూ వున్నాయి. అయితే వాటి తీరు వేరు. తమ దేశంలో ఖలిస్తానీ వాది 'ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌' నాయకుడు హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ను భారతీయ నిఘా అధికారులే చొరబడి హత్య చేశారనేందుకు బలమైన సాక్ష్యాలున్నాయని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్ర స్థాయిలో ముందుకు తెచ్చిన ప్రస్తుత ఆరోపణ వాటన్నిటికీ మించింది. మొన్న జరిగిన జి-20 సమావేశాల సందర్భంలోనూ ఐక్యరాజ్య సమితి వేదిక మీద కూడా కెనడా ఈ ఆరోపణ రికార్డు వినిపిస్తూనే వుంది. కెనడాకు అమెరికా బాహాటంగానే మద్దతు పలికింది. పంచనేత్రాలు (ఫైవ్‌ఐ)గా చెప్పబడే కెనడా, అమెరికా, బ్రిటన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల నిఘా సంస్థలు ఇందుకు గొంతు కలుపుతున్నాయి. అంటే ఇది నెమ్మదిగా మన దేశంపై ఒక ఉమ్మడి ఫిర్యాదుగా మారుతున్నదన్న మాట. వీటిని సకాలంలో సజావుగా పరిష్కరించుకోవలసిన బాధ్యత మన దేశంపై వుంది. లేకపోతే కెనడా భారత్‌ సంబంధాలకే గాక ఇతర దేశాలతో మన సంబంధాలకూ విఘాతం కలగొచ్చు. శాంతి కాముక దేశంగా మనకున్న ప్రతిష్ట దెబ్బ తినవచ్చు.
 

                                                                విచ్ఛిన్న ఉద్యమ విషాద ఫలితాలు

1980లలో భారత దేశంలో ఖలిస్తానీ ఉగ్రవాదం ప్రమాదకరంగా పెరిగిన సంగతి మర్చిపోలేము. ఈ దేశంలో కన్నా ముందు దాని ఛాయలు కెనడా లోనే ప్రత్యక్షమైనాయి. ఇండియా తర్వాత సిక్కులు అధిక సంఖ్యలో వుండేది కెనడా లోనే. ఆ దేశ జనాభాలో దాదాపు 1.8 శాతం సిక్కులున్నారు. ప్రస్తుత ట్రూడో మంత్రివర్గంలోనే నలుగురు సిక్కులున్నారు. జగ్‌్‌జిత్‌ సింగ్‌ చౌహాన్‌ అనే ఆయన అక్కడ నుంచి విచ్ఛిన్నకర సందేశాలు పంపుతుండేవాడు. నిజానికి ఆ సమయంలో ఈశాన్య భారతంలోనే విచ్ఛిన్న శక్తులకు అమెరికా కూటమి ప్రోద్బలముండేది, నెమ్మదిగా ఆ పన్నాగాలు ఫలించి పంజాబ్‌ అగ్నిగుండమైంది. దేశమే అల్లాడిపోయింది. వేల మంది ఉగ్రవాదానికి బలికావడం, బింద్రన్‌వాలా స్వర్ణ దేవాలయంలో తిష్ట వేయడంతో ఆపరేషన్‌ బ్లూ స్టార్‌, దాని పర్యవసానంగా నాటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య వంటి తీవ్ర పరిణామాలు చూశాము. పంజాబ్‌ ముఖ్యమంత్రి దర్బారా సింగ్‌ కూడా ఉగ్రవాదులకు బలైపోయారు. తల్వీందర్‌ సింగ్‌ పర్మార్‌ అనే ఉగ్రవాదిని అప్పగించాలని ఇండియా ఎంత కోరినా కెనడా పెడచెవిని పెట్టింది. 1985లో కనిష్క విమానం పేల్చి వేసి 329 మంది మృతికి కారణమైన కుట్రదారుడుగా అతని పేరు బయిటకు వచ్చింది. ఉత్తరోత్తరా పంజాబ్‌లో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినా విదేశీ నేలపైన మాత్రం అవి ఏదో రూపంలో కొనసాగుతూనే వున్నాయి. ఈ నలభై ఏళ్లలో ప్రపంచం చాలా ఒడిదుడుకులు చూసింది. మితవాద శక్తులు అభివృద్ధి నిరోధక ధోరణులు ప్రాబల్యం పెంచుకున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలోనూ హిందూత్వ పేరిట మతతత్వ ధోరణులు ప్రబలుతున్న పరిస్థితి. ఈ దేశంలోనే హిందూ రాష్ట్రమంటుంటే మేం ఎందుకు ఖలిస్తాన్‌ అడగొద్దని కెనడాలో ఈ శక్తులు మళ్లీ తలెత్తడం వాస్తవమే. నిజానికి ఆ దేశంలోనే గాక పైన చెప్పిన అయిదు దేశాల్లో కూడా రకరకాలైన భారత వ్యతిరేక శక్తులు గతంలో వలెనే ఇప్పుడు కూడా ప్రచారాలు, కార్యకాలాపాలు సాగిస్తుంటే ఆ దేశాల పాలకులు యథేచ్ఛగా సాగనిస్తున్నారు. మరోవైపున దేశంలో మత రాజకీయాలకు తోడు మోడీ భజన పెంచుకోవడానికి హిందూత్వ ముద్రతో విదేశాల్లోనూ ప్రచారాలు చేసిన నేపథ్యం బిజెపిది. టెర్రరిజంపై పోరాటం పేరిట అమెరికాకు ఉపగ్రహంగా మారింది. వైట్‌హౌస్‌లో దీపావళి చేశారని, యోగా దినోత్సవం ఐరాస నిర్వహించిందనీ అన్నిటినీ ఆ దిశలోనే చూపించే ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగింది. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్‌ వున్నప్పుడు ఇది పరాకాష్టకు చేరడం చూశాం. ఇలా మోడీ సర్కారును తమతో తిప్పుకుంటూనే పాశ్చాత్య దేశాలు అక్కడున్న వివిధ రకాల విచ్ఛిన్న శక్తులను స్వప్రయోజనాలకు ఉపయోగించాయి. ఎందుకంటే వర్ధమాన దేశాలు సుస్థిరంగా వుండటం వాటి ప్రయోజనాలకే విరుద్ధం.
 

                                                                     కెనడాలో ఉగ్రవాద కార్యకలపాలు

జి-7 ఆర్థిక కూటమిలో కెనడా ఒక కీలక భాగస్వామ్య దేశం. అమెరికాలా ప్రత్యక్షంగా ప్రపంచ రాజకీయాలలో ముఖ్య పాత్రలో కనిపించకపోయినా పెట్టుబడిదారీ కూటమిలో దానికి బలమైన స్థానమే వుంది. ఇండియాతో వ్యాపార సంబంధాలు పాటించే దేశాలలో కెనడాది పదో స్థానం. దేశంలో పెట్టుబడులు పెట్టిన విదేశాలలో 4500 కోట్ల డాలర్లతో దానికి నాలుగో స్థానం. భారతీయులు కెనడాలో పెద్ద సంఖ్యలోనే వున్నారు. సిక్కులు ప్రధానంగా వున్నా మళయాలీలు, తెలుగువారు కూడా తక్కువ కాదు. ఆ దేశ రాజకీయ ఫలితాలను కూడా వీరు ప్రభావితం చేయగలరు. బిజెపి గద్దెక్కిన తర్వాతనే వారు మళ్లీ సిక్కులకు స్వంత దేశంగా ఖలిస్తాన్‌ కావాలనే పాట ఎత్తుకున్నారు. అంతటితో ఆగక అక్కడున్న హిందువులు కెనడా వదలిపోవాలని బెదిరించడం ప్రారంభించారు. అమెరికా లోని ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ ఇందుకు నాయకత్వం వహించాడు. అమెరికా, కెనడా ఇరు దేశాల పౌరసత్వం గల పన్నున్‌ వాస్తవానికి సిఐఎ ఏజంటనే సందేహాలున్నాయి. పంజాబ్‌ లోని అతని ఆస్తులను ప్రభుత్వం స్వాధీనపర్చుకుంది. ఖలిస్తానీల చర్యల వల్ల పెరుగుతున్న ఉద్రిక్తతలను అదుపు చేయాలనీ, ఆ శక్తులకు అవకాశమివ్వవద్దనీ ఎంత కోరినా కెనడా అలసత్వమే ప్రదర్శించింది. ముఖ్యంగా నిజ్జర్‌ నాయకత్వంలోని 'ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌' అనే సంస్థ అనేక ఉగ్రవాద చర్యలకు పాల్పడింది. తనను అప్పగించాలని ఇండియా ఎప్పటినుంచో కోరుతూ వచ్చింది. కెనడా ప్రభుత్వానికి ఆధారాలు సమర్పించింది. అయినా ప్రయోజనం లేకపోగా వారికి వత్తాసు లభించింది. ఈ నేపథ్యంలోనే మొన్న జులైలో వాంకోవర్‌ సమీపంలో సర్వే అనే చోట గల గురుద్వారా దగ్గర నిజ్జర్‌ హత్యకు గురైనాడు. దీనిపై దర్యాప్తు జరిపి దోషులను శిక్షించడం మానేసి కెనడా ఇందులో భారత దేశ హస్తం వుందని ఆరోపణలు చేస్తున్నది. రహస్య గూఢచారి సంస్థ 'రా' ఏజంట్లు పాల్గొన్నారని అంటోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు జి-20 సందర్భంలో ప్రధాని మోడీకి అప్పగించినా ఫలితం లేదని ఆరోపిస్తున్నది. మరోవైపున భారత్‌ విదేశాలలో చొరబడి హత్యలు చేయించే పద్ధతి తమకు లేదని ఖండించింది. కెనడా ప్రధాని ట్రూడో చెబుతున్నది తమ దేశ విధానంతో పొసగదని విదేశాంగ మంత్రి జైశంకర్‌ తాజాగా అమెరికాలో వివరించారు. సరైన సాక్ష్యాధారాలు అందిస్తే పరిశీలిస్తామన్నారు. కాని కెనడా చెప్పే విషయం సీరియస్‌గా తీసుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ కూడా గట్టిగా కోరారు. ఇంత బాధ్యతాయుతంగా ఫిర్యాదు చేస్తుంటే ఆ స్థాయిలో స్పందన వుండాలని అమెరికా అంటుంది. 28వ తేదీన జైశంకర్‌ బ్లింకెన్‌తో చర్చలు జరిపారు కూడా. 1980ల నుంచి కెనడా ఖలిస్తానీ వాదుల కార్యకలాపాలకు స్థానం కల్పిస్తున్నదని ఆయన మరోసారి ఆరోపించారు, నేరపూరిత శక్తులు, మానవ రవాణా, విచ్ఛిన్న ముఠాల కలయికగా కెనడా మారిపోయిందని విమర్శించారు. ఆఖరుకు భారత రాయబార వర్గాలకు కూడా కెనడాలో రక్షణ లేకుండా పోయిందన్నారు. మొత్తంపైన కెనడా ఫిర్యాదును భారతదేశం పూర్తిగా తోసిపుచ్చడమేగాక ప్రత్యారోపణలు చేస్తున్నదన్నమాట. ఆ విధంగా ఇరు దేశాల సంబంధాలు వేగంగా దిగజారాయి.
 

                                                                    అంతర్గత రాజకీయ కోణాలు

జి-20 సమావేశాల సందర్భంలోనూ మోడీ, ట్రూడో పది నిముషాలు మాత్రమే అది కూడా ఏదో వేరే సందర్భంలో మాట్లాడుకున్నారు. మరోవంక 14 దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోడీ ఆయనను కలవలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ వెంటనే కెనడా భారత రాయబార కార్యాలయంలో ఒకరిని బహిష్కరించడం, ఢిల్లీలో కెనడా రాయబార సిబ్బందిని వెనక్కు పంపడం వెంటవెంటనే జరిగిపోయాయి. వాణిజ్య చర్చలను కూడా కెనడా నిలిపేసింది. ఇక ఇండియా కెనడా వారికి వీసాలను ఆపేసింది. ఐరాస వేదికపై కెనడా ధోరణిని ఖండిస్తూ మంత్రి జైశంకర్‌ ఉగ్రవాదంపై పోరాటం తమ ఇష్టాలను బట్టి మారిపోకూడదని అంటే ఇతర దేశాల్లో తల దూర్చే ధోరణి ప్రజాస్వామ్యం కాదని ఆ దేశం ఎదురు ఆరోపించింది. ఈ ఊపులోనే చైనాతో కెనడాకు నిగూఢ సంబంధాలు వున్నాయనే ఆరోపణ కూడా భారత వైఖరికి కారణమంటున్నారు. ఈ విధంగా కెనడాకు గట్టి పాఠం నేర్పాలనే మోడీ వైఖరి సరైందని కొందరు కీర్తిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మరో పుల్వామాలా మరో సర్జికల్‌ స్ట్రయిక్‌గా దీన్ని ఉపయోగిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో కెనడాకు మద్దతుగా పాకిస్తాన్‌ మాట్లాడటం కూడా ఈ శక్తులకు ఊతమిస్తున్నది.
             మొత్తంపైన అనేక కోణాల్లో చూసినపుడు ఈ దౌత్య సంఘర్షణ వెనక బలమైన అంతర్జాతీయ కారణాలు కనిపిస్తాయి. వచ్చే ఎన్నికల రాజకీయాలలో మోడీ తలమునకలవుతున్నట్టే ట్రూడో మరింత తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్నారు. లిబరల్‌ పార్టీ నాయకుడైన ట్రూడో అసంతృప్తికి ఎదురీదుతున్నారు. తను అధికారంలో కొనసాగాలంటే ఖలిస్తానీ అనుకూలమైన 'న్యూ డెమోక్రటిక్‌ పార్టీ' మద్దతు తప్పనిసరి. ఖలిస్తానీ మద్దతుదారులను బుజ్జగించడానికి ఒక దారి మళ్లింపు ఎత్తుగడ అవసరమైందంటున్నారు. ఏదో విధంగా పట్టు చూపించుకోకపోతే తనను తప్పించి మరొకరిని ప్రధాని అభ్యర్థిని చేస్తారనేది ఆయన భయం. అందుకే భారత్‌తో సంబంధాలు దెబ్బ తింటాయని తెలిసీ ఈ రాజకీయ నాటకం నడిపిస్తున్నారని విమర్శకుల మాట. తనతో పాటు మిగిలిన నాలుగు దేశాలను కూడా ఆయన ఒత్తిడి చేస్తున్నారట. ఫలితమే అమెరికా కూడా వంత పాడటం. అమెరికాలోనూ ఎన్నికలు రానున్నాయి. ఇండియా ఎన్నికల ముంగిట్లో వుంది. కెనడా ఇచ్చింది దర్యాప్తుకు ఉపయోగపడే అంశం తప్ప ఖచ్చితమైన సాక్ష్యం కాదని, ఇప్పటికీ దర్యాప్తు పూర్తి చేసింది లేదని ఇండియా వాదన. బలం లేకుంటే ఆ దేశం ఇంత దూరం తెస్తుందా అనేది వారిని బలపర్చే దేశాల వాదన, ఏ విధంగా చూసినా ఇప్పుడు సమగ్రమైన దర్యాప్తు చేయడం ఒక్కటే పరిష్కారం. భారతదేశం కూడా అందుకు సహకరించి దౌత్య సంబంధాలు దెబ్బ తినకుండా చూడాలనేది నిపుణుల అభిప్రాయం. ట్రూడో లేదా మోడీ ఎవరి ప్రయోజనాల కోసమైనా ప్రతిష్ట కోసమైనా దీన్ని సాగదీయడం శ్రేయస్కరం కాదు. అలాగే మన విదేశీ మోత, విశ్వగురు భజన కూడా తగ్గించుకుని దేశ ప్రయోజనాలను, శాంతిని కాపాడుకోవడం అవసరం. గతంలో మైన్మార్‌, శ్రీలంక, నేపాల్‌, బర్మా వంటి దేశాలతో సంబంధాలలో దూకుడు ఎలాంటి పరిణామాలకు కారణమైందో మర్చిపోతే కష్టం.

తెలకపల్లి రవి

1