Sep 15,2022 07:48

బిజెపి నుంచి దేశాన్ని కాపాడుకోవాలి
ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి :సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దేశ రక్షణ భేరి కార్యక్రమంలో భాగంగా ప్రచారోద్యమం బుధవారం ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఊరూరా, వాడవాడలా పాదయాత్రలు, సదస్సులు, సభలు నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల ప్రజలకు కలుగుతున్న కష్టాలను, నష్టాలను, బిజెపి పట్ల రాష్ట్రంలోని వైసిపి, టిడిపి అవకాశవాదాన్ని సిపిఎం శ్రేణులు ప్రజలకు వివరించాయి. నెల్లూరులోని వెంకటేశ్వపురంలో 'దేశ రక్షణ భేరి'ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మోడీని సాగనంపాల్సిన అవసరం ముందు కొచ్చిందని పేర్కొన్నారు. బిజెపి పాలనలో ఒక్క మంచి పనిచేయలేదని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొన్నారని తెలిపారు. జిఎస్‌టి వల్ల మోయలేని భారాలు పడ్డాయన్నారు. దేశంలో నిరుద్యోగం, ధరలు పెరిగాయని తెలిపారు. విభజన హామీలు అమలు చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. పోలవరానికి, అమరావతి నిధులు నిధులు ఇవ్వడం లేదని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశానికి హాని చేసిందని, అంతకు మించి బిజెపి ద్రోహం చేస్తోందని అన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందని, రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తోందని, అలాంటి పార్టీకి వైసిపి వత్తాసు పలుకుతోందని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావడంతో ముఖ్యమంత్రి జగన్‌ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. దేశంలోని తెలంగాణ, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు మోడీ పాలనను వ్యతిరేకిస్తుంటే, జగన్‌ మాత్రం మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు. కార్మికులు, ఉద్యోగులు, కమ్యూనిస్టులు, ప్రజా సంఘాలు పోరాడుతుంటే పోలీసులతో అణచివేస్తున్నారన్నారు. మోడీ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాపితంగా 14 నుంచి 27 వరకు దేశ రక్షణ భేరి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం జెండా ఊపి ప్రచార భేరిని ప్రారంభించారు. తొలుత అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతూ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులోని పటేల్‌ సెంటర్‌లో సభ జరిగింది. నందికొట్కూరు, బల్లారం, దామగట్ల, బ్రాహ్మణకొట్కూరు తదితర గ్రామాల్లో దాదాపు 30 కిలోమీటర్లు ప్రచారోద్యమం సాగింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు లాకుల వద్ద ప్రచారోద్యమాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, గన్నవరం మండలం చనుపల్లివారిగూడెంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌, 58 డివిజన్‌ కృష్ణా హోటల్‌ సెంటర్లో నిర్వహించిన ప్రచార భేరిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పాల్గని ప్రసంగించారు. బియ్యం, పెరుగు, పాలు ఇతర నిత్యవసరాలపై జిఎస్‌టి భారాలను ప్రతిబింబిస్తూ వాటిని ప్రదర్శించారు. బియ్యం ధరల పెంపును నిరసిస్తూ బియ్యాన్ని దోసెళ్లలో వేసుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, కాకినాడ జిల్లా తునిలో ప్రచారోద్యమం ప్రారంభమైంది.