Dec 04,2022 08:28

ఆవకాయ అనగానే నోరూరుతుంది. మొదటి ముద్దలో పచ్చడి కలుపుకుని తినే అలవాటు దక్షిణాదిలో పూర్వకాలం నుంచీ ఉన్నదే. ప్రకృతి పరంగా ఒక్కో కాలంలో ఒక్కో రకం కాయలు కాస్తాయి. సంవత్సరమంతా తినాలి అంటే ఏడాదంతా నిలవ ఉండేలా పచ్చళ్ళు పట్టుకుంటేనే తినే అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతోనే నిల్వ పచ్చళ్ళు తయారయ్యాయి. సాధారణంగా వేసవికాలం ప్రారంభం నుంచి ఆవ పచ్చళ్ళు పెట్టడం ప్రారంభిస్తారు. కాలానుగుణంగా చలికాలంలో మాత్రమే వచ్చే కొన్నింటితోనూ ఆవ రుచులు వచ్చేశాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చిక్కుడుకాయ..

Calikalam-nilva-paccaḷḷu


కావలసినవి : చిక్కుడు కాయలు - 1/2 కేజీ, నూనె - 350 గ్రా., కొత్త చింతపండు - 125 గ్రా, ఆవాలు - 2 స్పూన్లు, మెంతులు - స్పూను
పొడి కోసం : ఆవాలు, మెంతులు దోరగా వేయించి మిక్సీ పట్టుకుని ఆవ మెంతి పొడి రెడీ చేసుకోవాలి.
తాలింపుకు : ఎండుమిర్చి - 6, ఆవాలు - 2 స్పూన్లు, మెంతులు - 1/2 స్పూను, జీరా - స్పూను, పొట్టు తీసిన వెల్ల్లుల్లి రెబ్బలు - 1/4 కప్పు, కరివేపాకు, ఇంగువ - చిటికెడు
తయారీ : ముందుగా శుభ్రం చేసుకున్న చిక్కుడు కాయలను తడి లేకుండా నీడలో పొడి క్లాత్‌పై ఆరబెట్టుకోవాలి. బాండీలో పావుకేజీ నూనె వేడి చేసి, చిక్కుడు కాయలను మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాలు వేయించి, వెడల్పుగా ఉన్న గిన్నె (బేసిన్‌) లోకి తీసుకోవాలి. అదే నూనెలో పైన చెప్పిన తాలింపు దినుసులు దోరగా వేయించుకుని, చల్లారిన తర్వాత బేసిన్‌లోని చిక్కుడుకాయల్లో వేయాలి. బాండీలో మిగిలిన నూనె వేడి చేసి, చింతపండు గుజ్జు పావుగంట సేపు ఉడికించాలి. ఆరిన తరువాత నూనెతో సహా చింతపండు గుజ్జు, కారం, ఉప్పు, పసుపు, ఆవమెంతి పిండి అన్నింటినీ చిక్కుడుకాయలకు బాగా పట్టించాలి. అంతే చిక్కుడు ఆవకాయ రెడీ. దీనిని శుభ్రమైన పొడి సీసాలోగానీ, జాడీలోగానీ పెట్టుకుంటే రెండు నెలలపాటు ఉంటుంది. ఫ్రిజ్‌లో అయితే ఆరు నెలలు ఉంటుంది.
చింతకాయ..

Calikalam-nilva-paccaḷḷu

కావలసినవి: పచ్చి చింతకాయలు - కేజీ, కళ్లుప్పు - 1/4 కప్పు, పసుపు - స్పూను
తయారీ: శుభ్రం చేసిన చింతకాయలను తడి లేకుండా ఆరనివ్వాలి. కాయల రెండు చివర్లు, పీచు తొలగించుకుంటూ ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఈ ముక్కలు, ఉప్పు, పసుపు మూడింటిని రోటిలో గానీ, మిక్సీలోగానీ, కచాపచాగా దంచుకుని, చింత తొక్కును తయారుచేసుకుని సీసాలో పెట్టుకోవాలి. దీనిని కావలసినప్పుడు కాస్త కాస్త తీసుకుని నూరుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది.
పచ్చడి : కావలసినవి : తొక్కు -1/4 కప్పు, ఎండుమిర్చి - 10, ధనియాలు - 2 స్పూన్లు, జీరా - స్పూను, నువ్వులు - 2 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - 6, నూనె - 2 స్పూన్లు, తాలింపు దినుసులు - స్పూను
తయారీ : బాండీలో నూనె వేడి చేసి ధనియాలు, జీరా, ఎండుమిర్చి, నువ్వులు దోరగా వేయించి చల్లారనివ్వాలి. చింత తొక్కు, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుని పోపు పెట్టుకుంటే చింతకాయ పచ్చడి రెడీ. నువ్వుల స్థానంలో వేరుశనగ పప్పు కూడా తీసుకోవచ్చు.
ఉసిరి..

Calikalam-nilva-paccaḷḷu

కావలసినవి : ఉసిరి కాయలు- కేజీ, ఆవాలు - 2 స్పూన్లు, మెంతులు - స్పూను , పొట్టు తీసిన వెల్ల్లుల్లి రెబ్బలు - 1/4 కప్పు, చింతపండు - 150 గ్రా. , ఉప్పు - 120 గ్రా., కారం - 100 గ్రా., పసుపు - 1/2 స్పూను, నూనె - 1/2 లీ.
పొడి కోసం : ఆవాలు, మెంతులు దోరగా వేయించి మిక్సీ పట్టుకుని ఆవ మెంతి పొడి రెడీ చేసుకోవాలి.
తాలింపుకు : ఎండుమిర్చి - 6, ఆవాలు - 2 స్పూన్లు, మెంతులు - 1/2 స్పూను, కరివేపాకు, ఇంగువ - చిటికెడు
తయారీ : ముందుగా శుభ్రం చేసుకున్న ఉసిరి కాయలను తడిలేకుండా తుడిచి ఎండలో పొడి క్లాత్‌పై ఆరబెట్టుకోవాలి. చింతపండు గుజ్జు తీసుకుని రెడీగా ఉంచుకోవాలి. బాండీలో రెండు స్పూన్ల నూనె వేడిచేసి చింతపండుగుజ్జు, పసుపు వేసి,15 నిమిషాల పాటు ఉడికించాలి. గుజ్జు నుండి ఆయిల్‌ సెపరేట్‌ అయ్యే సమయంలో స్టౌ ఆఫ్‌ చేసి చల్లారనివ్వాలి.
బాండీలో నూనె వేడి చేసి, మీడియం ఫ్లేమ్‌ మీద ఉసిరికాయలను దోరగా వేయించుకోవాలి. వాటిని వేరే గిన్నెలోకి తీసి, అదే నూనెలో తాలింపు పెట్టుకొని, గోరువెచ్చగా ఆరనివ్వాలి. ఒక వెడల్పు గిన్నెలో కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఆవమెంతి పొడి అన్నీ కలిసేలా కలిపి దానిలో చింతపండు గుజ్జు కలిపి, ఉసిరికాయలు వేయాలి. ఆ మిశ్రమం కాయలకు బాగా పట్టేలా కలపాలి. దీనికి గోరువెచ్చని తాలింపునూనె కలిపి 3 నుంచి 5 రోజులు ఊరనివ్వాలి. నోరూరించే ఉసిరి ఆవకాయ రెడీ.
క్యాలీఫ్లవర్‌..

Calikalam-nilva-paccaḷḷu


కావలసినవి : క్యాలీఫ్లవర్‌ - ఒక పువ్వు, ఆవాలు - 2 స్పూన్లు, మెంతులు - స్పూను , కచాపచాగా దంచిన వెల్ల్లుల్లి రెబ్బలు - 5, చింతపండు - నిమ్మకాయ సైజంత, ఉప్పు - 1/4 కప్పు, కారం - 1/2 కప్పు, పసుపు - 1/2 స్పూను, నూనె - 1/2 కప్పు
పొడి కోసం : ఆవాలు, మెంతులు దోరగా వేయించి మిక్సీ పట్టుకుని ఆవ మెంతి పొడి రెడీ చేసుకోవాలి. తాలింపుకు : ఎండుమిర్చి - 2, ఆవాలు - స్పూను, కరివేపాకు, ఇంగువ - చిటికెడు
తయారీ : వేడినీటితో శుభ్రం చేసుకున్న క్యాలీఫ్లవర్‌ ముక్కలను ఎండలో పొడి క్లాత్‌పై ఆరనివ్వాలి. బాండీలో నూనె వేడిచేసి, క్యాలీఫ్లవర్‌ ముక్కలను ఐదు నిమిషాలు వేయించి, వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అదే నూనెలో ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లితో తాలింపు పెట్టాలి. అందులోనే చింతపండు గుజ్జు, పసుపు వేసి, ఐదు నిమిషాలు వేగనిచ్చి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమానికి కారం, ఉప్పు, ఆవమెంతి పొడి అన్నీ కలిపి, దానిలో క్యాలీఫ్లవర్‌ ముక్కలు వేసి బాగా కలపాలి. దీనిని ఒకరోజు ఊరనిస్తే కమ్మనైన క్యాలీఫ్లవర్‌ పచ్చడి రెడీ. శుభ్రమైన పొడి సీసాలో పెట్టుకుంటే బయట నెల రోజులు, ఫ్రిజ్‌లో అయితే రెండు నెలలు ఉంటుంది.

  • గమనిక : ఈ పచ్చళ్ళకు చింతపండు మరిగించిన నీటిలో నానబెట్టి చిక్కగా గుజ్జు తీసుకోవాలి.