Jun 25,2023 15:04

'ఎప్పుడూ క్లాస్‌లో చలాకీగా వుండే సిరి ఎందుకో ఈ మధ్య మూడీగా ఉంటుంది. చదువులో వెనుకబడింది. కారణం ఏమిటంటారు సత్యంగారూ?' సైన్సు క్లాస్‌ పూర్తిచేసి స్టాఫ్‌రూమ్‌కి వచ్చిన నీరజ మేడమ్‌ అడిగారు లెక్కల మాస్టారుని.
'అదే నాకూ అంతుబట్టడం లేదండి. అడిగిన వెంటనే ఆన్సర్‌ చెప్పేది. అందరికంటే ముందే లెక్క చేసి చూపించేది. అటువంటిది ఈ మధ్య లెక్కలు కూడా సరిగా చేయడం లేదు' అన్నారు సత్యం మాస్టారు.
ఆ రోజు స్టాఫ్‌రూమ్‌లో అంతా సిరి చదువు గురించే డిస్కషన్‌ జరిగింది. 'బాగా చదివే అమ్మాయి. రాష్ట్ర స్థాయిలో మొదటి ప్లేస్‌లో నిలిచి, స్కూల్‌కి మంచిపేరు తేగలదు. కానీ సరిగ్గా పరీక్షలు దగ్గర పడుతున్నాయనగా డల్‌ అయిపోయింది. అసలు ఏం జరిగిందో మీరే కనుక్కోవాలి' అన్నారు మిగిలిన స్టాఫ్‌ సైన్స్‌ టీచర్‌ నీరజగారితో.
'అలాగే.. నేను కనుక్కొంటాను..!' అన్నారు నీరజ.
ఆరోజు లంచ్‌ బ్రేక్‌లో సిరిని తనతో బయటకు తీసుకువెళ్ళి 'ఇప్పుడు చెప్పు. చదువు మీద శ్రద్ధ తగ్గింది. ఏంటి నీ ప్రాబ్లం సిరీ?' అని అడిగారు.
'ప్రాబ్లం ఏమీ లేదు మేడమ్‌. ఈ మధ్య కొంత నలతగా వుంటుంది.. అంతే. అందువల్లనే చదువు మీద శ్రద్ధ చూపలేకపోయాను. ఇహ శ్రద్ధగా చదువుకుంటాను' అంది.
'నిజమేనా.. ఏదైనా సమస్య వుంటే నాకు చెప్పు సిరీ!' అన్నారు నీరజ.
'ఏమీ లేదు మేడమ్‌.. ఏదయినా వుంటే చెబుతానుగా' అంది సిరి.
సిరి నీరజ మేడమ్‌తో క్లోజ్‌గానే వుంటుంది. సైన్స్‌ యాక్టివిటీస్‌, సైన్స్‌ఫేర్స్‌లో పాల్గొనటంలో ముందుంటుంది సిరి.
'సరే సిరి, ఇక నుంచి చదువు మీద శ్రద్ధ పెట్టు. మన స్కూల్‌కి పేరు తేవాలి!' అన్నారు నీరజ మేడమ్‌.
'అలాగే మేడమ్‌' అంటూ తరగతిగదిలోకి వెళ్ళిపోయింది సిరి.
'మేడమ్‌, మీ దగ్గర నుంచి వచ్చాక, సిరి బాగా బాధపడింది. కారణం అడిగితే చెప్పడం లేదు' అంది సిరి స్నేహితురాలు నవ్య.
'అవునా! ఇంటి దగ్గర ఏమన్నా సమస్యలు వున్నాయేమో ముందు కనుక్కొని ఆ తరువాత సిరితో మాట్లాడదాం' అంది నీరజ.
వెంటనే సిరి వాళ్ళ ఇంటికి వెళ్ళింది నీరజ. సిరి తల్లిదండ్రులు నీరజని ఎంతో గౌరవంగా లోపలికి తీసుకుని వెళ్లారు. చిన్న పెంకుటిల్లు.. 'కబురు చేస్తే మేమే వచ్చేవాళ్ళంగా మేడమ్‌' అన్నారు వాళ్ళు.
'ఫర్వాలేదు. వేరే పని మీద ఇలా వెళుతూ మీ ఇంటికి వచ్చాను. అవును ఈ మధ్య సిరి మూడీగా ఉంటుంది. చదువులోనూ చురుకుదనం తగ్గింది. ఇంట్లో ఏమైనా సమస్యా? లేక మీరేమన్నా అన్నారా?' అడిగింది నీరజ.
'లేదు మేడమ్‌, ఎవ్వరూ ఏమీ అనలేదు. ఇంటి దగ్గర కూడా సరిగా చదవడం లేదు' అన్నారు వాళ్ళు.
'ఆలోచించి చెప్పండి. ఈ మధ్య సిరి చదువు గురించి గానీ, తన భవిష్యత్తు గురించి గానీ ఏదైనా చర్చ జరిగిందా..?' అడిగారు నీరజ.
కొద్ది క్షణాల తర్వాత 'ఆ గుర్తొచ్చింది మేడమ్‌. సిరి పరీక్ష పాస్‌ అయితే ఎలా చదివించాలి. ఇల్లు అమ్మేద్దాం అనుకున్నాం.. బహుశా అది విన్నదేమో!' అన్నారు వాళ్ళు.
'అవునా..! సరే ఆ సంగతి నేను చూస్కుంటాను. మీరు కూడా దిగులుపడకండి. బాగా చదివే పిల్లల గురించి మేమూ బాధ్యత తీసుకోవాలి. నీరజ చదువు గురించి మేమూ ఆలోచిస్తాం. మీరిక సిరి చదువు గురించి మరచిపొండి' అన్నారు నీరజ.
స్కూల్‌లో స్టాఫ్‌మీటింగ్‌ పెట్టి, సిరి విషయం చర్చించారు. వారి వారి శక్తి మేరకు అందరూ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. 'నేనే ఆమెను ఇంటర్‌ చదివిస్తా!' అన్నారు సత్యం మాస్టారు.
'ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అడుగు ముందుకే వేయాలి. ఈ రోజుల్లో పిల్లలు చదవక బాధ పడే తల్లిదండ్రులెందరో వున్నారు. అలాగే బాగా చదివే పిల్లలను ప్రోత్సహించేవారూ ఉన్నారు. మన స్కూల్‌లో చదివి, ఉన్నత స్థితిలో ఉన్నవారు పేద పిల్లల చదువు కోసం ఫండ్స్‌ రూపంలో కొంత డబ్బు ఏర్పాటు చేశారు. పేరెంట్స్‌ చదివించలేరని ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు మీరు. విషయం మాకు చెబితే మేమూ బాధ్యత వహిస్తాం. నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి, మీ తల్లిదండ్రులకు అండగా ఉండాలి. ఇక అన్నీ మరచిపోయి, నీ చదువు మీద శ్రద్ధ పెట్టు. నీ పై చదువుల సంగతి మేం చూస్తాం సరేనా!' అని టీచర్స్‌ అంతా సిరికి ధైర్యం చెప్పారు.
'అలాగే మేడమ్‌!' అంటూ నవ్వుతూ క్లాస్‌కి వెళ్ళింది సిరి.
పరీక్షలకి వెళ్ళేటప్పుడు పిల్లలందరికీ 'బాగా రాయాలి!' అని టీచర్లందరూ చెప్పారు.. ముఖ్యంగా సిరికి.

కూచిమంచి నాగేంద్ర
91821 27880