- 2031 నాటికి 1.17 లక్షల మంది పదవీ విరమణ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ పాలనలో కీలకంగా వ్యవహరించాల్సిన ఉద్యోగులు, అధికారులు రానున్న ఎనిమిది సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో రిటైర్ కానున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సరైన నియామకాల ప్రక్రియ చేపట్టకపోతే భారీ నష్టం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారిక లెక్కల ప్రకారమే లక్ష మందికి పైగా ఉద్యోగులు, అధికారులు 2031 నాటికి పదవీ విరమణ చేయనున్నారు.
గత కొన్నేళ్లుగా సరైన నియామకాలు లేకపోవడం వల్ల భారీగా ఖాళీలు ఏర్పడుతున్నాయి. నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గ్రూప్-1 వరకు ఆశించిన స్థాయిలో నియామకాలు జరగడం లేదు. అడపాదడపా కొన్ని నియామకాలు జరుగుతున్నప్పటికీ.. వాటికన్నా పదవీ విరమణ చేసే వారి సంఖ్య భారీగా ఉంటోంది. భవిష్యత్తులో ఇదే సమస్యగా మారనుంది. తాజాగా తెలిసిన సమాచారం మేరకు 2031 నాటికి 1,17,355 మంది పదవీ విరమణ చేయనున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ పరిమితి పెంచడం వల్ల 2022, 2023 సంవత్సరాల్లో పదవీ విరమణ చేసే వారు లేరు. ఆ తరువాత 2024 నుంచి వరుసగా రిటైర్‌మెంట్ తీసుకునే ఉద్యోగులు పెరగనున్నారు. 2024లో 13,643 మంది పదవీయ విరమణ చేయనుండగా, అక్కడి నుంచి ప్రతియేటా వారి సంఖ్య పెరగనుంది. 2030 వరకు భారీగా పెరుగుతుండగా, 2031లో మాత్రం కొద్దిగా తగ్గనుంది.
పింఛన్లకు 2.74 లక్షల కోట్లు
పదవీ విరమణ చేసే వారి సంఖ్య ఎంంతగా పెరుగుతోందో వారికి చెల్లించాల్సిన పింఛను మొత్తం కూడా అంతే స్థాయి లో పెరుగుతోంది. 2024 నురచి 2031 వరకు ఎనిమిదేళ్లలో ఏకంగా 2,73,780 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఒక అంచనా. అత్యధికంగా 2031లో ఒక్క సంవత్సరమే 34,252 కోట్లు పింఛనుదారులకు చెల్లించాల్సి ఉంటుంది.











