Jul 29,2023 21:50

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రేషన్‌ మాఫియాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా అర్హులందరికీ రేషన్‌ డిపోల ద్వారా అందజేయడం గురించి చెప్పకుండా.. మాఫియా గత ప్రభుత్వంలోనూ, ఇప్పుడూ ఉందని పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పడం విస్మయం కలిగిస్తోందని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని అక్రమ రవాణా చేసి లాభాలు పిండుకుంటున్నారని విమర్శించారు. బహిరంగ మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నాయని, రైతులు ధాన్యం అమ్ముకున్నాక బియ్యం ధరలు పెంచుతున్నారని తెలిపారు. దీనికి తోడు కేంద్రం రేషన్‌ బియ్యంపై కోత విధించిందని పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబం నెలకు రూ.1500లకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని వివరించారు. బియ్యం అక్రమ రవాణా ఆపి సరసమైన ధరలకు వినియోగదారులకు అందించాలని కోరారు. గతంలో రేషన్‌ డిపోల ద్వారా సరఫరా చేసిన సరుకులు కూడా క్రమేణా తగ్గించేశారని పేర్కొన్నారు. కొన్నిచోట్ల కందిపప్పు ఇవ్వడం లేదని, సరఫరా చేసే క్వాంటిటీ తగ్గించేశారని తెలిపారు. సరఫరా చేసేవి కూడా నాణ్యత లేనివిగా ఉన్నాయని పేర్కొన్నారు. కాబట్టి అర్హులైన పేదలకు సక్రమంగా రేషన్‌ డిపోల ద్వారా నాణ్యమైన బియ్యం, కందిపప్పు, పంచదార, నూనె, చింతపండు మొదలైనవి అందేట్లు చూడాలని కోరారు.