ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :కడప జిల్లాలో స్టీలుప్లాంటు సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకం కాదని కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర ప్రజలను మోసగించడమేనని, దీనికి నిరసనగా ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు జరపాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ధర్నాల్లో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, రాష్ట్ర ప్రగతి కోరుకునేవారు పాల్గని జయప్రదం చేయాలని కోరారు. కడపలో రాష్ట్రమే సొంతంగా కర్మాగారం నిర్మిస్తుందంటూ ఆర్భాటంగా శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకూ దానికి అతీగతి లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా పార్లమెంటులో ప్రకటన చేస్తుంటే రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార, ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు మాట్లాడకుండా కూర్చోవడం బిజెపికి సాగిలపడటం తప్ప మరొకటి కాదని శ్రీనివాసరావు విమర్శించారు.










