Sep 12,2023 21:45

లండన్‌ పర్యటన అనంతరం తాడేపల్లి చేరకున్న జగన్మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. లండన్‌ పర్యటన అనంతరం మంగళవారం ఉదయం ఆయన తాడేపల్లి చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి తదితరులు స్వాగతం పలికారు. క్యాంపు కార్యాలయానికి చేరుకున్న అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సిఎస్‌ జవహర్‌రెడ్డి, డిజిపి కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ రామాంజనేయులు, ఎఎజి పొన్నవోలు సుధాకరరెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులతో సిఎం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాకూడదని తెలిపారు. అన్ని జిల్లాల అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టు అనంతరం రాష్ట్రంలో జరిగిన పరిణామాలను డిజిపి సిఎంకు వివరించారు. కోర్టులో జరిగిన వాదనలు, చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండుపై పొన్నవోలు సిఎంకు వివరించారు. స్కిల్‌ డెవలప్‌మొట్‌ స్కామ్‌కు సంబంధించిన ఫైల్స్‌ అన్నీ ఎక్కడ ఉన్నాయో పరిశీలించాలని తెలిపారు. వాదనల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు, అలాగే పలు ప్రాజెక్టుల పనులు జరుగుతున్న తీరుపైనా సిఎం అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.