Nov 15,2023 22:07

మాచర్ల (పల్నాడు) : పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈరోజు ఉదయం మాచర్లకు చేరుకున్న సిఎం జగన్‌కు ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, ఆదిమాలపు సురేష్‌, ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు పలువురు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. 'వైఎస్సార్‌ పల్నాడు కరువు నివారణ పథకం' కింద రూ.340.26 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి కీలకమైన కేంద్ర అటవీ, పర్యావరణశాఖతోపాటు అన్ని అనుమతులు సాధించిన తక్షణమే సిఎం జగన్‌ ఈ పనులను ప్రారంభించనున్నారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 20 వేల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో పూర్తిగా పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్‌ ఇదే కావడం విశేషం. 4 పంపుల ద్వారా 281 క్యూసెక్కుల నీటి సరఫరా అయ్యేలా 1.57 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా దీనికి రూపకల్పన చేశారు. ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదీ జలాలను మళ్లించి వెనుకబడిన మెట్ట ప్రాంతాల ప్రజల కష్టాలు తీర్చేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.