
ఇలాంటి నేపథ్యంలో జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవలేదు. తన హయాంలో మరే సిజెఐ విషయంలోనూ మోడీ హాజరుకాకపోవడం జరగలేదు. ఇది పొరబాటనీ, ఆయన విముఖతకు నిదర్శనమనీ వ్యాఖ్యలు వచ్చాయి. కొంతమంది ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యాతలు రెండేళ్ల పాటు వుండబోయే సిజెఐ చంద్రచూడ్ తీరును కనిపెట్టి వుండాలని రాయడం గమనించదగింది. న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు ఈ తరుణంలోనే కొలీజియం వ్యవస్థపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణయాధికారం ప్రభుత్వానిదే గాని న్యాయస్థానాలది కాదని చెబుతూ వచ్చారు.
మొత్తంపైన గత కొద్ది సంవత్సరాలుగా సుప్రీం కోర్టు ధోరణిలో కొంతైనా మార్పు కనిపించడం, స్వతంత్రత అవసరాన్ని నొక్కి చెప్పడం స్వాగతించదగింది. దీనిపై కేంద్రం స్పందనలూ సుప్రీం తదుపరి అడుగులూ కూడా జాగ్రత్తగా చూడాల్సి వుంటుంది. మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలపైనా సమాఖ్యతత్వం, లౌకిక తత్వం, భావప్రకటనా స్వేచ్ఛ వంటి వాటిపైనా తీవ్ర దాడి చేస్తున్న సమయంలో వాటి రక్షణకు సుప్రీంకోర్టు కీలక పాత్ర వహించాలని ప్రజలు ఆశిస్తున్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తిగా డి.వై. చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశాక సుప్రీంకోర్టులో ఇటీవల కొన్ని నూతన పరిణామాలు చూస్తున్నాం. కొలీజియం సిఫార్సులు, కీలక, కేసుల పోస్టింగు రిజిస్ట్రేషన్, బదిలీలు, కేంద్ర న్యాయశాఖ స్పందనలు, కొన్ని రాజ్యాంగ కేసుల విచారణ వంటి అన్ని విషయాల్లోనూ కొత్త వాతావరణం కనిపిస్తున్నది. దేశ చరిత్రలోనే అత్యధికంగా ఏడున్నరేళ్లు సిజెఐగా పనిచేసిన వై.వి.చంద్రచూడ్ కుమారుడైన ప్రస్తుత సిజెఐ రెండేళ్లపైన పదవిలో కొనసాగనుండటం గత పదేళ్లలో ఇదే ప్రథమం. అనేక సందర్భాల్లో స్వతంత్ర విమర్శనాత్మక వైఖరి ప్రదర్శించి సంచలన తీర్పులు ఇచ్చిన సిజెఐ చంద్రచూడ్ పదవీ కాలంపై ముందే చాలామందిలో ఆశావిశ్వాసాలు వ్యక్తమైనాయి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మరీ ముఖ్యంగా ప్రధాని మోడీ హయాంలో న్యాయ వ్యవస్థ కేంద్రానికి విధేయంగానూ, అనుకూల రీతిలోనూ వ్యవహరిస్తున్నదనే అభిప్రాయం బలపడింది. అందుకు అనేక ఆధారాలూ వున్నాయి. ప్రజల మౌలిక హక్కులకూ లౌకిక తత్వానికీ సంబంధించిన కేసులు వెనక్కుపోవడం, దేశద్రోహం రాజద్రోహం వంటి పేర్లతో అనేక మంది అభ్యుదయవాదులను దారుణమైన శిక్షలకు గురిచేయడం, పౌరసత్వ సవరణ చట్టం, జమ్ము-కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ఎన్నికల బాండ్లు ఇంకా అనేకానేక మౌలికమైన అంశాలు ఏళ్లతరబడి విచారణకు నోచుకోవడం లేదు గాని ప్రార్థనా స్థలాల వివాదాలు మాత్రం పదేపదే ముందుకొచ్చాయి. న్యాయమూర్తుల పైన వివాదాలు, ఫిర్యాదులు తీవ్రమైనాయి. అయిదేళ్ల కిందట అప్పటి ప్రధాన న్యాయమూర్తిపైనే సహచర సీనియర్లు ధ్వజమెత్తాల్సి వచ్చింది. హైకోర్టులూ అనేకసార్లు భిన్నాభిప్రాయం వెలిబుచ్చాయి. మరో వంక కేంద్రం ఏకపక్ష జోక్యం, వ్యాఖ్యలు ఒత్తిడి తేవడం కనిపించింది. మాజీ ప్రధాన న్యాయమూర్తిని రాజ్యసభకు పంపడమూ జరిగింది. ఇన్ని పరిణామాల మధ్య సిజెఐగా వచ్చిన జస్టిస్ ఎన్.వి.రమణ అత్యధికంగా జడ్జిల నియామకం చేయడానికి ప్రాధాన్యతనిచ్చారు. పైన చెప్పిన కేసులన్నీ అలాగే వదలి పదవీ విరమణ చేయగా జస్టిస్ యు.యు.లలిత్ ఇంచుమించు రెండు మాసాల పాటు ఆ స్థానంలోకి వచ్చారు. ఆయన సుప్రీంలో కేసులు వేగంగా పరిష్కరిస్తానంటూ పెద్దఎత్తున ధర్మాసనాలకు కేటాయిస్తూ వచ్చారు. ఇడబ్ల్యుఎస్ రిజర్వేష్వన్ల వంటి ఒకటి రెండు కేసులు మాత్రం పరిష్కారం చేసి దిగిపోయారు. ఆ సందర్భంగా తాను రాజ్యసభ పదవి వంటివి తీసుకోను గాని పార్లమెంటు ఆమోదించే ట్రైబ్యునళ్లు వంటి వాటిని తీసుకోవడానికి అభ్యంతరం లేదని ప్రకటించారు. ప్రొఫెసర్ సాయిబాబా విడుదలకు హైకోర్టు తీర్పు చెబితే సుప్రీం కోర్టు ఆలస్యం చేసిన తీరుకు తన బాధ్యత లేదని సమర్థించుకున్నారు.
చంద్రచూడ్ తొలి చర్యలు
సిజెఐగా చంద్రచూడ్‌పై ఆశలుండటానికి కారణముంది. ఆయన ఇచ్చిన తీర్పులు అలాంటివి. 377 అధికరణం స్వలింగ సంపర్కుల కేసు, వివాహేతర సంబంధాలలో మహిళల పట్ల వివక్షత, బాలికలను దత్తత తీసుకోవడం, శబరిమలలో మహిళల ప్రవేశం, అవివాహితల గర్భస్రావ హక్కు, అత్యాచారం కేసుల్లో రెండు వేళ్లతో పరీక్ష రద్దు వంటి అనేక సంచలన తీర్పులు హైకోర్టులోనూ సుప్రీంక కోర్టు లోనూ కూడా వెలువరించారు. ప్రాథమిక హక్కుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ విషయాల్లో ముందున్నారు. గుజరాత్ మారణకాండపై తీసిన చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ నిలిపివేతను కొట్టివేశారు. ఆదాయపన్ను శాఖపై వోడా ఫోన్ ఫిర్యాదును తోసిపుచ్చారు. మతతత్వ పూరితంగా ఓట్లు అడగడానికి, నిజమైన సమస్యలు చెప్పడానికి తేడా వుందని ఒక తీర్పులో స్పష్టంచేశారు. గోప్యత హక్కును సమర్థించే తీర్పునిచ్చారు. ఢిల్లీ పాలన ముఖ్యమంత్రిదే తప్ప లెఫ్టినెంట్ గవర్నర్‌ది కాదని స్పష్టంగా తీర్పునిచ్చారు. ఆధార్ చట్టం చెల్లుబాటును మెజార్టీ తీర్పు ఆమోదిస్తే అది సరైన రీతిలో రాజ్యాంగ బద్దంగా ఆమోదించలేని జస్టిస్ చంద్రచూడ్ ఒక్కరే మైనార్టీ తీర్పునిచ్చారు. సైన్యంలోనూ మహిళా అధికారుల పట్ల వివక్ష చెల్లదన్నారు. ఇలాంటివి ఇంకా చాలా వున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవలేదు. తన హయాంలో మరే సిజెఐ విషయంలోనూ మోడీ హాజరుకాకపోవడం జరగలేదు. ఇది పొరబాటనీ, ఆయన విముఖతకు నిదర్శనమనీ వ్యాఖ్యలు వచ్చాయి. కొంతమంది ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యాతలు రెండేళ్ల పాటు వుండబోయే సిజెఐ చంద్రచూడ్ తీరును కనిపెట్టి వుండాలని రాయడం గమనించదగింది. న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు ఈ తరుణంలోనే కొలీజియం వ్యవస్థపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణయాధికారం ప్రభుత్వానిదే గాని న్యాయస్థానాలది కాదని చెబుతూ వచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత న్యాయ కమిషన్‌ను పునర్నిర్మించారు.
సంప్రదాయికంగా ప్రమాణ స్వీకారానికి ముందు సిజెఐ ఇచ్చిన ఇంటర్వ్యూలలో సామాన్యునికి న్యాయం అందించడం మొదటి ప్రాధాన్యత అన్నారు. జస్టిస్ రమణ హయాంలో జడ్జిలపై విమర్శలను, ఆరోపణలను గట్టిగా ఖండిస్తూ వచ్చారు. గాజు ఇళ్లలో వలె భద్రత లేకుండా పోయిందన్నారు. ఇందుకు భిన్నంగా సిజెఐ చంద్రచూడ్ న్యాయమూర్తులు కూడా సోషల్ మీడియా విస్తరణను న్యాయమూర్తులు కూడా గుర్తించాలని విమర్శలకు సిద్ధం కావాలని సూచించారు. కొలీజియం వ్యవస్థ పరిస్థితిని బట్టి వచ్చిందే తప్ప ఉద్దేశపూర్వకమైంది కాదన్నారు. జడ్జిల నియామకం సమయంలో చాలా విషయాలు పరిశీలించాలంటే అందుకు ఒక వేదిక తప్పదనీ, అయితే నియామకాలు మాత్రం పారదర్శకంగా వుండాలని స్పష్టం చేశారు. న్యాయమూర్తులు వ్యక్తిగతంగా తీర్పరుల్లా జడ్జిమెంటల్‌గా వ్యవహరించరాదనీ, వాస్తవాలనుబట్టి నిర్ణయించాలని స్పష్టంచేశారు. జడ్జిల నియామకం పారదర్శకంగా వుండాలనీ అనేశారు.
బాధ్యతలు చేపట్టిన వెంటనే సిజెఐ చంద్రచూడ్ కేసులను నమోదు చేసి ధర్మాసనాల ముందుకు తెచ్చే విషయంలో పారదర్శకమైన ప్రకటన చేశారు. కేసుల భారం తగ్గించేందుకు అంతకు ముందు జరిగిన దానికి భిన్నంగా అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. దీర్ఘకాలంగా మగ్గిపోతున్న బెయిలు దరఖాస్తులు, కేసుల బదిలీలు మాత్రం భారీ ఎత్తున ప్రతి రోజూ చేపట్టాలని నిర్ణయించారు. తొలి కొలీజియం సమావేశంలోనే ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేశారు. దీనిపై తెలంగాణ, గుజరాత్ హైకోర్టులలో న్యాయవాదలు నిరసన తెలిపితే పిలిపించి చర్చలు చేసి కొన్ని మార్పులు చేశారు. అయినా ఎ.పి హైకోర్టు నుంచి ఇద్దరు న్యాయమూర్తుల బదిలీపై జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ గణేశ్‌ల బదిలీ గురించి రాజకీయ పరిభాషలో నిరసన సాగుతున్నది. ఇంతకు ముందు కోర్టులపై వైసిపి వారు ఆరోపణలు చేస్తే ఈ బదిలీలపై టిడిపికి అనుకూలమైన వారు కొందరు శృతిమించిన వ్యాఖ్యలు కూడా చేశారు. తాము సిఫార్సు చేసిన పేర్లను కేంద్రం తొక్కిపట్టడంపై సిజెఐ చంద్రచూడ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. అంతేగాక సుప్రీంకోర్టు వీటి గురించి కేసు విచారణ చేపట్టి కేంద్రానికి నోటీసు కూడా ఇచ్చింది. కీలకమైన ఢిల్లీ, ముంబాయి హైకోర్టుల వంటివి కూడా గతం కన్నా తీవ్రమైన తీర్పులివ్వడం కనిపిస్తున్నది. మాజీ సిజెఐపై ఎ.పి ముఖ్యమంత్రి జగన్ గతంలో ఆరోపణలతో లేఖ రాయడం కూడా విచారణకు రానుంది. రాజధాని కేసులు, వాటిపై నిర్ణయం తీసుకోవడం గురించి రాజ్యాంగాధికారాలు కూడా ఇప్పుడు సుప్రీం ముందున్నాయి.
సిఇసి నియామకం-ఏకపక్ష వైఖరి
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) నియామకంలో కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిని లోపభూయిష్టమైన నియామకాలను జస్టిస్ జోసఫ్ నాయకత్వం లోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ప్రశ్నించిన తీరు ఇటీవలి కాలంలో మనం ఎరుగనిది. రాజ్యాంగంలోని 324వ అధికరణం ప్రకారం సిఇసి ఆరేళ్ల కాలం గాని, 65 ఏళ్ల వయసు వరకూ గాని పదవిలో కొనసాగవచ్చు. కాని ఏరికోరి కేవలం ఏడాదిలోపు రిటైరయ్యే వారినే నియమించడం ద్వారా సిఇసిలు కీలుబొమ్మల్లా మార్చివేయబడుతున్నారు. వారేదైనా కీలకమైన నిర్ణయం తీసుకునే లోపే దిగిపోవలసిన స్థితి. తొలి సిఇసి ఎనిమిదేళ్లు పనిచేశారు. కాని కేంద్రం ఏరికోరి 1950లలో పుట్టిన వారినే ఎంపిక చేస్తున్నదని, వారు తమకు తలూపేలా వుండాలనుకుంటున్నదనీ సుప్రీం వ్యాఖ్యా నించింది. యుపిఎ హయాంలో ఆరుగురు, మోడీ ఏడేళ్ల పాలనలో ఎనిమిది మంది సిఇసిలు మారారని గుర్తు చేసింది. రాజ్యాంగం ఈ నియామక ప్రక్రియపై పూర్తి స్పష్టతనివ్వలేదని సిఇసిని ఎంపిక చేసే కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా వుంటే మంచిదని సూచించింది.
ఎన్నికల వ్యవస్థ స్వతంత్రతపై అనేక సందేహాలు ముసురుకుంట్ను వేళ సుప్రీం కోర్టు ఈ అంశాన్ని చేపట్టడం ఆహ్వానించదగింది. ఈ మాత్రం వ్యాఖ్యలు సహించలేని కేంద్ర అటార్నీ జనరల్ వెంకట రమణ మీరు మాట మీరవద్దు అనడం కేంద్రం వైఖరిని చెబుతుంది. న్యాయమూర్తులుంటే తప్పు జరగదని చెప్పలేమని ఆయన చేసిన వ్యాఖ్య అసహనపూరితమైంది. కొలీజియం ఒకటికి రెండు సార్లు చర్చించి న్యాయమూర్తుల పేర్లు సిఫార్సు చేశాక ఏమీ తేల్చకుండా కేంద్రం ఎడతెగని జాప్యం చేయడం సరికాదని కూడా ఇటీవల సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. మొత్తంపైన గత కొద్ది సంవత్సరాలుగా సుప్రీం కోర్టు ధోరణిలో కొంతైనా మార్పు కనిపించడం, స్వతంత్రత అవసరాన్ని నొక్కి చెప్పడం స్వాగతించదగింది. దీనిపై కేంద్రం స్పందనలూ సుప్రీం తదుపరి అడుగులూ కూడా జాగ్రత్తగా చూడాల్సి వుంటుంది. మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలపైనా సమాఖ్యతత్వం, లౌకిక తత్వం, భావప్రకటనా స్వేచ్ఛ వంటి వాటిపైనా తీవ్ర దాడి చేస్తున్న సమయంలో వాటి రక్షణకు సుప్రీంకోర్టు కీలక పాత్ర వహించాలని ప్రజలు ఆశిస్తున్నారు. అప్పుడే అత్యున్నత నాయస్థానంపై కేంద్రం ఒత్తిడి పెరగడం కనిపిస్తూనే వుంది. మరి సిజెఐ చంద్రచూడ్ హయాంలో సుప్రీంకోర్టు కేంద్రం ఒత్తిడిని, దాడులను తట్టుకుని రాజ్యాంగ రక్షణకు తగు వైఖరి తీసుకుంటేే దేశానికి, ప్రజాస్వామ్యానికి గొప్ప మేలు జరుగుతుంది.
తెలకపల్లి రవి