Oct 13,2022 07:55
  • క్రిప్టో మైనింగ్‌ పేరుతో దోపిడీ
  • సుమారు రూ.600 కోట్లు వసూళ్లు?
  • రాజంపేట ఎస్‌పికి బాధితుల ఫిర్యాదు

ప్రజాశక్తి- రాజంపేట : 'వంద రోజుల్లో పదింతల డబ్బులు ఇస్తాం. ప్రతిరోజు ఉదయం ఆరుగంటల కల్లా మీ అకౌంట్‌లో డబ్బులు వేస్తాం. త్వరపడండి' అంటూ వాట్సప్‌ గ్రూపుల ద్వారా సిసిహెచ్‌ యాప్‌ భారీ ప్రకటనలు చేసింది. దీంతో ప్రజలు భారీ ఎత్తున పెట్టుబడి పెట్టారు. నెల రోజుల వరకూ చెల్లింపులు చేసినా తర్వాత అసలు రంగు బయటపడింది.
సిసిహెచ్‌ పేరుతో కొందరు ఆర్ధిక నేరగాళ్లు ఆగస్టు నెలలో ఒక యాప్‌ను సృష్టించారు. ఇది అమెరికాకు చెందిన కంపెనీ అని, సోలార్‌ మైనింగ్‌ చేస్తున్నామని, కొత్తగా సియుఎక్స్‌ అనే క్రిప్టో కరెన్సీనీ అన్ని ప్రముఖ క్రిప్టో ఎక్చేంజీలలో విడుదల చేయనున్నామని వాట్సప్‌ గ్రూప్‌ల ద్వారా భారీ ప్రకటనలు గుప్పించింది. 10 డాలర్ల నుంచి 300 డాలర్ల వరకూ ఇందులో డిపాజిట్‌ చేయవచ్చని, 100 రోజుల్లో పదింతల యుఎస్‌డిటిలు మీ యాప్‌ అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతాయని నమ్మబలికింది. కంపెనీ చెప్పిన మొత్తం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకే బినాన్స్‌, ట్రస్ట్‌ వాలెట్‌ అకౌంట్లలోకి వేస్తుండటం.. అది నగదుగా మారడంతో మరింతమంది దీని పట్ల ఆకర్షితులయ్యారు. సుమారు రెండు నెలలపాటు ఈ చెల్లింపులు కొనసాగడంతో ఒకరి ద్వారా మరికొందరికి రిఫర్‌ అండ్‌ ఎర్న్‌ పద్ధతితో ఈ బిజినెస్‌ విస్తరించడంతో దేశవ్యాప్తంగా ఇందులో పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడిపై పదింతల మొత్తాన్ని వంద రోజుల్లో ఇస్తామని తొలుత చెప్పిన కంపెనీ ఇటీవల కొన్ని ప్లాన్లు, టేబుళ్లు విడుదల చేసి ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. నాలుగు రోజులు, మూడు రోజులు, రెండు రోజులలోనే అసలు తిరిగి ఇస్తామని నమ్మబలికింది. దీంతో ప్రజలు భారీ ఎత్తున పెట్టుబడి పెట్టారు. అయితే కొద్ది రోజులుగా యుఎస్‌డిటిలు హోల్డ్‌లోనే ఉండి బినాన్స్‌,ట్రస్ట్‌ వాలెట్‌లోకి జమ కాకపోవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ప్రజలు తమ ఎత్తుగడలను గమనించారని యాప్‌ నిర్వాహకులు మరో వ్యూహాన్ని రచించారు. లావాదేవీ ఫీజు చెల్లిస్తేనే పెండింగ్‌లోని అమౌంట్‌ వేస్తామని, లేదంటే అంతర్జాతీయ కోర్టుకు లాగుతామని పెట్టుబడి దారులకు సందేశాలు పంపారు. సైబర్‌ నేరగాళ్లు దేశవ్యాప్తంగా సుమారు రూ.600 కోట్లు మోసానికి పాల్పడినట్లు సమాచారం. మన రాష్ట్రంలోని బాధితులు అన్నమయ్య జిల్లా రాజంపేట ఎస్‌పిని కలిసి మంగళవారం ఫిర్యాదు చేశారు.