Jun 16,2022 06:38

ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టం తన పని చేసుకుని పోవడం సాధారణ విషయం. అభివృద్ధి చెందిన అన్ని నాగరిక సమాజాలు ఈ సూత్రాన్నే అమలు చేస్తాయి. కానీ, భారతీయ జనతా పార్టీ తీరు వేరు! ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలపైన వారికి నమ్మకం ఉన్నట్టు ఏ కోశానా కనిపించదు. ఇక మన రాజ్యాంగం గురించి, అందులో పేర్కొన్న అధికరణాల అమలులో వారి చిత్తశుద్ధి ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈ విషయం రుజువైంది. ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీదా నమ్మకం లేని వారు తమ వ్యతిరేక గళాలను అణచి వేయడానికి, తమకు నచ్చని వారిని కష్టాల పాలు చేయడానికి ఎన్ని కుయుక్తులు పన్నుతారో, చట్టాలను ఎలా తుంగలో తొక్కుతారో, చెప్పడానికి కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల్లో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వాలు అమలు చేస్తున్న బుల్డోజర్‌ రాజ్యమే నిదర్శనం! ఈ విద్యలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రెండాకులు ఎక్కువే చదివారు! అందుకే, అక్కడ అడుగడుగునా బుల్డోజర్‌ నీతి (ఇళ్లను కూల్చడానికి బుల్డోజర్లను పంపడంతో పాటు, చట్టాలను బుల్డోజ్‌ చేసి తమ వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా శిక్షించడం) అమలవుతోంది. చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వమే చిమ్ముతున్న ఈ విద్వేష విషానికి ఎక్కువగా బలయ్యేది మైనార్టీలే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రయాగ్‌రాజ్‌, సహారన్‌పూర్‌, కాన్పూర్‌లలో ఇదే పరిస్థితి. విద్యార్థి నాయకురాలు అఫ్రిన్‌ ఫాతిమా నుండి, సిఎఎ, ఎన్‌ఆర్‌సిలను వ్యతిరేకించే వారు, సంఫ్‌ుపరివార్‌ విద్వేష విషాన్ని ప్రతిఘటించే వారు... ఇలా ఎవరైనా సరే బుల్డోజర్లను ఎదుర్కోక తప్పని స్థితులు ఏర్పడ్డాయి. ఈ సర్కారీ హింసను తక్షణమే ఆపి, చట్టాలను అమలు చేసేలా జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ ఏకంగా 12 మంది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో పాటు, పలువురు న్యాయవాదులు, ప్రముఖులు లేఖ రాయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
2024 నాటికి ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను రూపొందిస్తానంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రకటన కరోనా విజృంభణకు ముందే నీరుగారింది. ఆర్థిక నిపుణులు ఈ విషయాన్ని స్పష్టంగానే చెప్పారు. కోవిడ్‌ విజృంభించిన గత రెండు సంవత్సరాల కాలంలో ఆర్థిక వ్యవస్థ మరింత మందగించడంతో ప్రభుత్వం అనుసరించిన విధానాలు సామాన్యులకు పెనుభారంగా మారాయి. ఈ కాలంలో దేశంలోని కార్పొరేట్ల ఆస్తులు ఇబ్బడి మబ్బడిగా పెరిగాయని, అదే సమయంలో సామాన్యులు కష్టాల కొలిమిలో చిక్కుకుపోయారని అనేక జాతీయ, అంతర్జాతీయ సర్వేలు తేల్చి చెబుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పైకి ఎగబాకాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అదే స్థాయిలో పతనమయ్యాయి. బిజెపి ఛీర్‌ లీడర్ల సంగతి ఎలా ఉన్నప్పటికీ సగటు జీవి జీవితం ఇంతలా సతమతం కావడం ఇటీవల కాలంలో ఎన్నడూ లేదు. ఈ పరిస్థితి ఇప్పుడప్పుడే మారే అవకాశాలు లేవు. ఆర్థికరంగంలో చోటుచేసుకున్న ఈ విపరీతం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి బిజెపి, దాని మార్గదర్శి ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక వ్యూహం ప్రకారం ప్రజలను నిట్టనిలువునా చీల్చడానికి బరితెగిస్తున్నాయి. ఆర్టికల్‌ 370 రద్దు, పౌరసత్వ చట్ట సవరణ, మైనార్టీల ఆహార అలవాట్లు, వేషధారణలపై దాడులు, ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులపై కేసులు, రాజ్యాంగ వ్యవస్థలు, మీడియా స్వతంత్రతను నీరుగార్చి తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం ఇవన్నీ బుల్డోజర్‌ రాజ్యంలో భాగమే.
బుల్డోజర్‌ అంటే ఇప్పుడు కేవలం యంత్రం మాత్రమే కాదు! విద్వేషానికి, విధ్వంసానికి చిహ్నం. హిందూ మతోన్మాదుల చేతుల్లో ఆయుధం. ప్రజాస్వామ్యానికి, సంక్షేమ రాజ్యానికి, లౌకికతత్వానికి శత్రువు! ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న దీనిని ఎదుర్కోవడమే ప్రస్తుతం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులతో పాటు రచయితలు, మేథావులు, కళాకారులు ఈ దిశలో కదలాలి. బుల్డోజర్లతో పోరాటం ఎలా చేయాలో షాహీన్‌బాగ్‌లో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ దేశ ప్రజలకు చూపారు! అటువంటి పోరాటాలు వీధివీధినా జరగాలి. ప్రజలు విస్తారంగా పాల్గొని ప్రతిఘటించాలి. బుల్డోజర్‌ పాలనకు చరమగీతం పలకాలి.