Oct 31,2023 10:01

ఒక్కోసారి పిల్లలు సాధించే విజయాలు చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది. చిన్న పిల్ల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఫోన్‌కి అతుక్కుపోతున్న ప్రస్తుత కాలంలో ఓ పిల్లవాడు సాధించిన ఘనత ఇప్పుడు అబ్బురపరుస్తోంది. ఫొటోగ్రఫీలో ఆస్కార్‌గా భావించే వరల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌(డబ్య్లుపివై)కు బెంగుళూరుకు చెందిన పదేళ్ల బుడతడు అర్హత సాధించాడు. లండన్‌లో నిర్వహించే ఈ వేడుకకు అండర్‌-10 విభాగంలో అవార్డు గెలుచుకున్న ఆ బాలుడి పేరు విహాన్‌ టాల్యా వికాస్‌.
          వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీలో తండ్రిని ఆదర్శంగా తీసుకున్న విహాన్‌కు ఏడేళ్ల ప్రాయం నుండే ఫొటోగ్రఫీపై మక్కువ ఏర్పడింది. 'నాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఫొటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. సృజనాత్మకంగా ఆలోచించడానికి, ప్రకృతితో అనుసంధానం కావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది' అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాడు.
        95 దేశాల నుండి 50 వేల చిత్రాలు ఈ పోటీలో పాల్గొన్నాయి. వాటిలో 100 చిత్రాలను ఎంపికచేశారు. 11 విభిన్న కేటగిరీలలో అవార్డులు ప్రకటించారు. అండర్‌-10 విభాగంలో విహాన్‌ ఈ అవార్డు అందుకోనున్నాడు. విహాన్‌ తీసిన చిత్రం డబ్ల్యుపివై59 సేకరణలో భాగంగా వివిధ దేశాల్లో ప్రదర్శిస్తారు. అలా నేచురల్‌ హిస్టరీ మ్యూజియంలో ఈ చిత్రం వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ఎగ్జిబిషన్‌లో చోటు సంపాదించింది. వన్యప్రాణుల రక్షణపై అవగాహన కల్పించేలా ఈ మ్యూజియం 4 ఖండాల్లోని 25 వేదికలపై పోటీకి ఎంపికైన చిత్రాలను ప్రదర్శిస్తుంది.
         'విహాన్‌ తీసిన ఈ చిత్రం కళ, భావన, పరిరక్షణ, సైన్స్‌ ఉద్దేశ్యాలను వర్ణించేలా ఆవిష్కరించాడు' అంటూ వన్యప్రాణి పరిరక్షణ ఫొటోగ్రాఫర్‌, పోటీ న్యాయమూర్తి ధృతిమాన్‌ ముఖర్జీ విహాన్‌ని అభినందిస్తున్నారు. ఇంతకీ విహాన్‌ తీసిన ఫొటో ఏంటంటే.. నగర శివారులోని ఓ పురాతన రాతి ఫలకంపై చెక్కబడిన కృష్ణ విగ్రహం, దానిపై నిలిచిన అరుదైన జాతికి చెందిన సాలీడుని విహాన్‌ తన కెమెరాలో బంధించాడు.