డిఎస్‌సి నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయటం కేవలం నియామకాల కోసమే కాదు. అది ఒక రాజకీయ అంశం కూడా. ఒక్క డిఎస్‌సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోతే గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగ అభ్యర్థులు, వారి కుటుంబాలు ప్రభుత్వాన్ని నిలదీస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, కర్నూలు వంటి ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలలో ఉపాధ్యాయ ఉద్యోగం పొందటం కుటుంబాలకు ఒక గౌరవంగా భావిస్తారు. రాష్ట్ర విద్యామంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాకు చెందినవారు. వారు విశాల హృదయంతో ఆలోచించి 30 వేలకు పైగా ఖాళీలతో డిఎస్‌సి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నాము.
ఆంధ్రప్రదేశలో ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 1990 నుండి రెగ్యులర్‌గా డిఎస్‌సి పరీక్ష నిర్వహించడం ఆనవాయితీగా మారింది. 2008లో డాక్షర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో 52 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్‌సి నిర్వహించారు. రాష్ట్ర విభజన తరువాత గత ప్రభుత్వం 2018లో 7 వేల పోస్టులతో డిఎస్‌సి పరీక్ష నిర్వహించింది. 2019 మే లో అధికారంలోకి వచ్చిన వై.యస్.జగన్మోహన్‌రెడ్డి ఇంతవరకు ఒక్క డిఎస్‌సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇది శోచనయమైన అంశం. అందువలన డిఎస్‌సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని విద్యామంత్రి బొత్స సత్యనారాయణను నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
30 వేల ఉపాధ్యాయ ఖాళీలు
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలపై ఇటీవల శాసన మండలిలో పి.డి.ఎఫ్, ఇతర శాసనమండలి సభ్యులు ప్రశ్నలు అడిగిన సందర్భంగా 8,366 ఖాళీలు ఉన్నాయని... విద్యామంత్రి బొత్స జిల్లాల వారీగా ఒక పట్టిక అందచేశారు. కానీ రాష్ట్రంలో 1,83,235 మంది ఉపాధ్యాయులు వుండాల్సి వుండగా 1,63,000 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. ఈ ఖాళీలతో పాటు మున్సిపల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, బి.సి రెసిడెన్షియల్ స్కూళ్లు, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూళ్లు... మొదలగు వాటిలో వేలాదిగా ఖాళీలు ఉన్నాయి. రెసిడెన్షియల్ పాఠశాలల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులు లేక గెస్ట్ ఫ్యాకల్టీ, పార్ట్ టైం ఉపాధ్యాయులతో క్లాసులు జరుగుతున్నాయి. మొత్తం ఖాళీలు చూస్తే 30 వేలకు పైగా ఉంటాయి. అందువలన 30 వేలకు పైగా పోస్టులతో డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నిరుద్యోగ అభ్యర్థుల ఆవేదన
రాష్ట్రంలో బిఇడి/డిఇడి పూర్తి చేసిన అభ్యర్థులు ఐదు లక్షలకు పైగా ఉన్నారు. వారు ఎంతో ఆశగా, ఆత్రుతగా డిఎస్‌సి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. 'టెట్' పరీక్షలో ఇప్పటికే అర్హత సాధించిన అభ్యర్థులు మూడు లక్షలకు పైగా ఉన్నారు. అవనిగడ్డ, కర్నూలు, విజయనగరం తదితర ప్రాంతాలలో గత నాలుగేళ్లుగా డిఎస్‌సి కోసం ఎదురుచూస్తు, కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు వేల సంఖ్యలో ఉన్నారు. పేదలు, గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఎక్కువగా డిఎస్‌సికి సన్నద్ధం అవుతున్నారు. వారందరూ ఇప్పటికే కోచింగ్ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
జీవో నెం.117 - రేషనలైజేషన్
పాఠశాల విద్యాశాఖ జీవో నెం.117 ద్వారా ఉపాధ్యాయుల రేషనలైజేషన్ చేపట్టింది. ఈ జీవో పాఠశాల విద్యకు 'ఉరితాడు'గా మారింది. రేషనలైజేషన్ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు తగ్గించడం, విపరీతంగా పోస్టులు అదనంగా వున్నట్టు తేల్చుతారు. వీటిని సర్దుబాటు చేస్తారు. ఈ జీవో ద్వారా పని భారాన్ని కూడా విపరీతంగా పెంచారు. హైస్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ఒకటే కొనసాగించటంతో, 'తెలుగు మీడియం' లేకపోవడంతో కొన్ని పోస్టులు రద్దయ్యాయి. పిల్లలు ఉన్న చోట ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్న చోట తగినంత మంది పిల్లలు లేకపోవటం వలన రేషనలైజేషన్ చేస్తున్నామని చెబుతున్నారు. కాని ఆచరణలో అనేక చోట్ల ఉపాధ్యాయులు లేక పాఠశాలలు విశ్వసనీయతను కోల్పోవటం చూస్తున్నాము. జీవో నెం. 117పై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి జీవోను రద్దు చేయాల్సిన అవసరమున్నది. ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు నాలుగు లక్షలకు పైగా తగ్గారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీనికి ప్రభుత్వం అనుసరించిన అసంబద్ధ విధానాలే కారణం.
3,4,5 తరగతుల తరలింపు
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఏ మాత్రం హేతుబద్ధత లేని అసమంజసమైన నిర్ణయం చేసింది. మూడు కిలోమీటర్ల లోపు ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను హైస్కూల్‌కు తరలించాలనే నిర్ణయం ప్రాథమిక పాఠశాలలకు ఉరితాడుగా మారింది. ఒక కిలో మీటరు లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను హైస్కూళ్లకు తరలించారు. దీనిని తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ఈ నిర్ణయం జాతీయ విద్యా హక్కు చట్టానికి పూర్తి విరుద్ధం. ప్రాథమిక పాఠశాల అంటే జాతీయ విద్యా హామీ చట్టం ప్రకారం 1-5 తరగతులుగాని లేక 1-8 తరగతులు గాని ఉండాలి. ప్రభుత్వ నిర్ణయం వలన వేలాది పాఠశాలల్లో 1, 2 తరగతులు మాత్రమే మిగిలాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 12 వేలకు పైగా పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయి. పి.డి.ఎఫ్ ఎమ్మెల్సీలు 3,4,5 తరగతుల తరలింపుకు వ్యతిరేకంగా గత సంవత్సరం జులైలో 'బడి కోసం బస్సు యాత్ర' నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సందర్భంగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. 3,4,5 తరగతులకు హైస్కూల్‌లో సబ్జెక్ట్ ఉపాధ్యాయులుతో బోధిస్తామని చెబుతున్నారు. కాని 3,4,5 తరగతుల విద్యార్థులకు సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులు మాత్రమే బోధించాలని నేషనల్ కౌన్సల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ తెలుపుతున్నది. తరగతుల తరలింపు వలన విద్యార్థులు సంఖ్య బాగా తగ్గింది.
'సాల్ట్' ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో 'సాల్ట్' ఒప్పందం కుదుర్చుకున్నది. దీనికి ప్రపంచ బ్యాంకు సుమారు రెండు వేల కోట్ల ఉపాధ్యాయుల శిక్షణ, తదితర అంశాలను అందజేస్తున్నది. ఒప్పందం ప్రకారం నిబంధనలలో విద్యారంగంలో టెక్నాలజీ పాత్ర పెంచాలని, మానవ వనరుల పాత్ర తగ్గించాలని పేర్కొన్నది. టెక్నాలజీని మనం వ్యతిరేకించటంలేదు. కాని టెక్నాలజీ ఉపాధ్యాయులకు సహాయకంగా ఉండాలి తప్పితే, ప్రత్యామ్నాయం కాదు. ఇటీవల యునెస్కో తన నివేదికలో కరోనా అనంతరం విద్యారంగంలో టెక్నాలజీ వినియోగం పెరిగిందని, కాని టెక్నాలజీ ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టంగా చెప్పింది. 'బైజూస్' కంటెంట్ విద్యార్థులకు ఉపయోగకరంగా లేదని అనేక మంది నిపుణులైన ఉపాధ్యాయులు తెలుపుతున్నారు. ఉపాధ్యాయులకు అర్థవంతమైన శిక్షణ ఇచ్చి వారి ద్వారా టెక్నాలజీని ఉపయోగంలోకి తేవాలి. అంతేగాని టీచర్ల సంఖ్య తగ్గించరాదు.
డిఎస్‌సి నోటిఫికేషన్ రాజకీయ అంశం కూడా
డిఎస్‌సి నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయటం కేవలం నియామకాల కోసమే కాదు. అది ఒక రాజకీయ అంశం కూడా. ఒక్క డిఎస్‌సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోతే గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగ అభ్యర్థులు, వారి కుటుంబాలు ప్రభుత్వాన్ని నిలదీస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, కర్నూలు వంటి ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలలో ఉపాధ్యాయ ఉద్యోగం పొందటం కుటుంబాలకు ఒక గౌరవంగా భావిస్తారు. రాష్ట్ర విద్యామంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాకు చెందినవారు. వారు విశాల హృదయంతో ఆలోచించి 30 వేలకు పైగా ఖాళీలతో డిఎస్‌సి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నాము.
విద్యారంగ నాణ్యతా ప్రమాణాలు
రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పాఠశాలల్లో కొన్ని మౌలిక వసతులు కల్పించింది. మధ్యాహ్న భోజనంలో మార్పులు తెచ్చింది. 'నాడు-నేడు' పనుల ద్వారా పాఠశాలల్లో వసతులు ఏర్పడ్డాయి. కాని పిల్లలు, ఉపాధ్యాయులు లేకుండా ఉపయోగమేమిటి? బడి కోసం బస్సు యాత్రలో భాగంగా అనకాపల్లి వద్ద 'డోసూరు' అనే గ్రామం వెళ్లాము. ఆ పాఠశాలను 1902లో పెట్టారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి అక్కడే చదువుకున్నారు. 'నాడు-నేడు'లో భాగంగా ఆ స్కూల్‌లో వసతుల కోసం రూ.26 లక్షలు ఖర్చు చేశారు. స్కూలు చూడముచ్చటగా ఉన్నది. కాని 3,4,5, తరగతుల తరలింపుతో 32 మంది విద్యార్థులలో పంది మంది మాత్రమే మిగిలారు. దీని వలన ఉపయోగం ఏముంది? నాణ్యతా ప్రమాణాలు పెంచటానికి మౌలిక వసతులతో పాటు ఉపాధ్యాయులు ప్రధాన చోదక శక్తిగా ఉంటారని గమనించి, ఉపాధ్యాయ ఖాళీలన్నిటినీ భర్తీ చేయాలని గౌరవ విద్యాశాఖ మంత్రిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
/ వ్యాసకర్త ఎమ్మెల్సీ,
సెల్ : 8309965083 / కె.ఎస్.లక్ష్మణరావు