
రవి అస్తమించని బ్రిటీష్ సామాజ్య్రంగా ప్రపంచ దేశాలపై ఒకప్పుడు పెత్తనం చలాయించిన బ్రిటన్ ఇప్పుడు సొంత ఇంటినే చక్కదిద్దుకోలేక చతికిలపడిపోతోంది. ఆర్థిక సంక్షోభం అంతకంతకూ విస్తరించి రాజకీయ అనిశ్చితితో కొట్టుమిట్టాడుతోంది. నాలుగు నెలల కాలంలో ఇద్దరు ప్రధానులు, నలుగురు ఆర్థిక మంత్రులు, ముగ్గురు హోంశాఖ మంత్రులు పదవులను వీడాల్సి వచ్చిందంటేనే అక్కడ పరిస్థితి ఎంత హీనంగా ఉందో అర్థం చేసుకోచ్చు. అధికార పగ్గాలు చేపట్టిన కేవలం 44 రోజుల్లోనే బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి ముందూ ఒకే ప్రశ్న ఉదయిస్తోంది. మాజీ సూపర్ పవర్ సంక్షోభ సుడిగుండం నుంచి గట్టెక్కే వీలుందా? లేదా మొత్తానికే కుప్పకూలిపోనుందా? బ్రిటన్‌లో ఐదేళ్లకు ఒకసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈ లోగా ప్రధానమంత్రులు పాలనా పగ్గాలు వదిలేస్తే వారి స్థానంలో అధికార పక్షం నుంచి మళ్లీ నేతను ఎన్నుకుంటారే మినహా తాజాగా ఎన్నికలు జరపరు. లిజ్ ట్రస్ గద్దె దిగడంతో ఆమె స్థానంలో అధికార కన్సర్వేటివ్ పార్టీ ఈ నెల 28న కొత్త నేతను ఎన్నుకోనుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ దేశంలో తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలన్నదే బ్రిటన్ ముందున్న అతి పెద్ద సవాలు.
వాస్తవానికి కోవిడ్ ముందు నుంచే ప్రపంచమంతటా సంక్షోభ మేఘాలు ఆవరించి వున్నాయన్నది యథార్థం. ప్రత్యేకించి కార్పొరేట్ కంపెనీలకు ప్రజల సంపదను అడ్డుఅదుపు లేకుండా దోచిపెట్టేస్తున్న పెట్టుబడిదారీ దేశాల్లో ప్రమాదకరమైన దుస్థితి నెలకొంది. బ్రెగ్జిట్ తదనంతర పరిణామాలతో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం. బ్రిటన్ ప్రస్తుత పరిస్థితి ఇదే. సెప్టెంబరులో మినీ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలోనే ముందున్నది ముసళ్ల పండుగేనని అర్థమైపోయింది. 2023లో బ్రిటన్ వృద్ధి రేటు 0.3 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. మమ్మల్ని మించిన శక్తివంతులెవరంటూ విర్రవీగిన 'రాచరిక' బ్రిటన్ ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుకుందన్నదానికి ఇది చాలు. బ్రిటన్ సంక్షోభాన్ని బ్రెగ్జిట్ మరింత తీవ్రతరం చేసింది. బహుళ జాతి సంస్థలు (ఎంఎన్‌సిలు) బ్రిటన్ బ్యాంకుల్లో ఉన్న ఒక ట్రిలియన్ పైగా డాలర్ల మొత్తాన్ని ఇతర దేశాలకు తరలించేయడంతో పాటు, కరెన్సీలో మార్పుల వల్ల ఆర్థిక సంస్థలు తీవ్ర లిక్విడిటీ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావడంతో 2019 ఏప్రిల్ నుంచి బ్రిటన్‌లో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కుదించుకుపోయాయి. స్థిరాస్థి మార్కెట్ కుప్పకూలింది. బ్రిటన్‌తో పాటు యూరప్ దేశాలన్నింటిలోనూ వృద్ధి రేటు తిరోగమనం పట్టింది. ఈ పరిస్థితులన్నీ 2022 నాటికి ఆర్థికం అద:పాతాళానికి చేరడానికి దారితీశాయి. రష్యా-ఉక్రెయిన్ ఘర్షణల నేపథ్యంలో యుద్ధోన్మాద నాటోలో సభ్యదేశంగా ఉన్నందున ఉక్రెయిన్‌కు రక్షణ సామగ్రి, ఆయుధాలు సమకూర్చడం వంటి చర్యలతో బ్రిటన్ ప్రజలపై ఆరు నెలల్లోనే 50 బిలియన్ డాలర్ల భారం పడింది. పాలకుల అనాలోచిత నిర్ణయాలు పరిస్థితిని పెనం మీద నుంచి పొయ్యిలో పడేలా చేశాయి. ఈ ఏడాది సెప్టెంబరులో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ దానికి ఉదాహరణగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఉపాధి కల్పించి ప్రజల ఆదాయాలను పెంచడం మానేసి..దానికి బదులుగా వడ్డీ రేట్లు తగ్గించి ప్రజలకు రుణాలిస్తే కొనుగోలు శక్తి పెరిగిపోతుందనే 'పెట్టుబడిదారీ' ఆశలతో అన్నీ బెడిసికొట్టాయి.
కారుమబ్బులు కమ్మేసిన బ్రిటన్‌లో ఇప్పుడు లిజ్ ట్రస్ స్థానంలో రిషి సునక్ వచ్చినా...బోరిస్ జాన్సనే తిరిగొచ్చినా ఆర్థిక వ్యవస్థ గాడిన పడే మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఉపాధి కల్పన, వేతనాల పెంపు వంటి చర్యలతోనే ఆర్థికం కాస్తయినా కోలుకునేది. బ్రిటన్ లాంటి దేశాల పంథానే మన దేశంలోని పాలకులు అనుసరిస్తుండటం ఆందోళనకరం. నోట్ల రద్దు, జిఎస్‌టి వంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రజల సంపదను ప్రయివేటుకు కట్టబెట్టడం వంటి విధానాలు విడనాడి, డిజిటిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి ప్రచారార్భాటపు చర్యలు మాని ఇప్పటికైనా ఉపాధి కల్పనపై మోడీ సర్కార్ దృష్టి సారించాలి. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన లక్షలాది ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి. గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయకుండా దానిని పట్టణాలకూ విస్తరింపజేయాలి. ప్రజల ఆర్థిక స్థితి మెరుగు పడితేనే దేశ ఆర్థిక స్థితి ఆరోగ్యంగా ఉంటుంది.