Jul 10,2022 12:34

బతికున్న తల్లిదండ్రులనే పట్టించుకోని ఈ రోజుల్లో, తండ్రి చనిపోయాక ఆయన కలను నెరవేర్చాడో కొడుకు. అలా అని అతను కోటీశ్వరుడు కాదు.. తండ్రి మరణానంతరం ఆయన అంతిమ సంస్కారాలకు అయ్యే ఖర్చులతో ఊరి ప్రజలకు ఉపయోగపడే బ్రిడ్జిని నిర్మించాడు. ఏళ్ల తరబడి ఊరి ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రభుత్వాలే పట్టించుకోని తమ సమస్యను తమ గ్రామానికి చెందిన ఒకవ్యక్తే పరిష్కరించడంతో అందరూ అభినందిస్తున్నారు. ఆయనే మహదేవ్‌ ఝా కుమారుడు సుధీర్‌ ఝా.
మనం ఉండే ఊళ్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. తాగునీరు, డ్రెయినేజీ, కరెంట్‌ స్తంబాలు.. వంటి సమస్యలు సర్వసాధారణం. అయితే ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు పట్టించుకోకపోవడం ఆక్షేపించాల్సిన విషయమే. కానీ ఎన్నాళ్లు ఎదురుచూస్తూ ఉంటాం. ఈ నిరీక్షణలో సమస్య పెరుగుతూనే ఉంటుంది తప్ప.. పరిష్కారం కాదు. అలాంటి సమయంలో మనమే ముందుకొచ్చి, పరిష్కారం దిశగా అడుగులు వేస్తే.. ఏంతో కొంత మేలు జరుగుతుంది. అంటే సామాజిక సమస్యలను కూడా వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా పరిష్కరించవచ్చు. ఇలాంటి అభిరుచి ఉన్న వారూ ఈ సమాజంలో చాలామందే ఉన్నారు. సమాజానికి ఏదో ఒకటి చేయాలని వారు నిరంతరం తపిస్తుంటారు. బీహార్‌లో కూడా ఓ వ్యక్తి ఇలాగే ముందుకొచ్చి, గ్రామంలో బ్రిడ్జిని నిర్మించాడు. తన తండ్రి దశదినకర్మకు అయ్యే ఖర్చులతో.. గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరిస్తూ వంతెన నిర్మించాడు.

3


మధుబని జిల్లా కలువహి మండలంలోని నారార్‌ పంచాయతీ నుంచి ఓ కాలువ వెళ్తుంది. ఆ ఊరి నుంచి బయటకు వెళ్లాలంటే.. ఆ కాలువను దాటే వెళ్లాలి. వర్షాకాలంలో కాలువ ఉప్పొంగి ప్రవహిస్తుంటుంది. ఆ సమయంలో గ్రామస్తులు ఊరి దాటి బయటకు వెళ్లేందుకూ బయటపడుతుంటారు. ఆ సమయంలో ఏదైనా ఆపద వచ్చినా అంతే పరిస్థితి. అక్కడ బ్రిడ్జి వస్తే వారి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వర్షాకాలం వచ్చినా.. ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. కానీ బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వంతెన మంజూరు కాలేదు. అది అక్కడి ప్రభుత్వ వైఫల్యం. అయితే, తమ గ్రామ పరిస్థితిని చూసి మహదేవ్‌ ఝా అనే పెద్దాయన చలించిపోయాడు. చివరికి ముఖ్యమంత్రికి లేఖ రాసినా ఫలితం దక్కలేదు. ఆ ఊరికి ఎలాగైనా వంతెనను నిర్మించాలని అనుకున్నాడు. జీవిత చరమాంకంలో ఉన్న ఆయన.. 'ఒకవేళ నేను చనిపోతే.. నా అంత్యక్రియలకు, దశదినకర్మలకు అయ్యే ఖర్చుతో బ్రిడ్జిని నిర్మించాలి!' అని కుటుంబ సభ్యులను కోరాడు. 'అది తన కల అని.. చివరి కోరిక కూడా!' అని చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అనారోగ్య సమస్యలతో 2020లో మహదేవ్‌ ఝా మరణించాడు.
ఆ కల సాకారం చేశారు..
మహదేవ్‌ ఝా అరుణాచల్‌ ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. మహదేవ్‌ ఝా కల ఏంటో.. అతడి భార్య మహేశ్వరి దేవి, కుమారుడు విజరుప్రకాష్‌ ఝా అలియాస్‌ సుధీర్‌ ఝాకు బాగా తెలుసు. ఆ డబ్బుతో గ్రామంలో ఉన్న కాల్వపై వంతెనను నిర్మించాలని సంకల్పించారు. అనుకున్నట్లుగానే ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి, కాల్వపై వంతెనను నిర్మించారు. అయితే కరోనా కారణంగా వంతెన నిర్మాణంలో రెండేళ్లు జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఎన్నో ఏళ్ల గ్రామస్తుల కలను సాకారం చేశారు. తమ సమస్య తీరడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వంతెన ద్వారా దాదాపు రెండు వేల మంది గ్రామస్తులు తేలికగా గ్రామం ఇటువైపు నుంచి అటువైపుకు రాకపోకలు సాగిస్తున్నారు. 'ఈ వంతెనతో ముఖ్యంగా రైతులకు ఎంతో ఉపశమనం కలిగింది!' అని మహదేవ్‌ ఝా సోదరుడు మహవీర్‌ ఝా తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపి ఊరుకోకుండా.. వ్యక్తిగత ప్రయత్నాలతో కూడా సమస్యను పరిష్కరించవచ్చని.. మహదేవ్‌ ఝా, అతడి కుటుంబ సభ్యులు నిరూపించారు. ఉపాధ్యాయుడిగా మహదేవ్‌ ఈ సమాజానికి ఓ కొత్త పాఠం నేర్పారు.