Nov 07,2023 10:37

పిల్లలూ, ఈ రోజు 'బాలభటుల' దినోత్సవం. ఈ రోజెలా వచ్చిందో.. దాని సందేశమేంటో తెలుసుకుందామా !
బాల బాలికలలో దేశభక్తిని, క్రమశిక్షణను పెంపొందించి వారిని సమాజ సేవకులుగా తీర్చిదిద్దడానికి ప్రారంభించిన ఉద్యమమే 'బాలభట ఉద్యమం' (స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మూవ్‌మెంట్‌) ఈ ఉద్యమంలో బాలుర బృందాలను 'స్కౌట్స్‌' అని, బాలికల బృందాలను 'గైడ్స్‌' అని అంటారు.
భారత స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌
మొట్టమొదటి స్కాటిష్‌ స్కౌట్‌ సమూహం సెంట్రల్‌ ప్రావిన్స్‌ (ప్రస్తుత మధ్య ప్రదేశ్‌)లో 1908లో ప్రారంభమైంది. అయితే ఇది 1910 లోనే ఆగిపోయింది.
భారతదేశంలో మొట్టమొదటి బ్రిటిష్‌ స్కౌట్‌ సమూహాలు 1909లో బెంగుళూరు, కిర్కీ, జబల్‌పూర్‌లో ప్రారంభమయ్యాయి. 1911లో సిమ్లా, కలకత్తా, అలహాబాద్‌, పూణె, సైద్‌ పూర్‌, మద్రాసు కేంద్రాలు మొదలై ఈ సంఖ్య తొమ్మిదికి పెరిగింది.
గర్ల్‌ గైడ్‌ ఉద్యమం కూడా జబల్‌పూర్‌లో 1911లో మొదలైంది. ఇది త్వరత్వరగా అభివృద్ధి చెంది 1915 కల్లా 1200 మంది పిల్లలతో సుమారు 50 కేంద్రాలు తెరిచారు. బాలికలకే పరిమితమైన అఖిల భారత గర్ల్‌ గైడ్స్‌ సంఘం 1916లో మొదలైంది.
స్వాతంత్య్రం వచ్చాక ...
స్వాతంత్య్రం అనంతరం జవహర్‌ లాల్‌ నెహ్రూ, మౌలానా కలాం అజాద్‌, మంగళ్‌ దాస్‌ పక్వాసా, మొదలైన వారి కృషి ఫలితంగా స్కౌట్స్‌, గైడ్స్‌ ఉద్యమాల్ని రెండింటిని నవంబరు 7, 1950న ఒకటిగా చేసి భారత్‌ 'స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌'గా నామకరణం చేశారు. ప్రస్తుతం దీని ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో ఉంది.
ఇందులో చేరిన పిల్లలకు ఈతకొట్టడం, వంతెనలు, రోడ్ల నిర్మాణం, ప్రథమ చికిత్స పద్ధతులను నేర్పుతారు. ఆయుధాలు లేకుండా వీరు కేవలం ఒక కర్రను మాత్రమే ధరిస్తారు. వీరికి సైనికుల వలె ప్రత్యేక దుస్తులు, మెడలో ఒక స్కార్ఫ్‌ ఉంటుంది. ఈ ఉద్యమంలో చేరినవారు దళాలుగా ఏర్పడతారు. ప్రతి దళానికి ఒక పతాకం, వాయిద్యాలు ఉంటాయి. 'సదా సమాజసేవలో ఉంటాం' అనే నినాదం ఈ పతాకం పై రాసి ఉంటుంది.