- ఆస్ట్రేలియా, బ్రిటన్‌తో సహా పలు దేశాల జర్నలిస్టుల సంఘీభావం
లండన్ : వేతనాల పెంపు, ఉద్యోగాలు కోల్పోవడం వంటి సమస్యలపై నేషనల్ వరల్డ్ ప్రచురణ సంస్థకి చెందిన 300మందికి పైగా జర్నలిస్టులు శనివారం తమ విధులను బహిష్కరించారు. నేషనల్ వరల్డ్‌కి చెందిన ప్రాంతీయ వార్తా పత్రికల్లో పనిచేసే వీరందరూ ఒక్కో రోజు చొప్పున మూడు రోజుల సమ్మెలకు పిలుపిచ్చారు. అందులో భాగంగా రెండవ సమ్మెలో శనివారం వీరు 24గంటల పాటు విధుల బహిష్కరణ చేశారు. తిరిగి సోమవారం మరోసారి జర్నలిస్టులు సమ్మె చేయనున్నారు. ఆస్ట్రేలియా, బ్రిటన్‌లతో సహా ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టుల నుండి ఈ సమ్మెకు సంఘీభావం తెలుపుతూ సందేశాలు వచ్చాయని నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఎన్‌యుజె) తెలిపింది. 4.5శాతం వేతన పెంపునకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ఈ నిరసన కార్యచరణ చేపట్టారు. ''ఈ ఉద్యోగాలతో బతకలేమని భావించిన నేషనల్ వరల్డ్ సిబ్బందిలో కొంతమంది రెండో ఉద్యోగం చేయాల్సి వస్తోందని, మరికొంతమంది దీన్నుండే బయటకు వెళ్లిపోవాలని భావిస్తున్నారని, ఇది సిగ్గుచేటైన విషయం'' అని జర్నలిస్టులకు వచ్చిన ఒక సంఘీభావ సందేశం పేర్కొంది. ఎన్‌యుజె జాతీయ నిర్వాహకులు లారా డేవిసన్ మాట్లాడుతూ, సిబ్బందికి సవరించిన వేతన ప్యాకేజీని అమలు చేయగల సామర్ధ్యం నేషనల్ వరల్డ్‌కి వుందని అన్నారు. నేషనల్ వరల్డ్ ప్రచురణ సంస్థకి వందకి పైగా వార్తాపత్రికలు వున్నాయి.