అడుగంటిపోతున్న నీళ్ల రాసులను కాపాడుకుంటూ..
ఉప్పొంగే కొత్త అరుదలను నిలుపుకుంటూ..
ప్రాణధారై దాహం తీరుస్తున్న జీవనది
తన పరిమళాలు వెదజల్లి
ఎన్నో పుస్తక పురుగులను ఆకర్షించి
ఆశ్రయమిచ్చి వికసింపజేసి
విజయతీరాలు
చేర్చుతున్న నావ
సంకల్పంతో దీక్షగా తన దగ్గర కూసున్న
సామాన్యుల బలహీనతల వలయాలను తొలగించి
అసామాన్యులుగా మహౌన్నత శిఖరాలుగా నిలుపుతుంది
కనిపించే కనిపించని విశ్వమంతటిని
మన ముందరుంచి
బండరాయసుంటి మెదళ్లను రగిలించి
ప్రశ్నలను చిగురింపజేస్తు
జవాబుల అన్వేషకులుగా మలుస్తుంది
గ్రంథాలయం చెదలు పట్టని చరిత్రల పుట్ట
వజ్ర వైఢూర్యాలతో వెల కట్టి
కొనలేనంతటి విలువైన ఆలోచనల సముద్రం
చరిత్రలు నిక్షిప్తం
చేసుకున్న గని
తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత సిరులు ఇచ్చే నిధి
అక్షర ధ్యానం చేస్తే జ్ఞానోదయం ప్రసాదించే బోధి వృక్షం
- జి.యం.నాగేష్ యాదవ్
94948 93625