Sep 11,2022 12:21

వసంతం ఒంటరి చేసి
వెళ్లిపోయిందని నల్లకోయిల.
అడవిలో దారితప్పి
తడారిన పెదవుల్తో వేణువు.
ఊగి ఊగి ఆకులన్నీ రాలిపోయి
ఎముకల గూడై నిల్చున్న వృక్షాలు.
అడవి ఇప్పుడు పచ్చని కలకాదు
ఆగమాగమైపోయిన నగరదిష్టి.
వాగులూ వంకల్ని పూడ్చేసి
కొండల్ని గుట్టల్నీ కూల్చేసి
అడవిని మాయం చేసే మంత్రగాళ్లు.
కాలినడక నడిచినంత మేర
రాత్రింబవళ్ల యంత్రఘోష.
తలవాకిట ముగ్గుల అందాలు పరచినట్టు
రహదారుల పామునడక.
మృగయా వినోదంలేని రాజసింహాలు
పల్లెలకేసి నడుస్తున్నాయి
నోటికందిన పాడిని
నడిరేయి పట్టి పీడిస్తున్నాయి.
చిరుతలు వాయిస్తున్న చిడతలకి
నిద్రకరువైన వూరికళ్లు
భయంతో వికసించిన నిప్పుపూలు
ఎప్పుడు యెక్కడ ఏ కొండచిలువ
ఏ ప్రాణికి శిలువ వేస్తుందో
కరిమింగిన వెలగపండు పెరుమాళ్లకెరుక
ఎప్పుడు యెక్కడ ఏ గజరాజు
ఏ పంటను నలిపేస్తుందో
అడవిని అల్లకల్లోలం చేశాడు మనిషి
మనిషికి శాంతిదూరం చేసింది అడవి!

ఈతకోట సుబ్బారావు
94405 29785