
ఒడిశా బాలేశ్వర్ జిల్లా బహనాగా బజార్ స్టేషన్ వద్ద శుక్రవారం సాయంత్రం సంభవించిన ఘోర రైలు ప్రమాదం మాటలకందని విషాదం. మూడు రైళ్లు ఢకొీన్న భీతావహానికి 275 మంది మరణించగా 1,200 మంది వరకు క్షతగాత్రులయ్యారని అధికారిక ప్రకటన. చికిత్స పొందుతున్న వారిలో వందల మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ లెక్కలపై అనుమానాలున్నాయి. ఘటనా ప్రదేశంలో శవాల గుట్టలు, గుర్తుపట్టవీల్లేని మృతదేహాలు ఘోరకలి తీవ్రతను తెలియజేస్తాయి. ప్రమాదం ఏ విధంగా జరిగిందనే విషయం స్పష్టం కానప్పటికీ షాలీమార్ నుంచి చెన్నై వెళుతున్న కోరమండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అకస్మాత్తుగా లూప్‌లైన్‌లోకి మారి ఆగివున్న గూడ్స్‌రైలును ఢకొీట్టింది. దాంతో కోరమండల్ బోగీలు కొన్ని పట్టాలు తప్పగా కొన్ని పక్కనే ఉన్న ట్రాక్‌పై ఎగిరి పడ్డాయి. అప్పుడే అదే ట్రాక్‌పై బెంగళూరు నుంచి హౌరా వెళుతున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోరమండల్ బోగీలను ఢకొీట్టి పట్టాలు తప్పింది. సిగల్ లోపమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక రిపోర్టు. సహాయక చర్యలు నాల్గవ రోజు కూడా కొనసాగాయి. ప్రధాని మోడీ, రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, తదితరులు ప్రమాద స్థలాన్ని సందర్శించి యథామామూలుగా ఎక్స్‌గ్రేషియాలు ప్రకటించారు. ప్రాథమిక విచారణలో కుట్ర కోణం అనుమానం వచ్చినందున సిబిఐ దర్యాప్తునకు సిఫారసు చేశామన్నారు.
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సమగ్ర విచారణ జరిపించి కారణాలు వెలికితీసి బాధ్యులను శిక్షించడం, అటువంటివి పునరావృతం కాకుండా పటిష్టంగా తాత్కాలిక, శాశ్వత చర్యలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యత. కాగా దర్యాప్తు పూర్తికాకమునుపే ఏవోకొన్ని ఊహాగానాలు ప్రచారం చేసి అసలు విషయాన్ని పక్కదారి పట్టించడం మోడీ గణానికి రివాజుగా మారింది. కోరమండల్ రైలు ప్రమాదంలోనూ అదే ధోరణి కనబర్చారు ప్రధాని, రైల్వే మంత్రి. ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో పాయింట్ మెషీన్ సెట్టింగ్‌లను ఎవరో మార్చారని, కుట్ర, విధ్వంస కోణంగా పేర్కొని ప్రభుత్వ వ్యవస్థాపర వైఫల్యాలను కప్పెట్టేందుకు ఒడిగట్టారు. రైల్వేల భద్రత విషయంలో మోడీ ప్రభుత్వం ఎంతగా ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని పాటిస్తున్నదో రైలు ప్రమాదాలపై 2022లో విడుదల చేసిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక కుండబద్దలు కొట్టింది. దాదాపు రైలు ప్రమాదాలన్నీ పట్టాలు తప్పడం వల్లనే సంభవిస్తున్నాయని, పట్టాల పునరుద్ధరణకు నిధులు కేటాయించాల్సి ఉండగా, 2017లో ప్రత్యేకంగా నెలకొల్పిన రాష్ట్రీయ రైలు రక్షణ నిధి నుంచి నిధులు తగ్గించిన వైనాన్ని కాగ్ ఎత్తి చూపింది. అలాగే రైల్వేలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్టు ప్రకారం రైలు ప్రమాదాలపై రైల్వే సేఫ్టీ కమిషనర్ దర్యాప్తు చేసి సమర్పించిన నివేదికలపై ఎలాంటి చర్యలూ లేవు. యాక్షన్ టేకెన్ రిపోర్టులు 2014 నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఇదీ ప్రయాణీకుల ప్రాణాల భద్రతపై మోడీ ప్రభుత్వానికున్న శ్రద్ధ.
కేంద్రంలో బిజెపి వచ్చాక రైల్వేల ప్రైవేటీకరణ దూకుడుగా జరుగుతోంది. వందల ప్రైవేటు రైళ్లొచ్చాయి. అదానీ వంటి కార్పొరేట్లకు రైల్వే ఆస్తులు ధారాదత్తమవుతున్నాయి. రైల్వే ప్రత్యేక బడ్జెట్ ఎగిరిపోయింది. ప్యాసింజర్ రైళ్లు రద్దవుతూ వందేభారత్, బుల్లెట్, స్పీడ్ ట్రైన్లు ప్రవేశపెడుతున్నారు. రైల్వేలలో మూడు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైల్వేల ద్వారా రోజుకు రెండున్నర కోట్ల మంది గమ్యస్థానాలకు చేరుతున్నారు. రైల్వేల ద్వారా ఏడాదికి రూ.2.40 కోట్ల ఆదాయాన్ని మోడీ ప్రభుత్వం ఆర్జిస్తూ, ప్రయాణీకుల భద్రతకు ఏడాదికి రూ.5 వేల కోట్లు కూడా కేటాయించలేకపోతోంది. రైల్వే ప్రమాదాలను మానవ తప్పిదంగానో, కుట్రగానో చెప్పడం తప్పించుకొనే ఎత్తు. ప్రపంచంలోనే అతి పెద్ద రవాణా వ్యవస్థ మన రైల్వే. అత్యధిక ఉద్యోగులు పని చేస్తున్న సంస్థగా కూడా మన రైల్వేలకు పేరుంది. రైల్వేలపట్ల ప్రభుత్వ విధానాల్లో మార్పు రానంత వరకు ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో పెట్టిన దీపాల చందమే. ప్రమాదానికి బాధ్యత వహించి రైల్వే మంత్రి రాజీనామా చేయాలి. ప్రభుత్వం కోరమండల్ ఘోరకలిపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు చేపట్టాలి.