Nov 14,2023 08:24

వేర్వేరు ప్రమాదాల్లో తొమ్మిది మంది మృతి
ప్రజాశక్తి - యంత్రాంగం:జాతీయ రహదారులు రక్తమోడుతున్నాయి. ఆదివారం, సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది మరణించారు. మృతుల కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...మొబైల్‌ ఫోన్‌ కొనుగోలు చేసేందుకు కాకినాడ జిల్లా తాళ్ళరేవుకు చెందిన నలుగురు యువకులు ఒకే ద్విచక్రవాహనంలో యానాంకు వెళ్లారు. ఫోన్‌ కొనుగోలు చేసిన అనంతరం తిరిగి తాళ్ళరేవుకు బయలుదేరారు. లచ్చిపాలెం వద్దకు రాగానే వీరి ముందు వెళ్తున్న ఇటుక లోడు ట్రాక్టర్‌ను వేగంగా ఢకొీట్టారు. తాళ్లరేవు రచ్చవారిపేటకు చెందిన ఓలేటి శ్రీను (26), వైదాడి రాజు (24), ఐ.పోలవరం మండలం ఎదుర్లంక జగనన్న కాలనీకి చెందిన పాలెపు ప్రసాద్‌ (24) అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన రచ్చ శ్రీను తాళ్లరేవులోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. వీరందరూ పెయింటింగ్‌ కార్మికులు.
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలానికి చెందిన యోహాన్‌ (31) ఆయన బావమరిది మహేష్‌ (29) ఏడాది క్రితం తమ కుటుంబాలతో కలిసి వైఎస్‌ఆర్‌ జిల్లా కమలాపురం మండలం నల్లింగాయపల్లికి వచ్చారు. వీరిద్దరూ తాపీ మేస్త్రీలుగా పనిచేస్తూ జీవనం సాగించేవారు. పందిళ్లపల్లెలో ఆదివారం రాత్రి పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. బండిలో పెట్రోలు తక్కువగా ఉండడంతో పెట్రోల్‌ కొట్టుంచుకునేందుకు రోడ్డు దాడుతుండగా ఎర్రగుంట్ల వైపు నుంచి కడపకు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢకొీట్టింది. వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. యోహాన్‌కు భార్య విశ్వేశ్వరమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మహేష్‌కు భార్య బుజ్జమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు.
బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండల కేంద్రానికి చెందిన అభి (21), కిషోర్‌ (19), ప్రేమ్‌కుమార్‌ ముగ్గురు స్నేహితులు. అభి హైదరాబాద్‌లో ప్రయివేటు ఉద్యోగం చేస్తుండగా కిషోర్‌ గుంటూరు మిర్చియార్డులో ముఠా కార్మికునిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో తెనాలిలో బంధువుల ఇంటి వద్ద ఉన్న ప్రేమ్‌కుమార్‌ను కలిసేందుకు అభి, కిషోర్‌ ఆదివారం రాత్రి తెనాలి వచ్చారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ముగ్గురూ కలిసి తెనాలి నుంచి భట్టిప్రోలు వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. పట్టణంలోని చెంచుపేట వైపు నుంచి ఫ్లైఓవర్‌ ఎక్కిన తర్వాత బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢకొీట్టడంతో అభి, కిషోర్‌ అక్కడికక్కడే మృతి చెందారు.
బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం, కూచినపూడికి చెందిన దున్న రాజేశ్వరరావు (28) ఆదివారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై నందివెలుగుకు వ్యక్తిగత పని నిమిత్తం వెళ్లారు. తిరిగి వస్తుండగా మరో ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢకొీంది. రాజేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు.
సిమెంట్‌లో కలిపే పౌడరు లోడును నెల్లూరు నుంచి తెలంగాణలోని మట్టపల్లి సమీపంలో ఉన్న ఫ్యాక్టరీకి తీసుకెళ్తుండగా అద్దంకి - నార్కెట్‌పల్లి రహదారిలో పెదనెమలిపురి వద్దకు రాగానే లారీ టైరు పేలిపోయింది. దీంతో వాహనం అదుపుతప్పి పల్టీకొట్టింది. ఝార్ఖండ్‌కు చెందిన డ్రైవర్‌ మహమ్మద్‌ సిద్ధిక్‌ (27) అక్కడికక్కడే మృతి చెందారు.