
సంచలనాత్మక బీమా కొరెగావ్ కేసులో ఐదేళ్ల క్రితం అరెస్టయిన విద్యావేత్త వెర్నాన్ గొన్సాల్వెస్, సామాజిక కార్యకర్త అరుణ్ ఫెరీరాలకు సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కొన్ని షరతులు విధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం 1967 (ఉపా) కింద అభియోగాలు మోపబడి 2018 ఆగస్టు నుంచి వారు ఖైదు కాబడ్డారు. కాగా వీరిద్దరికీ బెయిల్ మంజూరు చేసే క్రమంలో సుప్రీం కోర్టు చేసిన ఉటంకింపులు రాజ్యం అక్రమంగా పౌరులపై బనాయించే కేసులు, వాటి పట్ల న్యాయస్థానాలు వ్యవహరిస్తున్న తీరు పున:పరిశీలన అవసరాన్ని నొక్కిచెపుతున్నాయి. కేసు తుది తీర్పు వెలువడే వరకు నిరంతర నిర్బంధం చేయాలని జాతీయ పరిశోధన సంస్థ (ఎన్‌ఐఎ) చేసిన అభ్యర్ధనను కోర్టు సమర్ధించలేదు. నిందితులపై తీవ్ర అభియోగాలు ఉన్నప్పటికీ కేవలం వాటి కారణంగానే బెయిల్‌కు అనర్హులు కాజాలరని స్పష్టం చేసింది. ఇప్పటికే ఐదేళ్లపాటు జైలులో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఉపా చట్టం అనగానే నిందితులకు బెయిల్ నిరాకరించడమనే ఆనవాయితీకి సుప్రీం కోర్టు ఫుల్‌స్టాప్ పెట్టడం విశేషం. బెయిల్ మంజూరు చేయడానికి కేసు పూర్వాపరాలు, యోగ్యత, దర్యాప్తు తీరుతెన్నులు ఇవన్నీ కోర్టు మననంలో ఉండి ఉంటాయి.
మహారాష్ట్ర పూణె జిల్లాలో బీమా కొరెగావ్ గ్రామానికి ఉద్యమ చారిత్రక నేపథ్యం ఉంది. 1818 జనవరి 1న బ్రిటీష్ సైన్యాన్ని స్థానిక దళిత, బహుజనులు ఎదురొడ్డి నిలిచారు. జలియన్ వాలాబాగ్ చందం. నాటి పోరాటాన్ని స్మరించుకుంటూ 2017 డిసెంబర్ 31న దళిత బహుజనులు ఎల్గార్ పరిషత్ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ మరుసటి రోజు గ్రామంలో జరిగిన అల్లర్లకు ఆ సభలో రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని పోలీసులు కేసులు పెట్టారు. గొన్సాల్వెస్, ఫెరీరా, సుధా భరద్వాజ్, వరవరరావు, గౌతమ్ నౌలఖాల వంటి వారికి ఆ సభతోనూ, మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఉపా కింద కేసులు బనాయించి అరెస్టులు చేశారు. మావోయిస్టులతో చేతులు కలిపి ప్రధాని నరేంద్ర మోడీని హతమార్చేందుకు కుట్ర పన్నాడంటూ 2020లో 83 ఏళ్ల ఫాదర్ స్టాన్ స్వామిని అరెస్టు చేయగా ఏడాది లోపే స్వామి జైలులోనే తనువు చాలించాడు. స్వామికి జైలులో తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. స్వామి కంప్యూటర్లు హ్యాక్ చేసి మావోయిస్టుల లేఖలు, పత్రాలను చొప్పించారని అమెరికన్ ఫోరెన్సిక్ సంస్థ వెల్లడించింది. నియమిత గడువు లోపు పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయని కారణంగా న్యాయవాది సుధా భరద్వాజ్ బెయిల్‌పై విడుదలయ్యారు. సరైన అభియోగం లేని కారణంగా రచయిత ఆనంద్ తెల్తుంబ్డేని బోంబే హైకోర్టు విడుదల చేసింది. వైద్య సంబంధ కారణాలతో వరవరరావు బెయిల్ పొందారు. ఈ క్రమం కేసు బలహీనతలను తెలుపుతుంది.
ఉపా చట్టంలోని తీవ్ర నిబంధనల కింద అరెస్టు చేసిన వ్యక్తికి బెయిల్ రావడం చాలా కష్టం. సెక్షన్ 43 డి(5) ప్రకారం ఆరోపణ నిజమని నమ్మడానికి సహేతుకమైన కారణాలు ఉంటే ఏ కోర్టూ బెయిల్ ఇవ్వదు. బీమా కొరెగావ్ కేసు విస్తృత సంభావ్యత రీత్యా ఇద్దరు నిందితులకు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చి ఉంటుంది. అలాగే ఎన్‌ఐఎ దర్యాప్తు కూడా కారణం. నిందితులు కుట్రకు పాల్పడ్డారనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనడానికి నేరుగా సాక్ష్యాలు లేవు. కేవలం ఎవరో చెప్పిన థర్డ్ పార్టీ సాక్ష్యాలనే కోర్టుకు ఎన్‌ఐఎ సమర్పించింది. ఒక సెమినార్‌లో పాల్గొనడం ఉపా చట్టం కిందకి ఎలా వస్తుందంటూ సుప్రీం కోర్టు సంధించిన ప్రశ్న రాజ్యానికి కనువిప్పు కావాలి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక రాజ్యాంగం పౌరులకు కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడమే నేరంగా తయారైంది. విమర్శను సహించలేక అక్రమ కేసులు బనాయిస్తోంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అదే బాటన నడుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా బీమా కొరెగావ్ వంటి కేసులు చాలానే ఉన్నాయి. బీమా కొరెగావ్ కేసులో సుప్రీం కోర్టు ఆలోచనా దృష్టితోనైనా ప్రభుత్వాలు తమ నిర్బంధ, నిరంకుశత్వాన్ని విడనాడేనా...?