రాలిన ఆకుల జూచుచు
మోడులు రంధిగ
బతికినదెన్నడు
శిశిరం విసిరిన సవాలుకు అవి
చిగురులు తొడగనిదెన్నడు
మండే ఎండలు అలజడి రేపిన
మావులు పూయనిదెన్నడు
అలసిన కోయిల స్వరమున ఆమని
వలపులు నింపనిదెన్నడు
మట్టి మనుషుల చరితలు పుడమిని
తట్టిలేపనిది యెన్నడు
ఎత్తిన పిడికిలి ఎదలను కదపగ
నెత్తురు మరగనిదెన్నడు.
నేలను నాటిన విత్తనంబు
తడి తాకినా మొలవనిదెన్నడు
చిమ్మిన చీకటి దమ్మును విరవగ
మిణుగురు మెరువనిదెన్నడు.
సమ్మెట దెబ్బకు సాగిన ఇనుము
సాయుధమవ్వనిదెన్నడు
గోతులు తవ్విన నియంతలకు
ప్రజ గోరీలు కట్టనిదెన్నడు
పారే జలములు సంద్రం వైపున
పరుగులు తీయనిదెన్నడు
వీరుల త్యాగం పోరు దారులకు
బీజము వేయనిదెన్నడు
- గన్ రెడ్డి ఆదిరెడ్డి
94947 89731