Aug 06,2023 07:16

ఈ స్థాయిలో విధ్వంసం జరిగిందంటే దీని వెనక పథకం ప్రకారం జరిగిన కుట్ర వుందని ముఖ్యమంత్రి ఎం.ఎల్‌ ఖట్టార్‌ ప్రకటించారు. అదెవరన్నదే ప్రశ్న. నిజానికి ఇలాంటిది జరుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నా అలసత్వంతో అందుకు అవకాశమిచ్చిన ఆయన ప్రభుత్వ పాత్ర ఏమిటి? నిజానికి ప్రభుత్వ వివరణలు ఎక్కువగా హిందూత్వ శక్తులను సంతృప్తిపర్చేందుకు తప్ప బాధిత ముస్లింలకు ఓదార్పుగా లేవు. అల్లర్లు మొదలైనాక కూడా ఉపముఖ్యమంత్రి దుష్యంత్‌ సింగ్‌ చౌతాలా తమ అనుమతి లేకుండా ప్రదర్శనలు జరిగినట్టు చెప్పుకొచ్చారు. బిజెపి ఎం.పి రావ్‌ ఇందర్‌ సింగ్‌ మాత్రం ఇటువైపు నుంచి కూడా రెచ్చగొట్టే ప్రయత్నం జరిగిందని కొంతవరకూ అంగీకరించారు.

         మత సామరస్యం, లౌకికతత్వం కాపాడుకోవాలని చాలా కాలంగా ప్రజాస్వామికవాదులు చెబుతున్న మాట ఎంత నిజమో ఆచరణలో అర్థమవుతున్న సందర్భమిది. దేశ పాలకులు ఆ విధమైన సందేశంతో ముందుకు రావడంలేదు సరికదా ఎగదోసేందుకు కారణమవుతున్నారు. గత మూడు మాసాలుగా మణిపూర్‌లో హింసాకాండపై దేశం కలత చెందుతున్నది. ఈశాన్యాన కొండకోనల్లో, మారుమూలల్లో మహిళలపై ఘోర కలి సాగిన తీరు తెలుసుకుని భరతమాత తల్లడిల్లింది. అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహించింది. దేశం సిగ్గుపడాలని ప్రధాని మోడీ పార్లమెంటు భవనం ముందు ప్రవచించారు కూడా. అయితే అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటులో అదే మాట చెప్పడానికి ఒప్పుకోలేదు. ఉభయ సభల్లో ఆ అంశం సమగ్రంగా చర్చించడానికి కేంద్రం సిద్ధపడలేదు. అవిశ్వాస తీర్మానం రూపంలో చర్చ చేద్దామని ప్రతిపక్షాలు కొత్త వ్యూహం చేపట్టాల్సి వచ్చింది. ఈ లోగా దేశ రాజధాని శివార్లలోని కార్పొరేట్‌ హబ్‌ గురుగావ్‌, నుV్‌ా పట్టణాల్లో మత కలహాలు భగ్గుమన్నాయి. మత సంస్థలు వ్యూహాత్మకంగా పెట్టిన చిచ్చు ఆరు ప్రాణాలు పోవడానికి కారణమైంది. హిందూత్వ శక్తుల కవ్వింపు చర్యలు, వాటిపై అభద్రతతో ముస్లింలు రెచ్చిపోవడం తీవ్ర హింసాకాండకు దారితీసింది. అక్కడ చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారు, పని చేసుకుని పొట్ట పోసుకునే శ్రమజీవులు, వలస ప్రాణులు అకారణంగా బలైపోయారు. మణిపూర్‌ మంటలు ఢిల్లీ పాలకులను చేరడానికి చాలా సమయం పట్టింది కానీ ఈ విధ్వంసం, దావానలంలా వ్యాపించిన హింస దేశానికే కలవరం కలిగించాయి.
         ఈ సమయంలోనే వారణాసి లోని జ్ఞానవాపి మసీదు వాజ్యం తిరగదోడబడింది. ఒకప్పుడు అయోధ్యలో బాబ్రీ మసీదు/రామ జన్మభóూమి వివాదం రగిలిన తీరులోనే ఇప్పుడు వారణాసి వివాదం రగులుకుంటుందనే సందేహాలు బలపడుతున్నాయి. ఈ మసీదులో పురావస్తు పరిశోధనలు జరపాలంటూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలు సుప్రీం కోర్టు దాకా వెళ్లి తిరిగి హైకోర్టుకు వచ్చి అనుమతి పొందాయి. అయితే ఆ అనుమతితో నిమిత్తం లేకుండా యు.పి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దాన్ని మసీదు అననక్కరలేదని ఏకపక్షంగా ప్రకటించేశారు. ఇలాంటి వైఖరి ఆచరణలో మతోన్మాద రాజకీయాలను ఎలా ప్రకోపింపచేస్తుందో చాలాసార్లు చూశాం. అన్నట్టు మధురలోనూ కృష్ణ జన్మస్థాన్‌ ఇలాంటి మలుపులే తిరుగుతున్నది. వందల సంవత్సరాల కిందటి చరిత్ర పరిణామాలపౖౖె ఇలాంటి వివాదాలు పునరావృతం కాకూడదనే పార్లమెంటు 1991 ప్రార్థనా స్థలాల చట్టం ఆమోదించింది. అయోధ్య సమస్యలో సుప్రీం కోర్టు తీర్పును పాటించాలని మిగిలిన అన్ని చోట్ల 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిన నాటి యథాతథ స్థితి కొనసాగాలి తప్ప కొత్త వివాదాలు అనుమతించరాదని ఈ చట్టం నిర్దేశించింది. కాని స్వయాన సుప్రీం కోర్టు ఇప్పుడా చట్టానికి కొత్త భాష్యం చెప్పి కొత్త తగాదాలకు తలుపు తీసింది. ఈ వివాదాలు, విధ్వంసాలు, విద్వేషాల పర్యవసానాల పట్ల ప్రతి భారతీయుడూ అప్రమత్తంగా వుండాలి. జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఒక ఆర్‌పిఎఫ్‌ జవాన్‌ నలుగురు ముస్లింలను వెతికి మరీ కాల్చి చంపడం, మతిస్థిమితం లేనివాడని అధికారులు అతన్ని సమర్థించడం కూడా ఇలాంటిదే.
 

                                                                      హర్యానాలో జరిగిందేమిటి ?

హర్యానాలో చెలరేగిన మత ఘర్షణలు, విధ్వంస విద్వేషాలు వాస్తవానికి ఢిల్లీలో జరిగినట్టే భావించాలి. ఎందుకంటే గురుగావ్‌ పారిశ్రామిక కేంద్రం దేశ విదేశీ పెట్టుబడులకు, పెద్ద సంస్థలకు నిలయం. దేశమంతటి నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుల నుంచి సామాన్యుల వరకూ అక్కడుంటారు. ఇటీవలే కురిసిన కుంభవృష్టి, వరదల సమయంలో ఈ సంపన్నులు తప్పించుకోగలిగారు గాని మత కలహాల దెబ్బకు తట్టుకోలేకపోయారు. పని చేసుకోవడానికి వలస వచ్చిన అనేక మంది ఇంటిదారి పట్టారు. చిన్నచిన్న వ్యాపారులు దారుణంగా నష్టపోయారు. వారి దుకాణాలు, హోటళ్లు, ఇళ్లు ధ్వంసం కావడం, పూర్తిగా దగ్ధమైపోవడం వారిని కుదిపేసింది. డబుల్‌ ఇంజన్‌ సర్కార్ల బిజెపి నేతల నుంచి ఒక్క ఓదార్పు మాటైనా రాకపోగా ఎదురుదాడి చేస్తుండడంతో హతాశులై వారు మరెక్కడికి పోవాలని కలవరపడుతున్నారు. మొత్తం వ్యవహారం చూస్తే ఒక పథకం ప్రకారమే అల్లర్లు సృష్టించినట్టు స్పష్టమవుతుంది. వాస్తవానికి నుV్‌ా ముస్లిం జనాభా అధికంగా వుండే ప్రాంతం. జులై 31న విశ్వ హిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌, ఇతర పరివార్‌ సంస్థలు రెండు దేవాలయాల మధ్య బ్రజ్‌ మండల్‌ యాత్ర నిర్వహిస్తామని ప్రకటించాయి. సంప్రదాయికంగా ఎప్పటినుంచో జరుగుతున్న ఈ ప్రదర్శన ఇటీవలి సంవత్సరాలలో ఉద్రిక్తతలకు ఆలవాలమవుతున్నది. ఎందుకంటే విహెచ్‌పి స్థానికులతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌ల నుంచి కూడా భారీగా జన సమీకరణ చేసి బల ప్రదర్శనగా మార్చేసింది. పైగా ఈ సారి యాత్రలో బజరంగ్‌దళ్‌ నాయకుడైన మోనూ మనేసర్‌ పాల్గొంటాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ మనేసర్‌ రాజస్థాన్‌ లోని భరత్‌పూర్‌లో మొన్న ఫిబ్రవరిలో గోరక్షణ పేరిట నిసార్‌, జునాయిడ్‌ అనే ఇద్దరు ముస్లిం యువకుల హత్య కేసులో నిందితుడుగా వున్న వ్యక్తి. దానికి ముందు జిమ్‌లో శిక్షణ నిచ్చే ఆసిఫ్‌ఖాన్‌, వారిస్‌ ఖాన్‌ అనే మెకానిక్‌ హత్యలో కూడా నిందితుడుగా వున్నాడు. అలాంటి వ్యక్తి పాల్గొంటాడని ప్రకటించడం ముస్లిం యువతలో తీవ్ర నిరసనకు దారితీసింది. వారూ వ్యతిరేకంగా సమీకృతం కావడం ప్రచారం సాగించడానికి దారితీసింది. ముందు నుంచి సోషల్‌ మీడియాలో ఈ కథనాలు పోటాపోటీగా నడిచాయి. ఈ సారి ప్రదర్శన తీవ్ర హింసాకాండకు దారితీయవచ్చునని ముందు నుంచే పరిశీలకులు అనుమానిస్తూ వచ్చారు. రాజకీయ పార్టీల నాయకులు ఆ మేరకు పోలీసు యంత్రాంగానికి హెచ్చరికలు చేశారు కూడా. అయితేనేం దేశంలో ఇప్పుడున్న వాతావరణం, బిజెపి, ఆరెస్సెస్‌ రాజకీయ వ్యూహాల కారణంగా వాటిని బేఖాతరు చేశారు. మరీ ముఖ్యంగా చివరి రోజున మరో బజరంగ్‌దళ్‌ కార్యకర్త రెచ్చగొట్టే భాషలో దారుణమైన వీడియో వైరల్‌ చేశాడు. తమ రాకను కాచుకోవడానికి నుV్‌ా ప్రజానీకం సిద్ధంగా వుండాలని సవాళ్లు విసిరాడు.
 

                                                                 హత్యలు, విధ్వంసాలు, అరాచకం
ఈ నేపథ్యంలో మొదలైన ప్రదర్శనలో పరివార్‌ కార్యకర్తలు తీవ్ర భాషలో రెచ్చగొట్టడం ఆశ్చర్యమేమీ కాదు. మనేసర్‌ రాలేదు గాని బజరంగ్‌దళ్‌ నాయకుడైన సుందర్‌ జైన్‌ హాజరైనారు. నల్వార్‌ మహదేవ మందిర్‌లో పాల్గొని ఉద్రేకాలు పెంచేలా ప్రసంగించాడు. అంతేగాక వారు తుపాకులు, ఇతర ఆయుధాలు పట్టుకుని ఉద్రిక్తత పెంచారు. ముందే రెచ్చిపోయి వున్న ముస్లిం యువత వారిపై రాళ్లు విసిరారు. దాంతో ప్రదర్శకులు తాము బయిలుదేరిన మొదటి గుడి దగ్గరకు వచ్చి తల దాచుకున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ప్రభుత్వాధినేతలు పరిస్థితిని ఉపశమింపచేయడానికి చర్యలు తీసుకోలేదు. పక్క జిల్లాల నుంచి అదనపు పోలీసులను రప్పించి వారి రక్షణలో మళ్లీ ప్రదర్శకులను ముందుకు సాగేందుకు అనుమతినిచ్చారు. ఆగస్టు 2న ఈ ప్రదర్శకులు వెళ్లి సెక్టార్‌ 57లో ఒక మసీదుపై దాడి చేశారు. అక్కడ పాతికేళ్ల వయసున్న ఇమామ్‌ను చంపివేసినట్టు సమాచారం. మోటారు సైకిళ్లపై వచ్చిన దుండగులు దాంతోపాటు మరో మసీదుపై పెట్రోలు బాంబులు విసిరేశారు. దాంతో అవతలివారు మళ్లీ ఎదురుదాడి చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిపోయింది. కర్ఫ్యూతో సహా నిషేధాజ్ఞలు విధించాల్సి వచ్చింది. వాహనాల దహనం, విధ్వంసం, అల్లర్లు, అరాచకం తాండవించాయి. ఇక జిల్లా యంత్రాంగమైతే అచేతనంగా వుండిపోయింది. నుV్‌ా సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌పై దుండగులు దాడి చేశారు. ఇద్దరు హోం గార్డులు, నలుగురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గురుగావ్‌, నుV్‌ా, సోహ్నాలలో 70 మందికి పైగా గాయాలపాలైనారు. కోటానుకోట్ల విలువైన ఆస్తి సర్వనాశనమైంది. వందలాది మంది ప్రాణాలు అర చేత పట్టుకుని ఇళ్లు వదలిపోయారు. ఐటి నిపుణులు కూడా హడలెత్తి స్వస్థలాలకు పయనం కట్టారు. ఒక్కసారిగా గురుగావ్‌ కల్లోలితమైపోయింది. ఇక్కడున్న బహుళజాతి కంపెనీల ప్రతినిధులు విదేశాల నుంచి ఆందోళన సందేశాలు పంపే పరిస్థితి ఏర్పడింది. ఈ స్థాయిలో విధ్వంసం జరిగిందంటే దీని వెనక పథకం ప్రకారం జరిగిన కుట్ర వుందని ముఖ్యమంత్రి ఎం.ఎల్‌ ఖట్టార్‌ ప్రకటించారు. అదెవరన్నదే ప్రశ్న. నిజానికి ఇలాంటిది జరుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నా అలసత్వంతో అందుకు అవకాశమిచ్చిన ఆయన ప్రభుత్వ పాత్ర ఏమిటి? నిజానికి ప్రభుత్వ వివరణలు ఎక్కువగా హిందూత్వ శక్తులను సంతృప్తిపర్చేందుకు తప్ప బాధిత ముస్లింలకు ఓదార్పుగా లేవు. అల్లర్లు మొదలైనాక కూడా ఉపముఖ్యమంత్రి దుష్యంత్‌ సింగ్‌ చౌతాలా తమ అనుమతి లేకుండా ప్రదర్శనలు జరిగినట్టు చెప్పుకొచ్చారు. బిజెపి ఎం.పి రావ్‌ ఇందర్‌ సింగ్‌ మాత్రం ఇటువైపు నుంచి కూడా రెచ్చగొట్టే ప్రయత్నం జరిగిందని కొంతవరకూ అంగీకరించారు. మొత్తంపైన పోలీసులు రంగంలోకి దిగి 140 మందిని అరెస్టు చేశారు. వంద వరకూ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
 

                                                                సోషల్‌ మీడియా ఆయుధంగా..

నుV్‌ా హింసాకాండలో ఆందోళన కలిగించే అంశం సోషల్‌ మీడియా పాత్రే. దాదాపు 2000 వీడియోలు యూట్యూబ్‌ ద్వారా ప్రసారమై ప్రజలలో భయోత్పాతం, మత విద్వేషం పెంచాయి. ఇరుమతాల వైపు నుంచి వున్నా అధిక భాగం విద్వేషాన్ని పెంచే విధంగా బజరంగ్‌దళ్‌ సృష్టించినవే. అవతలివారు దాడి చేసినట్టు అమానుషంగా ప్రాణాలు తీసినట్టు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. నుV్‌ా జిల్లా పాత పేరు మేవట్‌. మేవా రూపురేఖలు మార్చేయాలి. ఇది హిందూ హంతకుల కేంద్రంగా వుండొద్దని రెచ్చగొట్టారు. ఇందుకు ప్రతిగా ముస్లిం యువకులు కొందరు కూడా హింసకు పురికొల్పే వీడియోలు, పోస్టులు చేశారు. ఇదంతా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నా సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నా అధికార వర్గాలు ప్రేక్షక పాత్ర పోషించాయి. జరగాల్సిన ఘోరాలు జరిగిపోయాక ఇప్పుడు సోషల్‌ మీడియా వీడియోలు పరిశీలించేందుకు కమిటీని నియమించారు. వారిలో కొందరిపై కేసులు కూడా పెట్టారు. మరికొందరిపై దర్యాప్తు జరుగుతున్నది. చిన్నాభిన్నమైన అక్కడ ప్రజా జీవితం కోలుకోవడానికి చాలా సమయమే పడుతుందనడంలో సందేహం లేదు. ఎన్నికల కోసం మత విభజన పెంచే రాజకీయాలు మరోసారి ఉధృతమయ్యే ప్రమాదాన్ని ఈ ఘటనలు ఇంకోసారి గుర్తు చేస్తున్నాయి.

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి