Aug 24,2023 07:12

వాషింగ్టన్‌ : సెప్టెంబరు 7 నుండి 10 వరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారత్‌లో పర్యటించనున్నారని వైట్‌హౌస్‌ ప్రకటించింది. 9, 10 తేదీల్లో భారత్‌లో జరిగే జి-20 దేశాల నేతల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధంతో పాటూ పలు అంతర్జాతీయ అంశాలపైన నేతలు చర్చించనున్నారు. గతేడాది డిసెంబరు 1న జి-20 అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా నుండి భారత్‌ చేపట్టింది. వచ్చే నెల జరగబోయే సదస్సులో పెద్ద సంఖ్యలో ప్రపంచ నేతలు పాల్గొంటారని భావిస్తున్నారు. పరిశుద్ధ ఇంధన వినియోగానికి మారడం, వాతావరణ మార్పులను ఎదుర్కొనడం వంటి కీలకాంశాలతో సహా పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే ఉక్రెయిన్‌లో రష్యా జరుపుతున్న యుద్ధంతో తలెత్తిన ఆర్థిక, సామాజిక పర్యవసానాలను కూడా నేతలు చర్చించనున్నారని వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబరు 4-7 తేదీల్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ జకార్తాలో పర్యటిస్తారు. అమెరికా-ఆసియాన్‌ సదస్సు, తూర్పు ఆసియా సదస్సులకు ఆమె హాజరవుతారు. ఇండో-పసిఫిక్‌ నేతలతో చర్చలు జరుపుతారు.