ఈ భూ ప్రపంచంలో మనిషికి తెలియని కొత్త జాతి జీవులు ఎన్నో దాగున్నాయి. వాటన్నిటినీ శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటకలోని ఎల్లాపూర్‌లో ఒక కొత్త జాతి పీత వెలుగులోకి వచ్చింది. దీనికి 'ద్వివర్ణ' అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఆ విశేషాలు తెలుసుకుందాం..!
కర్ణాటకలోని ఎల్లాపూర్‌లో ఒక కొత్త జాతి పీత వెలుగులోకొచ్చింది. ఈ పీత రెండు రంగుల్లో భలే చూడముచ్చటగా ఉంది. 3 అంగుళాల పొడవు, 2 అంగుళాల వెడల్పు ఉన్న ఈ పీత రెండు రంగులతో సాధారణ పీతల కంటే భిన్నంగా కనిపిస్తోంది. ఉత్తర కన్నడ జిల్లాలో కనిపించిన ఈ పీతకు 'ద్వివర్ణ' అని నామకరణం చేశారు శాస్త్రవేత్తలు.
ప్రత్యేక జాతిగా నిర్ధారణ..
ద్వివర్ణ పీతలు తినదగినవి కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి నాచు, లైకెన్‌లపై మనుగడ సాగిస్తాయి. డ్యూయల్-టోన్ కలిగిన ఈ పీత పశ్చిమ కనుమల్లోని రాతి క్రస్ట్‌లో నీటి వనరుల మధ్య జీవిస్తుంటుందని తెలిపారు. ఇది అత్యంత ప్రత్యేకమైన పీతల్లో ఒకటని హెగ్డే అన్నారు. అయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా దీనిని ఒక ప్రత్యేకమైన జాతిగా నిర్ధారించింది. దాంతో హెగ్డే, భజంత్రీలకు 'సిటిజన్ సైంటిస్ట్స్' అనే బిరుదు లభించింది.
'ఇలాంటి రంగురంగుల పీతను ఇంతకు ముందెన్నడూ చూడలేదని మేం ఆశ్చర్యపోయాం. ఇది ఆసక్తికరంగా ఉందని మేం భావించాం. చూడ్డానికి ప్రత్యేకంగా ఉండటంతో వెంటనే కొన్ని ఫొటోలు, వీడియోలను తీసుకున్నాం. ఇలాంటి పీతల గురించి మేం గూగుల్‌లో వెతకడం ప్రారంభించినప్పుడు, మాకు ఏ సమాచారం దొరకలేదు' అని హెగ్డే తెలిపారు. చివరికి ఇది కొత్త పీత జాతి కావచ్చుని ఇద్దరం భావించి, శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లాం.
భారత్‌లో ఇది 75వ పీత జాతి..
మన దేశంలో ఇప్పటివరకూ కనిపెట్టిన 75వ పీత జాతి అని 'ద్వివర్ణ' గురించి వివరించారు శాస్త్రవేత్తలు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు నిండిన సందర్భంగా వేడుకలు జరుపుకున్న ఆగస్టు 15నే ఈ 75వ జాతి పీతకు శాస్త్రీయంగా అంగీకారం లభించడం విశేషం. 2021 జూన్ 30న భారే అడవుల గుండా ప్రయాణిస్తున్న ఎల్లాపూర్ సమీపంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ గోపాల్ కృష్ణ హెగ్డే, కద్రా ఫారెస్ట్ గార్డ్ పరశురాం భజంత్రీలు రంగు రంగుల్లో ఉండి ఆకట్టుకున్న ఈ పీతను కనుగొన్నారు. ఈ మంచినీటి పీత చాలా ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో వారు ఆశ్చర్యపోయారు. దీంతో ఆ కొత్త పీత గురించి శాస్త్రవేత్తలకు చెప్పారు. అలా ఈ పీత వెలుగులోకి వచ్చింది. దీనిని కనుగొన్న సంవత్సరం తరువాత ఘటియానా ద్వివర్ణ (డైక్రోమాటిక్) అని పేరు పెట్టారు. ఎందుకంటే ఇది రెండు రంగుల్లో ఉంది. ఈ పీత తల తెలుపు రంగులో ఉంటే దాని శరీరం ఊదారంగులో ఉంది.
శాస్త్రవేత్తల సహకారం..
ఈ విషయాన్ని వెరిఫై చేసుకోవడానికి వారు రిలయన్స్ ఫౌండేషన్‌కు నాయకత్వం వహిస్తున్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వరదగిరిని సంప్రదించారు. వరదగిరి ఇంతకు ముందు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీలో పనిచేశారు. ఆ అనుభవంతో దీనిని పరిశీలించిన ఆయన ఇది కొత్త జాతి కావచ్చునని అభిప్రాయపడ్డారు. మరింత సమాచారం కోసం పీతలపై ప్రత్యేకత కలిగిన శాస్త్రవేత్త, ఠాక్రే ఫౌండేషన్‌కు చెందిన తేజస్ థాక్రేని, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన సమీర్ కుమార్ పతిలను సంప్రదించాల్సిందిగా సూచించారు. హెగ్డే, భజంత్రీలు ఆయన చెప్పినట్లుగానే సమీర్ కుమార్‌ను కలిశారు. కొత్త పీత గురించి తెలుసుకున్న ఆయన ఆశ్చర్యపోయారు. ఈ విషయాలను నిర్ధారించుకోవడానికి వ్యక్తిగతంగా ఎల్లాపూర్‌కు వెళ్లారు. ఆపై అతను దానిని కనుగొన్నారు. తర్వాత అతను ఒక సైంటిఫిక్ పేపర్ రాయగా.. అది హెగ్డే, భజంత్రీల పేర్లతో ప్రచురితమయ్యాయి.