Apr 02,2023 07:57

పైన వెన్న, లోన సున్న
మాటకు, మనసుకు పొంతన లేని నైజం
ఆధునికునని గొప్పలు పోతోన్న
నేటి మానవుని సొంతం.

మనో తెగులు బారినపడి,
పైశాచిక స్వార్థనక్రదంష్ట్రల్లో
ఇరుక్కున్న బంధాలు
ఆత్మీయతా పూలను కలిపే
దారాన్ని తెంపేస్తోన్న
ఈ నవపోకడ రోజుల్లో
అనుబంధాలు అదృశ్యం.

ఆ రోజుల్లో...
అనురాగ కుసుమ సౌరభాలు
గుభాళించి
దిగంతాలు వ్యాపించి
హృదయాలకు
ఆర్ధ్రతతో స్వాగతం.

ఈ రోజుల్లో...
అధరం మాత్రం
నవ్వుతూ అతిథిని లోనికి రమ్మని,
చిట్లిస్తున్న నొసలు మాత్రం
ఎందుకొచ్చావని?
మాటల్లో మధువులొలకబోత
మనసులో.. విషం పిచికారీ.
ఇవీ నేటి మనిషి భిన్న పార్శ్వాలు.

నిలువెత్తు స్వార్థం నీడలా వస్తుంటే
నేనన్న అహం నీడలో
బతుకుతోన్న.. ఓ మనిషీ!
ఎవరికోసం ఈ కపట ప్రేమలు?
నిష్కపటమైన ప్రేమామృతంతో
కలిగే ఆనందం
అంతులేని, అనుపమానమైన
అనిర్వచనీయమైనదని తెలుసుకో..
నిజమైన ప్రేమతోనే
మానవతా పరిమళాలు
వ్యాపిస్తాయని గుర్తెరుగు..
స్వార్థాలు భుజానికెత్తుకొని
ఆత్మవంచన చేసుకోక,
ఆత్మపరిశీలన చేసుకొంటూ
ఒక్కసారి నిన్ను నువ్వు సరిచూసుకో.

వేమూరి శ్రీనివాస్‌
99121 28967