Aug 06,2023 16:29

ఊహలకు నిత్యం ప్రాణం పోస్తూ
ఆశలకు రెక్కలను నింగిలో తొడుగుతూ
రేపటి తేజస్సుకు కాలాన్ని నిద్ర లేపుతూ
బతుకు కొలనులో
నిండా మునిగితేలుతున్నాం..

పిడికిళ్ల మధ్య స్వప్నం జారిపోతుంది
అరచేతిలో రేఖలు కొలతలు వేస్తూ కూర్చుంటే
ఆశయ శిఖరాలు లోయల్లా కనిపిస్తుంటే
వెక్కిరిస్తూ ఎన్నో నోళ్లు
నిత్యం సతాయిస్తున్నాయి..

గతం తాలూకు గోడల మీద వర్ణచిత్రాలు
నేడు వాడిపోయి రంగు చెదిరిపోయి కనిపిస్తే
వర్తమానపు కళ్ళు ఇంద్రధనస్సును చూస్తుంటే
చిగురించే లేత చిగుళ్ళ
మనసును బాధిస్తూనే ఉంది..

భవిష్యత్తు కాంతిరేఖలు
భ్రమలు గొలుపుతుంటే
కాల ప్రవాహంలో జీవితం
కాగితం పడవలా తిరుగుతుంటే
నిర్దిష్టమైన రహదారిలో
ముళ్ళ కంప పరుచుకుంటే
సున్నితమైన పాదం గమ్యంవైపు చూస్తుంది..

విశ్రాంతి ఎరగని కాలం శిక్షణ ఇస్తుంది
బతుకు పంటకు కావలసిన ఎరువునందిస్తూ
అలుపెరుగని ప్రయాణంలో
ఆటంకాలు వదిలేస్తే
కష్టపు రెక్కల చప్పుళ్ళు ఆనందం కలిగిస్తాయి..

శిశిరాన్ని వసంతంగా మార్చేది కాలమొక్కటే
నీటి చుక్కల దారుల్లో వనము వికసిస్తుంది
నేల పలకపై ఒక రూపాన్ని నిర్మించగలుగుతుంది
పలుకులన్నీ కావ్యమై హృదయాలను అలరిస్తుంది..

కొప్పుల ప్రసాద్‌
9885066235