Sep 27,2022 06:53

  • నేడు భగత్‌ సింగ్‌ జయంతి

''భగత్‌సింగ్‌ గొప్ప స్వాతంత్య్ర సమరయోధుల్లోను, విప్లవ సోషలిస్టుల్లోను ఒకడు మాత్రమే కాదు. తొలి మార్క్సిస్టు చింతనాపరుల లోను, సిద్ధాంతకర్తల లోను ఒకడు. దురదృష్టవశాత్తు భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌ వంటి ఆయన సహచర కామ్రేడ్ల పేర్లను, కీర్తిని మతతత్వ వాదులు, ఛాందసవాదులు, అభివృద్ధి నిరోధకులు తమ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుని ఈ చివరి వాస్తవాన్ని అంతగా వెలుగులోకి రాకుండా చేశారు''.
                - ప్రొఫెసర్‌ బిపిన్‌ చంద్ర

భగత్‌సింగ్‌ 1907వ సంవత్సరంలో సెప్టెంబర్‌ 27వ తేదీన నేటి పాకిస్థాన్‌ లోని ల్యాల్‌పూర్‌లో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. ఆయన దయానంద్‌ ఆంగ్లో-వేదిక్‌ ఉన్నత పాఠశాలలోను, ఆ తరువాత 1923లో గాంధీజీ నాయకత్వంలో సాగిన సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా జాతీయ నాయకుడు లాలా లజపతిరారు స్థాపించిన లాపూర్‌ లోని నేషనల్‌ కాలేజీ లోను విద్యనభ్యసించాడు. గదర్‌ విప్లవకారులతో సంబంధంగల కుటుంబ నేపథ్యం ఆయనిది. ఇటలీలో మాజినీ నాయకత్వంలో జరిగిన ''యువ ఇటలీ'' రిసార్జిమెంట్‌ ఉద్యమ చరిత్ర ప్రభావంతో ఆయన ఒక అంతర్జాతీయ వాదిగాను, ఒక విప్లవ జాతీయవాదిగాను మారాడు. 1918-19 సంవత్సరాలలో పంజాబ్‌లో ఎగసిన విప్లవ కెరటమతడు. ముఖ్యంగా వలస పాలకులు జరిపిన జలియన్‌ వాలాబాగ్‌ మారణకాండ ఆయన్ను 12 సంవత్సరాల ప్రాయంలోనే సామ్రాజ్యవాద వ్యతిరేక యోధునిగా పరిణమించేలా చేసింది. అయితే భగత్‌ సింగ్‌ అచిరకాలంలోనే గాంధీ నాయకత్వంలో నడిచిన సహాయ నిరాకరణ, ఖిలాఫత్‌ ఉద్యమాల చుట్టూ పరిభ్రమించే మధ్యతరగతి జాతీయవాదంతో పాటు మతాచారాల కక్ష్యను కూడా ఛేదించాడు.
             క్లుప్తంగా చెప్పాలంటే కొద్దికాలంలోనే భగత్‌సింగ్‌ గాంధీ జాతీయవాద పరిమితులను దాటి...1905లో పెల్లుబికిన స్వదేశీ ఉద్యమం మూలాలుగల విప్లవోద్యమంవైపు పయనించాడు. 1922వ సంవత్సరంలో గాంధీ తన నాయకత్వంలో సాగుతున్న సహాయ నిరాకరణోద్యమాన్ని అర్థంతరంగా ఆపటం, అదే కాలంలో చెలరేగిన మత ఘర్షణల వల్ల గాంధీ పట్ల భగత్‌సింగ్‌ కున్న భ్రమలు తొలిగిపోయాయి. 1924వ సంవత్సరంలో ఆయన సచీంద్రనాద్‌ సన్యాల్‌, రాంప్రసాద్‌ బిస్మిల్‌ వంటి ఆస్థికులైన విప్లవకారులతో స్థాపించబడిన హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్లో చేరాడు. 1924వ సంవత్సరం తరువాత రష్యాలో బోల్షివిక్‌ విప్లవం విజయవంతం అవటంతో అనేకమంది భారతీయ విప్లవకారులు, మార్క్సిస్టులుగా మారారు. 1928వ సంవత్సరంలో భగత్‌సింగ్‌ తోపాటు అనేకమంది విప్లవకారులు ఢిల్లీ లోని ఫిరోజ్‌ ఎ - కోట్లా ప్రాంతంలో సమావేశమై హిందుస్థాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ పేరును హిందుస్థాన్‌ సోషలిస్టు రిపబ్లికన్‌ అసోసియేషన్‌ (హెచ్‌.ఎస్‌.ఆర్‌.ఎ)గా మార్చారు. ''విప్లవం పెట్టుబడిదారీ వ్యవస్థకు, వర్గబేధాలకు, తారతమ్యాలకు చావు గంటను మోగిస్తుంది. అది ఒక నూతన సామాజిక క్రమానికి, నూతన రాజ్యానికి జన్మనిస్తుంది'' అని హెచ్‌.ఎస్‌.ఆర్‌.ఎ ప్రకటించింది.
            1928వ సంవత్సరంలో లాహోర్‌లో సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిపిన నిరసన కార్యక్రమంలో లాలా లజపతిరారు తీవ్రంగా గాయపడి మరణించాడు. అందుకు కారణమైన జేమ్స్‌ స్కాట్‌పై భగత్‌సింగ్‌ బృందం చేయదలచిన దాడిలో పొరపాటున అతని అసిస్టెంట్‌ సాండర్స్‌ హత్యకు గురయ్యాడు. 1929వ సంవత్సరం ఏప్రిల్‌ 8వ తేదీన భగత్‌సింగ్‌, బటుకేశ్వర్‌ దత్‌ సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీలో కరపత్రాలు విసిరి పొగబాంబులు వేసి ''విప్లవం వర్థిల్లాలి'' అని నినదిస్తూ పారిపోకుండా పోలీసులకు దొరికిపోయారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విచారణ తరవాత భగత్‌సింగ్‌, బటుకేశ్వర్‌ దత్‌లకు జీవిత ఖైదును, ఆ తరువాత సాండర్స్‌తో పాటు మరో హత్యకు కారణమైన భగత్‌సింగ్‌కు, ఆయన సహచరులైన సుఖ్‌దేవ్‌, రాజగురులకు మరణ శిక్షను విధించటం జరిగింది. ఆ మరణశిక్షను 1931వ సంవత్సరం మార్చి 23వ తేదీన లాహోర్‌ జైలులో అమలు చేశారు. అలా అసమాన్యుడైన ఒక విప్లవకారుడి శ్వాస ఆగిపోయింది.
          భగత్‌సింగ్‌ తన 23 ఏళ్ల జీవితకాలంలో అక్టోబర్‌ విప్లవం గురించి అనేక వ్యాసాలను, గ్రంథాలను చదివాడు. ఆయనకు లెనిన్‌ పట్ల గౌరవభావం ఏర్పడింది. మార్క్స్‌, బకూనిన్‌ల రచనల అధ్యయనం వల్ల ఏర్పడిన అవగాహనతో అరాచకవాదం, అహింస, తీవ్రవాదం, మతం, మతతత్వ, ఆస్తికవాదంను భగత్‌సింగ్‌ నిరంతరం విమర్శించాడు. ఆయన అవగాహనలో ప్రతి విప్లవకారుడికి ''ఆత్మ విమర్శ'', ''స్వతంత్ర ఆలోచన'' అనివార్యంగా ఉండవలసిన లక్షణాలు. మెజారిటీ ప్రజలలో ''బుద్ధిమాంద్యం''అనే వ్యాధి వ్యాపించిన సమాజంలో హేతువాదిగా మనగలగటం కష్టమని చాలా చిన్నతనంలోనే భగత్‌సింగ్‌ గ్రహించాడు.
         దాదాపు విప్లవకారులందరూ మత భావనలలో కూరుకుపోయిన స్థితిలో కూడా భగత్‌సింగ్‌ నాస్తికుడయ్యాడు. అధ్యయనమే ఆయన్ని నాస్తికత్వం వైపు, విప్లవ సామ్యవాదం వైపు నడిపించింది. విశ్వాసానికి, భావజాలానికి సంబంధించిన సమస్యలకు ఆత్మశోధన, ఆత్మ విమర్శ పద్ధతులతో హేతుబద్ద పరిష్కారాలను కనుగొనటంలో భగత్‌సింగ్‌ అసమాన ప్రతిభ కనపరిచాడు.
         భగత్‌సింగ్‌ భవ్య భారతదేశం జాతీయవాదుల, మతతత్వవాదుల ఊహలకు పూర్తిగా భిన్నమైనది. దేశాన్ని ఆయన ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించలేదేమో. ఆయనకు దేశమంటే నిర్దిష్ట సరిహద్దుల మధ్యగల మట్టి కాదు. దేశమంటే ''పెట్టుబడిదారీ భూతాలు'' పీల్చి పిప్పి చేస్తున్న...కూడు, గూడు లేని కోటాను కోట్ల ప్రజలు. ఈ పీడిత ప్రజల ఆశల్ని, ఆకాంక్షలనూ తీర్చగలిగేది శాస్త్రీయ సోషలిజం మాత్రమేనని ఆయన అధ్యయనం, ఆచరణలతో గ్రహించాడు. హేతువును, శాస్త్ర విజ్ఞానాన్ని, సామ్యవాదాన్ని చేరుకోవాలంటే విశ్వాసాల, మౌఢ్యాల, పెట్టుబడి కుతంత్రాల సుడిగుండాలను అనివార్యంగా అధిగమించటం ద్వారా మాత్రమే సాధ్యమని భగత్‌సింగ్‌కు తెలుసు. ఆయన దృష్టిలో ఇందుకు సంబంధించిన ఆచరణలో ఉన్నవాడే నిజమైన విప్లవకారుడు.
         అంతిమంగా చెప్పాలంటే భగత్‌సింగ్‌ ఔన్నత్యాన్ని ఆయన పుట్టి పెరిగిన సామాజిక నేపథ్యంలో ఆయన ఎంచుకున్న మార్గం తెలియజేస్తుంది. 1920వ దశకంలో ఒకవైపు రష్యాలో బోల్షివిక్కుల విజయం, మరోవైపు ఇటలీ, జర్మనీలలో ఫాసిజం ప్రపంచాన్ని కుదిపాయి. 1921లో అఖిల భారత హిందూ మహాసభ ఏర్పడినప్పుడు, 1925లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భవించినప్పుడు ఆయన యుక్త వయసులో ఉన్నాడు. ఈ రెండు సంస్థలపై నాటికి, నేటికి ఫాసిజం ప్రభావం ఉంది. 1920వ దశకం లోనే కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. 1920వ దశకంలో జరిగిన అటువంటి జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల పట్ల నవ యువకుడుగా ఉన్న భగత్‌సింగ్‌ స్వతంత్ర అవగాహనను ఏర్పరచుకుని విప్లవ కార్యాచరణ లోకి దిగటం విస్మయం గొలిపే చారిత్రక వాస్తవం. బిపిన్‌ చంద్ర అన్నట్టు భరతదేశం తాను విప్లవీకరింపబడటానికి భగత్‌సింగ్‌ రూపంలో తన లెనిన్‌కు జన్మనిచ్చింది! అయితే భారత లెనిన్‌ బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం చేతిలో అమరుడయ్యాడు.

నెల్లూరు నరసింహారావు