భానుడా.. లే..!
నరుడిలో జీవుడా.. లే..!
పొద్దు కుంగుతోంది..
మండే సూరీడు సల్లబడిపోయాడు..
పుడమి తల్లి ఒడిలో ఒదిగిపోయాడు..
ధరణిమాత గుండె బరువెక్కిపోయింది
భానుడా.. లే..!
నరుడిలో జీవుడా.. లే..!
స్వేచ్ఛా గాలి పీల్చేంతలో సంకెళ్లు
ఇష్టరీతిలో చెలరేగుతున్న దగాకోరులు
ఆక్రందనలు.. హాహాకారాలు
ఆకలి చావులు.. మారణహోమాలు
దారుణాలు.. దౌర్జన్యాలు
భానుడా.. లే..!
నరుడిలో జీవుడా.. లే..!
ధరణి వెన్నెముక విరిగిపోతోంది..
ఆడపిల్ల బతుకు ఛిద్రమౌతోంది...
త్యాగధనులను కన్న తల్లి ఆమె..!
ఆ వీరుల రక్తంలో తడిసి ముద్దైపోయింది
తోడుగా తరుణి రక్తం ధరణిని తడుపుతోంది
భానుడా.. లే..!
నరుడిలో జీవుడా.. లే..!
రక్తవర్ణపు ఒడిలో సూరీడు
సింత లేకుండా నిద్దరోతున్నాడు
ఎర్రటి సింధూరంలా మారాలంటే
రేయి గడవాలి.. అందాకా నీవు నిలవాలి..
కన్నతల్లికి కునుకులేదు..
చింతనిప్పులాయె ఆమె కనులు
చిమ్మ చీకటిలో కానరాకున్నాయి..
ఆదమరిచి నిద్దరోదామంటే..
కసాయి కాలం కసుక్కున దిగబడుతుందని భయం..
భానుడా.. లే.. నరజీవుడా... లే..
నీ ఉనికిని ఎత్తుకుపోతున్నారు చూడు..
ఎవరిదో కాదయ్యా.. అదంతా నీ సొత్తు..
సింధూరవర్ణం నీవు.. మండే సూరీడవు నీవే..
కారుమబ్బులను చీల్చు.. చైతన్యం రగిలించు..
ఒక్కడివి కావు.. విజృంభించే అగ్నిగోళానివి నీవు..
ఉదయించే సూర్యుడి కంటే
ముందుగానే ఉద్యమించు.. ఉక్కు పిడికిలి బిగించు..
పోరాడి సాధించే నా ముద్దు బిడ్డ పాదాలను
ముద్దాడతాను.. ముందుకు నడిపిస్తాను..
నేనెవరినీ..! వీరమాతను..
నేను..
నీ పుడమితల్లిని..!!
-ఉమామహేశ్వరి