Jul 05,2022 06:50

     స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలను ప్రారంభించే నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు ఏతెంచిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడూ ఈ రాష్ట్రానికి మొండిచెయ్యే చూపించారు. విభజనతో అన్ని విధాలా నష్టపోయిన ఎ.పి ని రెండు చేతులా ఆదుకుంటామని, ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నింటినీ అమలు చేసి తీరతామని, ఢిల్లీని తలదన్నేలా రాజధానిని నిర్మిస్తామని 2014 ఎన్నికల్లో ప్రజలకు మోడీ హామీ ఇచ్చారు. మోడీ రెండు తడవలు ప్రధాని పీఠమెక్కినా ఆ హామీలు గాల్లోనే ఉన్నాయి. సోమవారం నాటి భీమవరం సభలో తానిచ్చిన వాగ్దానాలపై పల్లెత్తి మాట్లాడకుండా అభినవ గజిని అవతారమెత్తడం మోడీకే చెల్లింది. ప్రజలు సైతం గజినీలు కావాలని వాంఛిస్తున్నట్లున్నారు ప్రధాని. కానీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసిన నయవంచనను మర్చిపోవడానికి ప్రజలు ఎంతమాత్రం సిద్ధంగా లేరు. చేసిన బాసలపై నిలదీసి నిగ్గుతేల్చేందుకు వీధుల్లోకొచ్చారు. జనం నిరసనాగ్రహంతోనైనా కేంద్ర బిజెపిలో కించిత్తు పశ్చాత్తాపం లేదనడానికి మోడీ మౌనమే తార్కాణం.
     విప్లవ కిశోరం అల్లూరిని స్మరించే అర్హత, విభజన హామీలను విస్మరించి రాష్ట్రంలో పర్యటించే నైతికత ప్రధానికి ఉందా అనేది పెద్ద ప్రశ్న. అల్లూరి గిరిజనుల హక్కుల కోసం ఆంగ్లేయులపై సాయుధ తిరుగుబాటు చేశాడు. మోడీ సర్కారు వచ్చింది మొదలు గిరిజనులను వారి జీవనాధారమైన అడవుల నుండి వెళ్లగొట్టే పనే. మైనింగ్‌లు, భారీ ప్రాజెక్టుల పేరిట అటవీ సంపదను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్రలే. అందుకు అటవీ చట్టాలను సైతం నీరుగారుస్తోంది. అక్కడిదాకా ఎందుకు? అల్లూరి తిరుగాడిన ప్రాంతంలో నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్టు పోలవరంలో వేలాది మంది గిరిజనులు నిర్వాసితులవుతుండగా, వారి పునరావాస బాధ్యత తనది కానే కాదని కేంద్ర బిజెపి పేచీ పెట్టింది. పోలవరం నిర్వాసితుల గురించి కనీస భరోసా భీమవరం సభలో మోడీ నోట వెలువడలేదు. ఇదేనా అల్లూరి నుండి నేర్చుకునే స్ఫూర్తి? గిరిజనులకు వెదురు కోతపై హక్కులిచ్చే యత్నాలు జరుగుతున్నాయన్నారు మోడీ. బస్‌లో ప్రయాణించే వ్యక్తి నుండి పర్సు కొట్టేసిన దొంగే, సదరు వ్యక్తికి టిక్కెట్‌ డబ్బులిచ్చినంత ఉదారత! ఆదివాసీలకు అటవీ ఉత్పత్తులపై కనీస మద్దతు ధర సైతం అలాంటిదే. వెనకబడ్డ జిల్లాలతోపాటు మన్యం జిల్లాలను అభివృద్ధి చేస్తున్నాం అన్నారు ప్రధాని. విభజన హామీల్లో భాగంగా ఎ.పి లో వెనకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఇస్తామన్న ప్యాకేజీ అడ్రస్‌ లేదు. ఇక మన్యం జిల్లాల అభివృద్ధి ఎక్కడిది? దేశంపై తన ఏకరూప సిద్ధాంతాన్ని రుద్దేందుకు నూతన విద్యావిధానం తెచ్చి గిరిజనులకు మాతృభాషలో విద్యాబోధన అనడం శుద్ధ అబద్ధం.
     ఆంధ్రరాష్ట్రం పుణ్యభూమి, వీర భూమి అని ప్రధాని కొనియాడారు. అల్లూరి వంటి ఎందరో దేశభక్తులకు పురుడు పోసిన గడ్డ అని స్మరించుకున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఈ పుణ్యభూమికేగా అన్యాయం చేసింది? మంత్రాలతో చింతకాయలెలా రాలవో తియ్యటి మాటలు వల్లె వేసినంత మాత్రాన రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు గుప్పెడు మట్టి చెంబుడు నీళ్లు తెచ్చి అదే పెద్ద సాయమన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, ప్రభుత్వరంగంలోనే విశాఖ ఉక్కు కొనసాగింపు లేకుండా చేయడం ఈ పుణ్యభూమికి ద్రోహం తలపెట్టడమే. అల్లూరి ఆశయాలకు తూట్లు పొడవడమే. ప్రత్యేక హోదా, విభజన హామీలపై వామపక్షాలు, ప్రజాసంఘాలు మోడీని నిలదీస్తుండగా, గెలిస్తే అవన్నీ సాధిస్తామన్న వైసిపి, ముఖ్యమంత్రి జగన్‌ వినతిపత్రానికే పరిమితం కావడం క్షంతవ్యంకాదు. పైగా విజయవాడలో నిరసన తెలుపుతున్న ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుల అరెస్ట్‌ దారుణం. ప్రధాన ప్రతిపక్షం టిడిపి, జనసేన పార్టీలు మౌనం వహించడం రాష్ట్రానికి అన్యాయం చేయడమే. అల్లూరి స్మారక చిహ్నాలను ప్రభుత్వం అభివృద్ధి చేయాలి. పోలవరం ప్రాజెక్టుకు అల్లూరి పేరు పెట్టాలి. తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా.. అని ప్రధాని తెలుగులో విప్లవ గీత పంక్తులను ఆలపించారు. రాష్ట్రాన్ని నట్టేట ముంచిన బిజెపికి అల్లూరి స్ఫూర్తితో ప్రజలు తెలుగు పౌరుషాగ్నిని రుచి చూపించడమే సరైన సమాధానం.