ఎంత మంచి కూర ఉన్నా మొదటి ముద్ద ఆవకాయతోనూ.. సాంబారు, పప్పు, పెరుగన్నంలాంటి వాటిలో నంజుకునేందుకు వడియాలు... ఉంటే 'ఆహా ఏమి రుచి..' అనాల్సిందే. ఆ మహత్ రుచులే ఈ వడియాలు, ఊర మిరపకాయలు, వాము మిరపకాయలు.. వగైరా. అందుకే వేసవి కాలం ఆరంభం నుంచే ఆయా నిలవ పదార్ధాల తయారీలో నిమగమౌతాము. సంవత్సరమంతా వాటి రుచులను ఆస్వాదిస్తాం. మరి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- బియ్యప్పిండితో.. (రవ్వ, సగ్గుబియ్యంతోనూ..)
కావలసినవి : బియ్యం పిండి - కప్పు, నీళ్ళు - 8 కప్పులు, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి -2, జీలకర్ర - స్పూను, అల్లం - అంగుళం ముక్క
తయారీ : ఒక గిన్నెలో బియ్యం పిండి రెండు కప్పుల నీటితో ఉండలు లేకుండా కలిపి ఉంచుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కచాపచాగా నూరుకుని పక్కనుంచుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో 6 కప్పుల నీటిని తీసుకుని మరిగించాలి. నీరు కళపెళ మరిగేటప్పుడు తగినంత ఉప్పు, పచ్చిమిర్చి మసాలా ముద్ద వేసుకుని నీటితో కలిపి ఉంచుకున్న బియ్యం పిండి జారును ఉండలు కట్టకుండా తిప్పుతూ పోయాలి. మీడియం ఫ్లేంలో అడుగంటకుండా తిప్పుతూ ఉడికించాలి. చిక్కగా అయిన తరువాత కాటన్ క్లాత్‌ను తడిపి, నీటిని పూర్తిగా పిండేసి బాగా ఎండ తగిలే ప్రదేశంలో పరచాలి. స్పూనులతో వడియాలు పెట్టుకొని పూర్తిగా ఎండిపోయే వరకూ ఎండనివ్వాలి. వడియాలకు వెనుక వైపు కొంచెం నీటిని చిలకరించి విరిగిపోకుండా తీయాలి. వాటిని మరోసారి బాగా ఎండనివ్వాలి. వీటిని గాలి చొరబడని డబ్బాలో నిలవపెట్టుకోవాలి.
ఇలాగే బొంబాయి రవ్వతో.. 2+ 7 కప్పుల నీరు, పచ్చి మిర్చి - 3, జీలకర్ర - స్పూను
సగ్గుబియ్యంతో .. 2 + 5 కప్పుల నీరు, ఎండుమిర్చి - 3, జీలకర్ర - స్పూను
కొలతలతో.. మిగతా ప్రాసెస్ అంతా పైవిధంగానే. రవ్వ, సగ్గుబియ్యం రెండూ మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి.
- మినప్పప్పు - బూడిద గుమ్మడితో..
కావలసినవి : బూడిద గుమ్మడికాయ (ముక్కలు- 8 కప్పులు), మినప్పప్పు - కప్పు, అల్లం- 2 అంగుళాలు, పచ్చిమిర్చి - 100 గ్రా, ఉప్పు - తగినంత, పసుపు - స్పూను, జీలకర్ర - 2స్పూను.్ల
తయారీ : రాత్రంతా నానబెట్టిన పొట్టు మినప్పప్పును శుభ్రం చేసి మెత్తగా, గట్టిగా రుబ్బుకోవాలి. గుమ్మడి కాయ పై బూడిదలాంటి తెలుపు పోయేలా కడగాలి. వీలైనంత సన్నని ముక్కలుగా కట్‌చేసి, ఉప్పు వేసి బాగా కలపాలి. నీరు ఊరిన తర్వాత వడకట్టి వెడల్పాటి బేసిన్‌లోకి ముక్కలను తీసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం నూరుకొని ముక్కల్లో వేసుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు, జీలకర్ర, మినప్పిండి వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. కాటన్ క్లాత్‌పై చిన్న చిన్న వడియాలు పెట్టుకోవాలి. రెండు రోజులు ఎండనివ్వాలి. గుడ్డ నుంచి వేరుచేసిన వడియాలను నాలుగైదు రోజులు బాగా ఎండనిచ్చి గాలి చొరబడని డబ్బాలో పెట్టుకోవాలి. ముక్కలుగా కాకుండా పప్పుతో పాటు ముక్కలను మెత్తగా రుబ్బుకొని కూడా వడియాలు పెట్టుకోవచ్చు.
- వాము మిరపకాయలు..
కావలసినవి : మిరపకాయలు - 1/4 కేజీ, ఉప్పు - 2 స్పూన్లు, వాము - 2 స్పూన్లు, ఇంగువ - 1/4 స్పూను
తయారీ : మిరపకాయలను శుభ్రం చేసి, తుడిచి గాటు పెట్టుకోవాలి. దానిలో ఉప్పు, వాము, ఇంగువ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని స్టఫ్ చేయాలి. అన్నింటినీ ఒక గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిజ్‌లో ఉంచుకొని రెండు రోజుల తరువాత నుంచి వాడుకోవచ్చు. ఇవి మజ్జిగ లేదా పెరుగన్నంలోకి, పప్పుచారులోకి బాగుంటాయి.
- ఊరమిరపకాయలు..
కావలసినవి : మిరపకాయలు - 1/4 కేజీ, పుల్లని పెరుగు - 1/4 కేజీ, ఉప్పు - 100 గ్రా., వాము - 2 స్పూన్లు,
తయారీ : దళసరి మిరపకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ఆరనివ్వాలి. మిరపకాయకు ఒకపక్క చివరి వరకూ గాటు పెట్టాలి. మజ్జిగలో ఉప్పు, పసుపు, దంచుకున్న వాము వేసుకోవాలి. ఉప్పు పూర్తిగా కరిగేంత వరకూ కలిపి దానిలో చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని రెండు రోజుల పాటు ఊరనివ్వాలి. మూడో రోజు మిరపకాయలను మజ్జిగ నుంచి వేరుగా తీసి ఎండబెట్టాలి. సాయంత్రం మళ్లీ ఆ మిరపకాయలను అదే మజ్జిగలో వేసి రాత్రంతా ఊరనివ్వాలి. ఇలా రెండు మూడు రోజుల పాటు మజ్జిగ అంతటినీ మిరపకాయలు పీల్చుకునేంత వరకూ చేయాలి. అలా మజ్జిగ మొత్తం పీల్చుకుని పొడిగా అయిన మిరపకాయలను చెమ్మ లేకుండా పెళపెళలాడేంత వరకూ ఎండనివ్వాలి. వీటిని గాలి చొరబడని డబ్బాలో పెట్టుకుంటే చాలా కాలం నిల్వ ఉంటాయి.