Oct 02,2022 09:15

లయబద్ధంగా గుండె
బతుకు గీతాన్ని ఆలపిస్తుంది..
జీవితపు నడవడికలో
గతి తప్పుతున్న అడుగులకు..
దిశానిర్దేశం చేస్తుంది.

ఎంత గట్టిదో గుండె
ఈ ప్రపంచం పగపట్టిన పాములా మారి..
విషపు కోరలతో పాకుతూ కాటువేస్తున్నా..
గరళాన్ని ఎదలో దాచుకొని ఎదురీదుతుంది.
కష్టాల తాకిడికి ముక్కలైన..
వెలుగు గాజుముక్కలను..
ఒక్కతాటికి చేర్చి అతికిస్తుంది.

తాకిన గాయం తనువును తండ్లాడ పెట్టిస్తున్నా
కణాలన్నీ కదంతొక్కి రగిలిన గాయాన్ని..
మాన్పుతూ ముందుకు పొమ్మంటున్నవి.
మేఘాలన్నీ నల్లని ముసుగు ధరించి..
తెల్లని ఆకాశాన్ని కప్పేస్తున్నాయి.
మేఘం వర్షమై కురిసి..
రంగుల హరివిల్లును నింగిలో అలంకరించింది.

ఆటుపోట్ల అవరోధంలో ఎన్ని ఒడిదుడుకులో
కాలం ప్రశ్నగా మారి కవ్విస్తూనే ఉంది
ఎదలో దాగిన సమాధానం మాత్రం
నిదానంగా జవాబు చెబుతూనే ఉంది.
బతుకు జవాబు పత్రంపై..
ఆశల సిరాను నింపుకొని రాస్తూనే వున్నాను
వందకు తొంభై మార్కులు వస్తాయని ఆశ.
ముప్పైఐదు మార్కులకాడే
కాలం ఆగిపొమ్మంటోంది.

మదిలో ప్రయత్నపు ఇంకుచుక్కల..
నిధి నిండుకొని ఉంది.
రాస్తూనే ఉంటాను..
విజయపు మెట్లు ఎక్కేవరకూ.
పోరాడుతూనే ఉంటాను..
బానిస సంకెళ్లను తెంచేవరకూ.
బతుకు జవాబు పత్రంపై రాసిన అక్షరాలన్నీ..
రేపటి తరం తలరాతలు మార్చేలా.


అశోక్‌ గోనె
94413 17361