Aug 07,2022 09:48

చేను మధ్యలో బల్ల పరుపులాంటి విశాలమైన బండరాయి, దానిపై కూర్చుని కలయ చూస్తున్నాను. మునుపటి బండి జాడలు కంప చెట్ల మధ్య కనబడకుండా పోయాయి. ఎక్కడ చూసినా కలుపు మొక్కలదే రాజ్యమైంది. తిన్నగా లేచి అలా ముందుకు నడిచాను. అక్కడక్కడా నంబర్లు రాసిన రాయిలు పాతారు. అదే పొలం ఒకప్పుడు నూరు పుట్ల ధాన్యాన్ని చేతిలో పెట్టింది. ఇప్పుడు అదే నేల ఇంకొకరి చేయి మారే సరికి రూపు రేఖలు మార్చుకుంది. ఇంకాస్త ముందుకెళితే పిచ్చి మొక్కలు నిండిపోయిన సెలక. అదే ఇప్పుడు బ్రతుకు తెరువుకు ఊతమిచ్చే మాగాణి.
బారెడు పొద్దెక్కింది వచ్చిన పని మరచిపోయి ఏవేవో ఆలోచిస్తూ నడుస్తున్నాను. చేతిలో కొడవలి పట్టుకున్నానుగానీ వచ్చిన పని మరిచాను. పొయ్యిలో అగ్గి వెలగాలంటే కట్టెలు కొట్టుకెళ్లాల. గబగబా కొట్టి మోపు కట్టి, నెత్తిన పెట్టుకొని ఊరి ముఖం పట్టాను. కట్టెల మోపు బయటనే వేసి ఇంట్లోకి అడుగు పెట్టాను. చెరిగిన బియ్యం చేటలోనే వున్నాయి. భార్య లక్ష్మీ మాత్రం ఓ మూలన కూర్చుని చిరిగిపోయిన బట్టలకు కుట్లు వేస్తోంది. నన్ను చూడగానే ఆమె ముఖంలో ఒక వెలుగు ప్రసరించింది. అవి అక్కడే వదిలేసి ఆత్రంగా లేసొచ్చింది. 'కట్టెలు తెచ్చావా' అని అడిగింది. హా 'తెచ్చాను' అంటూ సమాధానం చెప్తా ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటుండగా కొడుకు మల్లేశం రానే వచ్చాడు. 'నాన్నా ఎప్పుడూ ముద్ద కారమేనా, చపాతీ కావాలి' ఏనాడూ అడిగినోడు కాదు మల్లేశం. 'లక్ష్మీ! చపాతీ పిండి వుందా' అని భార్యను అడిగాను 'లేదు ఐపోయింది' అంటూ సమాధానమిచ్చింది.
కొక్కీకి వేలాడదీసిన చొక్కా జేబు తడిమాను పట్టు తప్పి రూపాయి బిళ్ల ఘల్‌ మంటూ కింద పడిపోయింది. అది తప్ప చేతిలో చిల్లిగవ్వ లేదు. తిన్నగా బయటికి నడిచాను నేరుగా రామయ్య కిరాణా కొట్టు దగ్గరికెళ్లి నిలుచుని, చపాతీ పిండి కావాలని అడిగాను. ఒక చీటి తీసి నా ముందర పెట్టి 'దీని సంగతి ఏమంటావు' అన్నాడు. నోరు పెగల్లేదు నాకు. అది ఇదివరకే ఇవ్వవలసిన బాకీ చిట్టా. ఈసారి పంటకు తీరుస్తానని గట్టిగా మాటిచ్చాను. ఎక్కువ వర్షం పడి చెరువు కట్ట తెగిపోయి పంట మొత్తం నీటిపాలైపోయింది. ముప్పై వేలు నష్టం 'బాకీ పడి ఏడాది దాటిపోతోంది. అప్పు మీద అప్పు కావాలంటే కుదరదు' అని మొహంపైనే అనేశాడు రామయ్య. అక్కడి నుంచి లేచి ఇంటికి వచ్చేశాను. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మల్లేశం ఒట్టి చేతులతో తిరిగొచ్చిన నన్ను చూడగానే వాడి ముఖంలో వెలుగు మాయమైంది 'ఈ పూటకు సర్దుకోరా రేపు తిందువుగానీ!' అన్నాను. మెల్లగా బుంగమూతి పెట్టి, మంచంపై కూర్చుండిపోయాడు మల్లేశం.
బ బ బ
కొద్దిరోజులు గడిచిపోయింది. మల్లేశానికి చదువంటే చాలా ఇష్టం. ఏదైనా ఉద్యోగం చేయాలని వాడి తపన. స్థోమతకు తగ్గట్టు సర్కారు కళాశాలలోనే చదివించాల్సి వచ్చింది. జాబు రావాలంటే ప్రైవేటుగా చదవాలి. లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించలేని తరుణంలో చదువు మాన్పించి, ఇంటి పట్టునే పెట్టుకున్నాను. అటు వ్యవసాయం లేదు. ఇటు చదువు లేదు. ఒక ప్రైవేటు కంపెనీలో పనికి కుదిర్చినాక ప్రాణం కాస్త కుదుటపడింది. వాడు తెచ్చే నెల జీతంతోనే కుటుంబం గడుస్తోంది.
ఆ రోజు మిట్ట మధ్యాహ్నం. చేతిలో సంచి పట్టుకుని సరుకులకు బయలుదేరాను. మార్కెట్‌కు వెళ్లాలంటే రోడ్డుకి పర్లాంగు దూరం నడిచి వెళ్లాలి. అక్కడికెళ్లి బస్సు ఎక్కితే అరగంట ప్రయాణం పట్టణానికి. కాళ్లకు చెప్పుల్లేవు, నెమ్మదిగా అడుగులేస్తూ బస్టాప్‌కు చేరుకున్నాను. చాలామంది ప్రయాణీకులు నిలుచున్నారక్కడ. కొందరు మూట ముల్లె సర్దుకుని వలస కార్మికుల్లా ఉన్నారు. కాసేపటికి బస్సు రానే వచ్చింది. లోపలకెక్కి సీట్లో కూర్చున్నాను. ఒకప్పుడు ప్యాసింజర్‌లతో ఈగలు ముసిరినట్టుగా వుండేది. ముందుగానే సంచి బస్సు సీట్లోకి వేస్తేగానీ కూర్చోవడం కుదిరేది కాదు. బాగా పలచన పడింది.. కండక్టర్‌ రాగానే టికెట్‌ తీసుకున్నాను. రేట్లు ఏవీ తక్కువ లేవు, అన్నీ ఎక్కువే అనుకుంటుండగానే. పట్టణం రానే వచ్చింది. దిగి మార్కెట్‌కు వెళ్లి తర్కారీ కొట్టుకు వెళ్లి బేరమాడితే చుక్కలు కనిపించాయి. కిలో యాభైకు ఏదీ తక్కువ లేదు. ఇంకొన్ని కాయగూరలు కిలో వంద కూడా పలుకుతున్నాయి. ఈ మధ్య చాన్నాళ్లైంది మార్కెట్‌ మొహం చూసి. సంచి నింపవచ్చులే అనుకున్నాను. తెచ్చిన డబ్బుకు అరసంచి కూడా నిండలేదు. ఇక తిన్నగా ఇంటి ముఖం పట్టాను. పట్టణం నడిబొడ్డున ఏవో కార్డులు పట్టుకుని ధర్నా చేస్తున్నారు 'రైతుకు న్యాయం జరగాలి' అంటూ ఆందోళన చేస్తుంటే క్షణం ఆగి చూశాను. అంతే మెరుపు వేగంతో వచ్చిన పోలీసులు వాళ్లని చుట్టుముట్టి చెదరగొడుతున్నారు. నేను అక్కడి నుంచి కదిలే లోపే లాఠీ దెబ్బ నా వీపున బలంగా పడింది. వెనక్కి తిరిగి చూసేలోపే నన్ను ఒడిసి పట్టుకుని జీపులో ఎక్కించారు. 'వాళ్ల తరపు మనిషిని కాదు' అని ఎంత మొత్తుకున్నా వినలేదు. కూరగాయలు సంచి రోడ్డు పైనే పడిపోయింది. అన్నీ చెల్లాచెదురు అయిపోయాయి. తీసుకెళ్లి స్టేషన్‌ ఆవరణంలో కూర్చోబెట్టారు. సాయంత్రం దాకా వదల్లేదు. అందరితో సంతకాలు తీసుకుని కౌన్సిలింగ్‌ ఇచ్చి వదిలేశారు.
శరీరమంతా నొప్పులు. చిన్నగా నడుచుకుంటూ ఇంటికి వెళుతున్నాను 'సంసారాన్ని ఉద్ధరించడం చేత కాదుగానీ, దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్లాడు' అంటూ కొందరు ఎగతాళి చేశారు. తీరా ఇంటికెళ్లి చూస్తే తాళం బిగించి వుంది. కాసేపు బయటనే కూర్చున్నాను. రాత్రి ఏడు గంటలు దాటుతున్నా భార్య గానీ, కొడుకు గానీ ఇంటికి రాలేదు. నాలో ఆందోళన మొదలైంది. పక్కింటివాళ్లని అడిగి చూశాను. వాళ్లు విషయం చెప్పగానే గుండెల్లో దడ మొదలైంది. పరుగుతో వెళ్లాను గ్రామం మొదట్లో కరెంటు స్తంభం కింద చిన్నపాటి అరుగు అక్కడెవరో కూర్చుని వున్నారు. వెళ్లి చూస్తే ఆశ్చర్యం వేసింది. కొడుకుని ఒడిలో పరుండబెట్టుకుని కూర్చుంది లక్ష్మి. నన్ను చూడగానే కళ్లల్లో నీళ్లు పెట్టుకుంది. 'ఏమైందీ' అంటూ ఆత్రుతగా అడిగాను. కంపెనీకి వెళుతుంటే గుర్తు తెలియని వాహనం గుద్దేసి వెళ్లిందట. రెండు కాళ్లు దెబ్బ తిన్నాయి. కట్లు కట్టారు, చేతికొచ్చిన కొడుకు నడవలేని స్థితిలో వుంటే నా కళ్లు చెమర్చాయి. ఆ సమయంలో వాహనాలు ఏవి లేవు, కొడుకుని భుజాన కూర్చోబెట్టుకుని నడిచే ఇంటికి వెళ్లాము. కొడుకుని బయట తాళ్లు మంచంపై పడుకోబెట్టి ఇంటికి తలుపులు తీసి స్విచ్‌ ఆన్‌ చేస్తే ఇంట్లో బల్బు వెలగలేదు ఆ రాత్రి చీకట్లోనే గడిపేశాం.
బ బ బ
తెల్లవారిందన్న మాటేగానీ, మా బతుకులో వెలుగు రాలేదనే చింత ఏడిపిస్తోంది. రాసిచ్చిన ప్రామిసరీ నోట్లకు గడువు తీరిపోయింది. అప్పుల వాళ్లు ఒక్కొక్కరే రావడం మొదలు పెట్టారు 'అప్పు ఎప్పుడు తీర్చాలనుకున్నావ్‌, నేను కోర్టుకు వేస్తాను' అంటూ ఒకరు. 'నేను కేసు పెడతాను, వారంలోగా అప్పు తీర్చాలి' అని మరొకరు. 'ఎప్పుడూ బాధలే చెప్పుకుంటూ పోతే ఎలా యాదగిరి?' అంటూ సౌమ్యంగా ఇంకొకరు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కూలికి వెళ్లడానికి ఒంట్లో సత్తువ లేదు, భార్య ఆరోగ్యం అంతంతమాత్రమే, ఇలా ఆలోచిస్తూనే వెళ్లి బీరువాకు తాళం తీయబోయాను 'అందులో వున్న ఐదు తులాల బంగారం బ్యాంకులో పెట్టారు మరచిపోయారా?' అంది లక్ష్మి.. తిరిగి మూసేశాను. ఆలోచనల్లో మతిమరుపు కూడా ఎక్కువైంది.
ఇప్పుడు అప్పుల వాళ్లకు ఏమి చెప్పాలో అర్థంకాలేదు. ఇంట్లో నుంచి బయటికి వచ్చానన్న మాటేగానీ, మనసు నా ఆధీనంలో లేదు. ఒకవేళ కౌలు భూమిని నమ్ముకున్నా కూడా గిట్టుబాటు రాదని తెలిసిపోయింది. కూలీ రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ఎరువుల ధరలు చేతికందనంత దూరంలో ఉన్నాయి. చేను దున్నాలంటే వేలకు వేలు డబ్బులుండాలి. తీరా పంట చేతికి వచ్చినాక అమ్మకం రేటు పడిపోతుంది. రైతు చేతులు దులుపుకోవడం తప్ప, నింపుకోవడం జరగదని అర్థమైపోయింది. మిగిలిన అరెకరా భూమి అమ్మకానికి పెట్టేశాను. దేవుని దయవల్ల రేటు బాగానే పలికింది. అప్పులు మొత్తం తీర్చేసి, కట్టుబట్టలతో మిగిలిపోయాం.
ఆ రోజు సాయంత్రం ఒక్కొక్క చినుకు రాలుతున్నాయి. చెరువు కట్టపై ఒక్కడే కూర్చుని ఆలోచిస్తున్నాను. కొడుకు మల్లేశాన్ని ఆస్పత్రికి తోడుకెళ్లాలి. చేతిలో పైసా లేదు ఎక్కడా అప్పులు పుట్టవు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. చీకటి పడిపోయింది.. మెల్లగా లేచి ఇంటికి వెళ్లాను. 'అబ్బాయి ఛాతీలో నొప్పిగా వుందని బాధ పడుతున్నాడు' భార్య అనగానే గుండెలో అలజడి మొదలైంది. ఆలోగానే ఎవరో తలుపు తట్టినట్లైతే వెళ్లి తీశాను. ఎదురుగా పోలీసులను చూసి అవాక్కయ్యాను 'మీరు స్టేషన్‌కు రండి' అన్నారు అందులో ఒకరు. కొడుక్కి బాగలేదన్నా కూడా వినలేదు. సంతకం చేసి వెళ్లుదువు రమ్మంటే వెళ్లాను ఒక్క సంతకానికి గంటల సమయం దాటిపోయింది. సంతకం పెట్టేసి ఎలాగోలా నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నాను.
నన్ను చూడగానే భార్య లక్ష్మీ బోరున ఏడ్చుకుంటూ వచ్చి గట్టిగా చుట్టుకుపోయింది. ఆమె నోటిలో మాట రాలేదు. చాలామంది నిలుచుకుని వున్నారు. కాస్త ముందుకు వెళితే కొడుకు శవమై కనిపించాడు. నేను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాక అనారోగ్యం మించిపోయి, కొడుకు కన్ను మూశాడంట. ఉదయం దహన సంస్కారాలు ముగించేశాం. ఇంటికి సంతాన దీపం ఆరిపోయాక, ఇక మేము మిగిలుండి ప్రయోజనం దేనికి అనుకున్నాం. మరుసటి రోజు తెల్లవారగానే రాత్రి అనుకున్న ప్రకారం ఇద్దరం వెళ్లి ఊరికి దూరంగా ఉన్న ఒక బాయి గడ్డపై కూర్చున్నాము. నమ్ముకున్న మట్టి మాకు అన్నం పెట్టలేదు. అందుకే గంగపాలౌదామని నిశ్చయించుకున్నాం. కూర్చుని బాయిలోకి చూస్తున్నాం. అందులో ఒక చీమ నీటిలో నుండి బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. అయినా దానివల్ల కావడం లేదు.
దాన్ని ఒడ్డుకు చేర్చుదామని ప్రయత్నం చేయబోతే భార్య ఆపింది 'వద్దు బయటికి తీయొద్దు.. కాసేపు చూద్దాం' అంది. మా దృష్టి ఆ చీమపైనే పడింది. అది చివరికి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఒడ్డుకు చేరుకోగలిగింది. 'హమ్మయ్యా సాధించింది' అన్నాను నేను. 'మరి మనమెందుకు సాధించలేకపోతున్నాం?' అని చిన్నగా అనిన భార్య వైపు ఆశ్చర్యంగా చూశాను. 'ఆ చిన్న చీమ ఎలాగైనా బతకాలనే పట్టుదలతో కష్టపడి ఎలా ఒడ్డుకు చేరుకుందో చూశారా, అది గనక మనలాగా భయపడి వుంటే ఒడ్డుకు చేరేదా, బ్రతికేదా?' భార్య ప్రశ్నకు సమాధానం చెప్పలేక పోయాను. 'మనం అప్పు చేశాంగానీ తప్పు చేయలేదు. ఈరోజు ఏమీ లేకపోయినా రేపైనా బతకడానికి ఏదో ఒక దారి దొరుకుతుంది. చనిపోయి ఏం సాధించగలం, సమాజంలో పిరికివాళ్లుగా ముద్ర వేసుకుని, కనుమరుగవ్వడం కన్నా ధైర్యంగా నిలబడి సాధిద్దాం!' అంటూ నా చేయి పట్టి లాగేసరికి వెయ్యి ఏనుగుల బలం వచ్చినంత సంబరపడ్డాను. తిరిగి ఇంటి ముఖం పట్టాము. 'బ్రతికుంటే బతుకు తెరువుకు మార్గం అదే దొరుకుతుంది' అనుకుంటూ ధైర్యంగా అడుగులు ముందుకు వేశాము.

నరెద్దుల రాజారెడ్డి
96660 16636