కళ్ళలో శిశిరాలు రాలుతున్నప్పుడు
ఒక జీవిత నిర్వేదం
ఒక జీవిత క్రమం
పాఠాలు చెబుతుంటాయి.
కన్నీళ్ళను బిగపట్టి
వసంతాల చిగుళ్ళ కోసం
మనసుతో మాటాడి
కాస్తంత ఊరట పొందటం ఒక అవసరం.
నిశ్శబ్ద ఏకాంతాన్ని
నాలో నింపుకొని
కళ్ళ నిండా చెట్ల గాలులు
పూసుకొని
ధ్యాన సాగరంలో మునిగిపోతాను.
చుట్టూ ప్రపంచం నుంచీ
వేడి గాలులూ తగులుతుంటాయి.
ఏదీ పూర్తిగా చొరబడనివ్వక
లోలోపల రక్షణ కవచాల్ని
నిర్మించుకుంటాను.
బతుకంటే
బతకడమంటే
నిరంతర మూల్యాంకనంలోంచి
సరిచూసుకొని
నిత్య నూతనంగా జీవించడమే.
గవిడి శ్రీనివాస్
70192 78368