Oct 23,2022 07:58

నరమేధం జరగలేదక్కడ
రక్తపు బొట్టు నేలపై చిందించిందే లేదక్కడ.
కత్తులు దూసింది లేనేలేదెక్కడ.
యుద్ధ తంత్రం జరిపిందే లేదక్కడ.

శ్రమజీవులు స్వేదం చిందించిన నేలపైనే
సమ సమాజం స్థాపించాలనే సంకల్పంతో
లిఖించబడుతున్న అక్షరం సృష్టిస్తున్న
చరిత్రకు శ్రీకారం ప్రజ్వరిల్లుతుందక్కడ
నవశకానికి నాంది పలుకుతుందక్కడ..
కుహనా నాయకుల కుయుక్తులు
దోపిడీవ్యవస్థ పునాదులు తెగిపడుతున్నారు.
తరతరాలుగా సాగుతున్న
అనుభవిస్తున్న అధికారం, అంగబలం.
ఒక్క సిరాచుక్క సృష్టిస్తున్న సునామీలో
కొట్టుకుపోతున్నారు.

సిరా చుక్కలో పురుడోసుకున్న అక్షరంతో.
జన జాగృతి నడికట్టు బిగిస్తుంది.
దొరలకు దాసోహమంటూ మొక్కిన చేతులు..
పిడికి బిగించి అక్షర భావాలను
విను వీధుల్లో ప్రతిధ్వనింప చేస్తుంటే..

నిరాశా నిస్పహలతో
నిత్యం ఎదలో సంఘర్షణలతో తల్లడిల్లిన
పేదవాని అధరాలు చిరునవ్వులు చిందిస్తున్నారు.
అక్షరమే ఆయుధంగా కవి సమాజంలోని
రుగ్మతలపై సమర శంఖారావం పూరిస్తుంటే.

- రాము కోలా
9849001201