Nov 15,2022 07:23

దు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందని అనుకుంటే అది ఫ్లాప్‌ అయికూచుందనుకోండి. అప్పుడు అభిమానుల పరిస్థితి, నిర్మాత, దర్శకుడు, యాక్టర్ల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు మోడీ వచ్చి వెళ్ళాక విశాఖలో, రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీల పరిస్థితి ఆ విధంగానే ఉంది. మోడీ పర్యటనకి పదిహేను రోజుల ముందు నుంచీ ఒకటే సందడిగా ఉండేది కాస్తా మోడీ తిరుగు ప్రయాణం అయిన తర్వాత మాత్రం ఉన్నట్టుండి సైలెంట్‌గా కనిపిస్తోంది.
          పైకి కాస్తంత గంభీరంగా కనిపించడానికి వైసిపి నాయకులు తంటాలు పడుతున్నారు. ''రెండు వారాలపాటు నానా హైరానా పడ్డాం. చెట్లు కొట్టించాం. దుకాణాలు లేపేశాం. జనాల్ని తోలుకు రావడానికి (వారి దృష్టిలో జనం గొర్రెలు కదా) నానా పాట్లూ పడ్డాం. లక్ష మందిని తీసుకొచ్చాం. రెండు లక్షల మంది వచ్చారని పత్రికల్లో రాయించాం. మోడీ గారిని సంతృప్తి పరచడానికి ఏమేం చేయాలో అన్నీ చేశాం. ఎక్కడా ప్రజల నిరసనలు వినపడకుండా, ఎర్ర జెండాలు కనపడకుండా ఎక్కడికక్కడ పోలీసులతో తొక్కేశాం. ఇంత చేసినా, మోడీ గారి నోటి వెంట జగన్‌ ప్రభుత్వం బాగా పని చేస్తోంది అని అనిపించలేకపోయాం కదా!'' అని స్థానిక వైసిపి నేతలు లోలోపల బాధ పడుతున్నారు. ''కనీసం మూడు రాజధానుల గురించైనా ప్రస్తావించలేదు కదా'' అని వేదన పడుతున్న వాళ్ళూ లేకపోలేదు.
           మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ప్రసంగించి, ప్రధాని ముందు రాష్ట్ర ప్రజల అభ్యర్ధనలను ''మిక్కిలి సవినయంగా'' ఉంచిన తర్వాత ప్రధాని ''ఎంతో దయతో'', ''అత్యంత అభిమానంతో'' రాష్ట్రానికి కొన్ని వరాలు ప్రకటించాలి. కాని ప్రధాని ముందే తన స్పీచ్‌ పూర్తి చేసేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగించారు. ''అడక్కుండానే మాకు రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ ఇచ్చావ్‌. విశాఖ- రాయగఢ్‌ రైల్వే కారిడార్‌ ఇచ్చావ్‌, ఆరు లైన్ల రోడ్డు కూడా ఇచ్చావ్‌, ఇలాగే ఇంకా ఇస్తావ్‌. మాకు తెలుసు. అలాగే, ఆ చేత్తోటే పోలవరం నిధులు కూడ ఇస్తావని, విశాఖ ఉక్కును అమ్మకూడదన్న నిర్ణయం తీసుకుంటావని, ప్రత్యేక హోదా ఇస్తావని నేను నమ్ముతున్నాను. నువ్వు ఇస్తావ్‌. నాకు తెలుసు. ఎందుకంటే బేసికల్లీ యు ఆర్‌ మోడీ.'' అన్న విధంగా నువ్వు నాకు నచ్చావ్‌ సినిమాలో వెంకటేశ్‌ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ప్రార్ధన చేసిన స్టైల్లో ముఖ్యమంత్రి ప్రసంగం సాగింది. జగన్‌ ప్రార్ధనకి మోడీ ఏమీ స్పందించలేదు. ఎందుకంటే బేసికల్‌గా ఆయన మోడీ కదా. కాని వైసిపికి ఒళ్ళు దాచుకోకుండా పని చేసే కార్యకర్తలు మాత్రం ''151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్న తిరుగులేని మా పార్టీ అధినేత కేంద్రం ముందు మాత్రం ఇలాగైపోతున్నారేమిటి? అని తలలు పట్టుకుంటున్నట్టు అభిజ్ఞవర్గాల భోగట్టా.
           ''మాది బొత్తిగా వన్‌ సైడ్‌ లవ్‌ లాగా ఉంది కదా. పార్లమెంటులో అన్ని సందర్భాలలోనూ మోడీకే అనుకూలంగా ఓట్లు వేస్తున్నాం. రాష్ట్రపతి ఎన్నికల్లో 100 శాతం ఓట్లు అధికార పార్టీ అభ్యర్థికి పడిన ఏకైక రాష్ట్రం మాదే. ఒక వ్రతం మాదిరిగా మా అధినేత కేంద్రాన్ని గాని, మోడీని కాని నోరు తెరిచి ఒక్క మాట కూడా విమర్శించిన సందర్భం లేదు. లోకల్‌ బిజెపి నేతలు మమ్మల్ని నానా రకాలుగా తిడుతున్నా...అంతర్వేది అనో, రామతీర్థం అనో, అన్య మత ప్రచారం అనో రకరకాలుగా గొడవలు రేపుతున్నా...మా అధినాయకుడు ''వ్యూహాత్మక మౌనం'' పాటించారే తప్ప నోరు మెదపలేదు కదా. అయినా ఇంకా మోడీజీ కి మాపై దయ కలగడం లేదెందుకని? ఏమిటి మా ప్రార్ధనలో లోపం ?'' ఇది అధికార పార్టీ థింక్‌ ట్యాంక్‌ అంతర్మథనం.
          ఇది చాలదన్నట్టు జగన్‌ ''మాది రాజకీయాలకు అతీతమైన బంధం'' అని వ్యాఖ్యానించడం కొత్త సమస్యగా మారింది. ఈ వ్యాఖ్యతో జగన్‌ ప్రతిపక్షాలను క్లీన్‌ బౌల్డ్‌ చేసేశారు అంటూ ఓ టివి చానెల్‌ (సాక్షి కాదు) అత్యుత్సాహంగా వ్యాఖ్యానించింది కూడా. ఇద్దరు రాజకీయ నాయకుల నడుమ రాజకీయాలకు అతీతమైన సంబంధం ఉండడం ఏమిటి? అని సామాన్య జనం మాత్రం విస్తుపోతున్నారు. ఆ బంధాన్ని అతికించిన ఫెవికాల్‌ ఏది? అది అదానీ బంధమా? లేక అంబానీ బంధమా? లేక రెండూ కలిసిన బంధమా? మరేదైనా వివాహ బంధమా? తెలుసుకోవాలని జనాలు ఉవ్విళ్ళూరుతున్నారు.
           మామూలుగా అధికారపార్టీ సభలకి జనాలని తరలించడానికి అధికార యంత్రాంగం అంతా కదులుతుంది. ఇందుకు కాంగ్రెస్‌ కాని, టిడిపి కాని అతీతం కాదు. ఐతే విశాఖ సభకి జనాల్ని తరలించిన తీరు ప్రత్యేకం. ''మీరు మీటింగ్‌కి రాకపోతే పెన్షన్‌ ఆపేస్తాం, డ్వాక్రా నిధులు ఇవ్వం, రేషన్‌ కార్డు కట్‌ చేసేస్తాం'' అంటూ వినూత్న పద్ధతిలో వలంటీర్లు, చోటా నాయకులు జనాలని ఉత్సాహపరిచినట్టు వచ్చిన జనాలే చెప్పుకున్నారు. ''మీటింగ్‌కి వెళ్తే కొత్తగా ఏదో మాకు ఇస్తారని అనుకున్నాం. కాని వెళ్ళకపోతే ఉన్నవి ఊడబీకేస్తాం అని భయపెట్టడం గతంలో ఎన్నడూ చూడలేదు'' అని సీనియర్‌ మహిళలు చాలామంది గొణుక్కున్నారు.
          ఇక ప్రధానితో ప్రత్యేక ఇంటర్వ్యూ సాధించిన జనసేనాని, ఇంటర్వ్యూ తర్వాత మరెక్కడా కనిపించకుండా రుషికొండ దగ్గర తేలారు. రోడ్‌ మ్యాప్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను అన్న ఆ హీరో మోడీతో మీటింగ్‌ తర్వాత ఆ ఊసు పెట్టడం లేదు.
         అసలు ప్రధాన ప్రతిపక్షానికైతే ఈ మొత్తం మోడీ పర్యటనే మింగుడు పడలేదు. అందుకనే ఆ పార్టీ నేత సడెన్‌గా తెలంగాణలో ఆ పార్టీని బలోపేతం చేయడం మీద దృష్టి సారించడం జరిగింది. ''మోడీ వస్తాడు, అమరావతి సంగతి తేల్చేస్తాడు, ఆ దెబ్బతో జగన్‌ ఇరుకున పడతాడు'' అని స్థానిక టిడిపి నేతలు కొందరు అత్యుత్సాహ పడ్డారు. కాని వారు ఇప్పుడు వేరే పనుల్లో బిజీ అయిపోయినట్టుంది మరి.
          ''మా పుంజుని బరిలోకి దింపుతున్నాం. ఆ తర్వాత చూపిస్తాం మా తడాఖా'' అంటూ బిజెపి కి చెందిన కొందరు నాయకులు గత రెండు నెలల నుంచీ నానా హడావుడీ చేశారు. ''రాష్ట్ర రాజకీయాల రంగుల్ని, షేపుల్ని మార్చేస్తాం'' అన్నారు. వాళ్ళ వంతు వాళ్ళూ జనాల్ని తోలుకొచ్చారు. ఎంతైనా స్వంత పార్టీ కదా. అందుకే మోడీ వాళ్ళతో ప్రత్యేకంగా గెస్ట్‌హౌస్‌ లో మీటింగ్‌ పెట్టారు. ఆ మీటింగ్‌లో ఏం జరిగిందో ఏమో. ఆ తర్వాత బిజెపి నేతలంతా గప్‌చుప్‌. ఐతే ఒకటి, రెండు ఆంగ్ల పత్రికలు మాత్రం విషయాన్ని బైటపెట్టాయి. ''నా పేరు చెప్పుకుని మీరిక్కడ బలపడదామని చూస్తే కుదరదు. గుజరాత్‌ లో నేను ఏ విధంగా నా స్వంత పద్ధతులలో పైకొచ్చానో ఇక్కడ కూడా మీరు అదే విధంగా మీదైన స్వంత పద్ధతులలో బలపడాల్సిందే'' అని మోడీ కుండ బద్దలుగొట్టినట్టు సమాచారం. ''మనవాడే కదా అని మొర పెట్టుకుంటే మరి నాలుగు వడ్డించమన్నాడట వెనకటికి ఎవడో. అలా వుంది ఈ యనగారి పరిస్థితి. ఆయనగారికి గుజరాత్‌ లో అంబానీ, అదానీ ఉన్నారు. ఇక్కడ మనకెవరున్నారు? ఉన్న కొద్దిమందినీ ఇప్పటికే రెండు ప్రాంతీయ పార్టీలూ పంచేసుకున్నాయి. అంటూ రాష్ట్ర బిజెపి నేతలు ఆవేదనలో ఉన్నారు. ''గుజరాత్‌ లో ఆయన అధికారంలోకి వచ్చాక కదా మత మారణ హోమం సృష్టించింది? మనల్ని ముందే రేగ్గొట్టమంటే ఎలా సాధ్యం? అని కూడా తర్జనభర్జనలు పడుతున్నారని సమాచారం.
            ''మన విశాఖ ఉక్కుని ప్రైవేట్‌ పరం కాకుండా చూస్తాం అని మన దగ్గర గట్టి కబుర్లు చెప్పిన ఈ ప్రాంతీయ పార్టీల నాయకులెవరికీ కేంద్రాన్ని గట్టిగా నిలదీసే దమ్ము లేదు అన్న విషయం మాకు స్పష్టం అయిపోయింది. ఇకముందు వారి చుట్టూ తిరగడం మానేసి మా కార్మికవర్గం సత్తా ఏమిటో చూపిస్తాం'' అని విశాఖ కార్మికవర్గం మాత్రం ఊపు మీద ఉంది. ఇక ఎర్రజెండా పార్టీలు ఆ కార్మికవర్గం వెంటే ఉంటాయని వేరే చెప్పాలా?

సుబ్రమణ్యం