
ఇతర మానవుల మలినాలను మరో మనిషితో అది కూడా ఒక కులానికి (దళితులు) చెందిన మనుషులతో చేయించటం ఒక ఆచారంగా కొనసాగించడమంటే...ఈ పని చేస్తున్న వారిని నేటికీ మనుషులుగా గుర్తించకపోవడం, గౌరవించకపోవడమే. పైగా ఈ దురాచారాన్ని రూపుమాపాల్సిన పాలకులు, అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. సమాజంలో అనాదిగా కొనసాగుతున్న ఆధిపత్య వర్గాల పెత్తనం, సామాజిక వివక్షత కొనసాగింపులో భాగమే ఈ దురాచారం.
మనషుల చేత మరుగుదొడ్లు శుభ్రం చేయించడాన్ని నిషేధిస్తూ చట్టాలు, కోర్టు తీర్పులు కోకొల్లలుగా ఉన్నాయి. అన్నీ కాగితాలకే పరిమితం అవుతు న్నాయి తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. కనుకనే నాగరిక సమాజంలో అనాగరికంగా పాయిఖానాలు, డ్రైనేజీ కాల్వల్లో ఏ విధమైన రక్షణ పరికరాలు లేకుండానే మనషుల చేత శుభ్రం చేయిస్తున్నారు. యంత్రాలతో చేయించాల్సిన పనులను మనుషులతో చేయించడం వల్ల విష వాయువుల మధ్య చిక్కుకొని ఊపిరాడక..డ్రైనేజీ కాల్వల్లో కొట్టుకుపోయి.. అమాయక కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పాలకులు, అధికారులు ''అయ్యో పాపం'' అంటూ ఒక నిట్టూర్పు విడిచి సరిపెట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది. మృతుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్న మన దేశంలోని సఫాయి కర్మచారి కార్మికుల నేటి దుస్ధితి. గత నెలలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఓ ప్రైవేటు హోటల్ యజమాని ఇద్దరు కార్మికులను డ్రైనేజీ పూడిక తీయించడానికి రాత్రిపూట డ్రైనేజీ బావిలోకి దించడం...రక్షణ పరికరాలు, గాలి, వెలుతురు లేకపోవడంతో ఆ ఇరువురు కార్మికులతోపాటు ఆ యజమాని కూడా డ్రైనేజీ మురికిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోవడం...రాష్ట్రాన్ని కలవరపెట్టింది. దీనికి 3 నెలల ముందు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇరువురు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు ఇదే విధమైన ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. అయినా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదు.
ఈ విధమైన అమానుషమైన, చట్టవిరుద్ధమైన చర్యలను నివారించేందుకు ప్రభుత్వం కదిలిన దాఖలాలు లేవు. గత రెండేళ్ళలో దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన ప్రమాదంలో ఏడుగురు, తమిళనాడులో 30 మంది, బెంగళూరులో ముగ్గురు కార్మికులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్షాలుగా ఉన్నాయి.
ఇతర మానవుల మలినాలను మరో మనిషితో అది కూడా ఒక కులానికి (దళితులు) చెందిన మనుషులతో చేయించటం ఒక ఆచారంగా కొనసాగించడమంటే...ఈ పని చేస్తున్న వారిని నేటికీ మనుషులుగా గుర్తించకపోవడం, గౌరవించకపోవడమే. పైగా ఈ దురాచారాన్ని రూపుమాపాల్సిన పాలకులు, అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. సమాజంలో అనాదిగా కొనసాగుతున్న ఆధిపత్య వర్గాల పెత్తనం, సామాజిక వివక్షత కొనసాగింపులో భాగమే ఈ దురాచారం.
సఫాయి కర్మచారి చట్టం ఏం చెప్తోంది ?
1993లో సఫాయి కర్మచారి కార్మికుల నియామకం, పొడి పాయిఖానాల నిషేధ చట్టం చేయబడింది. 1993 చట్టానికి మరిన్ని సవరణలు చేస్తూ 2013లో మనుషుల చేత మరుగుదొడ్లు శుభ్రం చేయించే పని నిషేధ చట్టం, పునరావాసం చట్టం చేయబడింది. ఈ చట్టంలో కూడా కొన్ని క్లాజులు కార్మికులకు ఇబ్బంది కలిగించేవి లేకపోలేదు. అత్యవసర సమయంలో కార్మికులు మ్యాన్‌హోల్ లోకి దిగవచ్చు అని చెప్తూనే 44 రకాల రక్షణ పరికరాల సహాయంతోనే కార్మికులు మ్యాన్‌హోల్ లోకి ప్రవేశించవలసి వుంటుందని చట్టంలో పేర్కొనబడింది. చట్టంలోని రెండవ అధ్యాయంలో నిబంధన ప్రకారం ఏ ఒక్క కార్మికుడు డ్రైనేజీని కానీ, మ్యాన్‌హోల్‌ను కానీ పరిశుభ్రం చేయడానికి వీలు లేదు. రక్షణ పరికరాలు వుంటేనే ఆ పని చేయాలి-అని కూడా పేర్కొనబడింది. తప్పనిసరి పరిస్థితుల్లో మనుషుల చేత పనిచేయించాల్సి వస్తే నిబంధన (ఇ) ప్రకారం స్థానిక 'సిఇఓ' కు లిఖిత పూర్వక వివరణ ఇచ్చి అనుమతి పొందాలి. కార్మికులకు మాస్కులు, గ్లౌజులు, హెడ్‌లైట్, గమ్ బూట్లు వంటివి తప్పని సరిగా ఇవ్వాలి.
కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించడమంటే... మ్యాన్‌హోల్ లోకి కార్మికులు దిగి పని చేసే సందర్భంÛలో ఆ ప్రదేశంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ప్రజారోగ్య సిబ్బందితో పాటు అంబులెన్స్ వంటివి కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ, ఇటువంటి భద్రతా చర్యలు ఏవీ కూడా పాలకులు, అధికార యంత్రాంగం తీసుకోవడం లేదు. నిజానికి మనుషుల చేత మానవ మలినాలను, మ్యాన్ హోల్స్‌ను శుభ్రం చేయించరాదని 2013 చట్టం స్పష్టంగా పేర్కొంటున్నది. పైగా ఈ వృత్తిపై ఆధారపడిన కార్మికుల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని కూడా చట్టం చెప్తున్నది. అయినా ప్రభుత్వాలు మాత్రం ఈ బాధ్యతను నిర్వహించడంలేదు. ఒకవేళ తప్పనిసరిగా మనుషుల చేత ఈ పనులు చేయించిన సందర్భంగా ప్రమాదాలలో చనిపోయిన కార్మికులకు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చట్టం చెప్తున్నా, ఎక్కడా కూడా ఈ నష్టపరిహారం చెల్లించడం లేదు. రోడ్లపైన శవాలను పెట్టి ఆందోళన, పోరాటాలు చేశాకనే నష్టపరిహారం చెల్లిస్తున్నారు. అదీ చట్టం చెప్పినది కాకుండా రూ. 3 నుండి రూ. 5 లక్షల మధ్య చెల్లించి చేతులు దులిపేసుకుంటున్నారు.
స్వచ్ఛభారత్ ప్రచార ఆర్భాటమే
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పారిశుధ్యానికి పెద్ద పీట వేస్తూ 'స్వచ్ఛ భారత్ అభియాన్' పథకాన్ని 2014లో ఆర్భాటంగా ప్రకటించింది. ఇందులో మనుషుల చేత మలినాలు శుభ్రం చేయించే పనులు నిషేధం మరియు పునరా వాసం కూడా భాగంగా చేర్చింది. అయితే ఈ లక్ష్యం నెరవేరడానికి అవసరమైన నిధులను మాత్రం బడ్జెట్‌లో కేటాయించడంలేదు. పైగా రానురానూ నిధులలో కోతలు పెడుతున్నది. ఉదాహరణకు 2021-22 బడ్జెట్‌లో స్వచ్ఛ భారత్ కోసం రూ. 12,293 కోట్లు కేటాయిస్తే 2022-23లో రూ.9 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. మరోవైపు స్వచ్ఛ భారత్ నినాదం చాటున నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో యాంత్రీకరణను పెంచి పోషిస్తూ కార్పొరేట్ సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెడుతోంది. అంతేకాక ప్రజలపై యూజర్ చార్జీల వంటి రకరకాల పేర్లతో రూ. వేల కోట్ల భారాలను మోపుతున్నది.
కానీ పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రం చేసి పర్యావరణం, ప్రజారోగ్యాలను పరిరక్షిస్తున్న కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నది. 2020, 2021, 2022 సంవత్సరాలలో ప్రపంచాన్ని పట్టి పీడించిన కరోనా భూతాన్ని ఎదుర్కొని ప్రజలకు సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రూ.50 లక్షల ఆర్థిక సహాయం (గరీబ్ కళ్యాణ్ యోజన) అందిస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం మన రాష్ట్రం లోని పంచాయితీ, మున్సిపల్ కార్మికులకు ఒక్కరికి కూడా అందించలేదు. అయితే ''స్వచ్ఛ భారత్'' వాణిజ్య ప్రకటన ప్రచారం కోసం గత ఏడేళ్ళలో వందల కోట్ల రూపాయలను మోడీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది.
వైసిపి ఒరగబెట్టిందేమీ లేదు
రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం నిత్యం దళిత, గిరిజన నామస్మరణ చేస్తుంటుంది. కానీ రాష్ట్రంలో అండర్‌గ్రౌండ్, డ్రైనేజీ విభాగంలో పనిచేస్తున్న ఆ తరగతులకే చెందిన కార్మికులకు మాత్రం ఏ విధమైన రక్షణ పరికరాలు అందించడం లేదు. గత రెండేళ్ళలో విజయవాడ నగరంలో ఏడుగురు కార్మికులు డ్రైనేజీ కాల్వల్లో కొట్టుకుపోయి మృతి చెందారు. వీరికి చట్టబద్దంగా చెల్లించాల్సిన రూ. 10 లక్షలను కూడా పోరాడితే తప్ప చెల్లించడంలేదు. ఎవరూ చెయ్యలేని విధులు నిర్వహిస్తున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకు వైసిపి ప్రభుత్వం ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది. పార్కులలో పనిచేసే కార్మికులు కూడా మలినాలను శుభ్రం చేస్తున్నప్పటికీ వీరి శ్రమను గుర్తించటానికి ప్రభుత్వం సిద్ధపడటంలేదు. గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న కార్మికులకు ఒకే విధమైన వేతనాలు కూడా చెల్లించడంలేదు. ఇచ్చే అరకొర జీతాలను కూడా ఏ నెలకా నెల చెల్లించడంలేదు. 2 నుండి 34 నెలల వరకు బకాయిలున్నా పట్టించుకునే దిక్కులేదు. గ్రీన్ అంబాసిడర్లకు నెలకు రూ. 10 వేలు వేతనం చెల్లిస్తామంటూ 2019 సెప్టెంబర్‌లో జారీ చేసిన జీవో ఎంఎస్ నెం.680 నేటికీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటికీ రూ.6 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. అది కూడా 14 నెలలుగా బకాయిలున్నాయి.
మన రాష్ట్రంలో వేలాది మంది మాన్యువల్ స్కావెంజర్లుగా ఉన్నారు. నిత్యం అభద్రతలో, అర్ధాకలితో బతుకుతున్నారు. అయినా వైసిపి ప్రభుత్వం ఈ వృత్తిని నిషేధించడం, కార్మికులకు పునరావాసం కల్పించడంలో చిత్తశుద్ధి లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు సహితం బుట్టదాఖలు అవుతున్నాయి. ప్రాణాంతక విష వాయువుల మధ్య ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న సఫాయి కర్మచారి కార్మికుల సంక్షేమం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తిప్పికొట్టేందుకు సాగే ఉద్యమాలు, సామాజికంగా నిరంతరం కొనసాగాలి. ప్రమాదాలు జరిపినప్పుడే కాకుండా దళిత, గిరిజన, కార్మిక సంఘాలు దీనిని ఒక సామాజిక ఉద్యమంగా నిర్వహించినప్పుడే ఈ సామాజిక రుగ్మతను నివారించగలుగుతాం. అందుకు అవసరమైన కార్యాచరణను దళిత, గిరిజన, కార్మిక సంఘాలు రూపొందించి ముందుకు సాగాలని ఆశిద్దాం !
/వ్యాసకర్త : సిఐటియు ఎ.పి కమిటీ రాష్ట్ర కార్యదర్శి /
కె. ఉమామహేశ్వరరావు