Sep 20,2022 06:48

ప్రభుత్వ రంగ సంస్థలమీద అనుచితంగా వత్తిడి తెచ్చి వాటిని పారుబకాయిల పాలు చేస్తున్నదీ ఈ ప్రభుత్వమే. ఇప్పుడు ఆ బ్యాంకులను ప్రైవేటీకరించి తన చేతులు దులుపుకోవాలని చూస్తున్నదీ ఆ ప్రభుత్వమే. దీనివలన డిపాజిటర్లకు తీరని ఆర్థిక నష్టం వాటిల్లడమే గాక, ప్రజలకు బ్యాంకింగ్‌ వ్యవస్థ మీదే విశ్వాసం సన్నగిల్లు తుంది. దాంతో వాళ్ళు బ్యాంకుల్లో దాచుకోవడం మానేసి నగదు రూపంలో నిల్వ ఉంచుకోడానికే మొగ్గు చూపుతారు. దానివలన దేశాభివృద్థికి అవసరమైన పెట్టుబడుల సమీకరణ దెబ్బతినిపోయి అభివృద్ధి చాలాకాలం పాటు స్తంభించిపోతుంది.

ప్రభుత్వ రంగ బ్యాంకులను కొన్నింటినైనా ప్రైవేటీకరించాలని ప్రభుత్వం పథకాలు వేస్తోంది. అదే గనుక జరిగితే ఉత్పత్తిని పెంచడానికి ఇంతవరకూ అందిస్తున్న బ్యాంకు రుణాలు ఇకముందు స్పెక్యులేషన్‌ వైపు మళ్ళుతాయి. రైతులకు రుణాలు ఇచ్చేబదులు బడా వ్యాపారులకు ఇస్తారు (దాంతో రైతు వ్యవసాయం చితికిపోయి, ఆహార భద్రత కరువౌతుంది. ఉపాధి దొరకకుండా పోతుంది). దేశీయ అవసరాలను పట్టించుకోకుండా విదేశాలకు పెట్టుబడి తరలిపోతుంది. ఈ అభ్యంతరాలన్నీ అందరికీ తెలిసినవే. అందరూ చర్చించినవే. 2008లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రభావం మన దేశాన్ని దెబ్బ తీయకుండా కాసుకున్నవి ప్రభుత్వ రంగ బ్యాంకులే అన్న వాస్తవం ఈ అభ్యంతరాలెంత ప్రాధాన్యత కలిగినవో సూచిస్తోంది. కాని ఈ ప్రభుత్వానికి దేశం బాగుండాలన్న ధ్యాస లేదు. ఎంతసేపూ దేశీయ, విదేశీయ బడా కార్పొరేట్లను ఏ విధంగా సంతృప్తిపరచాలా అన్నదే దాని యావ అంతా. ఐతే, ఈ అభ్యంతరాలకు తోడు మరో తీవ్ర ప్రమాదం కూడా పొంచి వుంది. దేశం దానిని గనుక విస్మరిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.
      దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం నియంత్రణ ఉన్న కాలంలో, అంటే, నయా ఉదారవాద విధానాలను అమలు చేయడానికి ముందు కాలంలో, బ్యాంకులు స్వల్పకాలిక రుణాలపై ప్రధానంగా దృష్టి సారించాయి. వ్యాపారంలో, పరిశ్రమల్లో సరుకులను సమీకరించుకోడానికి ప్రధానంగా రుణాలు ఇచ్చాయి. ఇక స్థిర పెట్టుబడిని (యంత్రాలు భవనాలు వగైరా) సమకూర్చుకోడానికి, కావలసిన దీర్ఘకాలిక రుణాలను అందించడానికి వేరే ప్రత్యేకమైన ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేశారు. ఆ సంస్థలకు రిజర్వు బ్యాంకు వంటి ప్రభుత్వ వనరులనుండి నిధులు అందించారు. ఆ రుణాలకు వడ్డీలు చాలా తక్కువగా ఉండేవి. బ్యాంకులు సాధారణంగా వసూలు చేసే వడ్డీ రేటు కన్నా తక్కువగా ఉండేవి. చాలా సందర్భాల్లో అప్పటి ధరల పెరుగుదల వేగం కన్నా తక్కువగా వడ్డీ రేటు ఉండేది (నెగెటివ్‌ రేటు అంటాం). ఆ విధంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహం లభించేది.
       కాని, నయా ఉదారవాద విధానాలు వచ్చాక ఇదంతా మారిపోయింది. ప్రత్యేకంగా పరిశ్రమలకు దీర్ఘకాలిక రుణాలను అందించే ఆర్థిక సంస్థల పాత స్వరూపం మారిపోయింది. ఐడిబిఐ వంటివి సాధారణ బ్యాంకుల మాదిరిగా తమ కార్యకలాపాలను మార్చుకున్నాయి. దీర్ఘకాలిక రుణాలు కావాలంటే పరిశ్రమలు ఇప్పుడు మార్కెట్‌ మీదే ఆధారపడాలి. దీర్ఘకాలిక రుణాలను అందించడానికి ఏర్పరచిన సంస్థలు సైతం ఆ మార్కెట్‌ నుంచే పెట్టుబడులు సమీకరించుకోవాలి (గతంలో రిజర్వుబ్యాంకు ఇచ్చేది). తాము పెట్టుబడులు పెట్టదలచుకున్న రంగాలలో రిస్క్‌ ఎక్కువగా ఉందనుకున్నా, లాభాలు పెద్దగా రావు అని అనుకున్నా, పెట్టుబడిదారులు ప్రభుత ్వరంగ బ్యాంకుల మీదే ఎక్కువగా ఆధారపడడం పెరిగింది. దీర్ఘకాలిక రుణాల కోసం కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులనే ఆశ్రయించడం పెరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా భారీ రుణాలను ఇవ్వడం పెరిగింది. ముఖ్యంగా మౌలిక వసతుల ప్రాజెక్టుల (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులు) కోసం ఎక్కువ రుణాలను ఇచ్చాయి. ప్రభుత్వం కూడా ఆ విధంగా రుణాలను ఇవ్వాలన్న వత్తిడిని బ్యాంకులమీద ఎక్కువగా తెచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సిందే కనుక అవి కూడా తలొగ్గాయి. దాని ఫలితంగా ఆ బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు ప్రమాదంలో పడ్డాయి.
          బ్యాంకులకు డిపాజిట్లు ప్రధానంగా ప్రజలనుండి వస్తాయి. ఆ ప్రజలు ఏ క్షణాన్నైనా తమ డిపాజిట్లను వెనక్కి తీసేసుకోవచ్చు. అటువంటప్పుడు తమ వద్దనున్న డిపాజిట్లను బ్యాంకులు దీర్ఘకాలిక రుణాల నిమిత్తం ఇవ్వడం వలన ఆ బ్యాంకులు తీసుకుంటున్న డిపాజిట్లు స్వల్పకాలికంగా, ఇచ్చే రుణాలు దీర్ఘకాలికంగా ఉంటున్నాయి. దీని వలన చేతిలో డబ్బు లేని పరిస్థితి (లిక్విడిటీ లేకపోవడం) ఏర్పడే ప్రమాదాన్ని ఆ బ్యాంకులు ఎదుర్కొంటున్నాయి. ఒకవేళ ఎక్కువమంది డిపాజిటర్లు తమ డిపాజిట్లను వెనక్కి తీసేసుకోవాలని గనుక నిర్ణయిస్తే ఆ బ్యాంకు మూతపడుతుంది. ఒకవేళ కొద్దిమంది డిపాజిటర్లు వెనక్కి తీసుకున్నా, అలా వెనక్కి తీసేసుకుంటున్నారు అన్న ప్రచారం గనుక జరిగితే చాలు, జనాలు బ్యాంకు మీద వచ్చి పడతారు, బ్యాంకు మూతపడుతుంది. ఇటువంటి ప్రమాదాన్ని తట్టుకోడానికి బ్యాంకులు మామూలుగానైతే స్వల్పకాలంలో డబ్బు రూపంలోకి మార్చుకునే వీలున్న ఆస్తులమీద పెట్టుబడులు పెడతాయి. ఒకవేళ డబ్బు కోసం డిపాజిటర్లు బ్యాంకుల మీద ఒక్కసారిగా వచ్చిపడినా, స్వల్పకాలిక పెట్టుబడులను అమ్మేసి ఆ డబ్బు డిపాజిటర్లకు బ్యాంకు చెల్లించగలుగుతుంది. అలా అమ్మినప్పుడు కొంత నష్టం వచ్చినా, మొత్తం మీద బ్యాంకు మూతపడకుండా నిలదొక్కుకోగలుగుతుంది. కాని దీర్ఘకాలిక స్వభావం గల పెట్టుబడులలో ఎక్కువగా పెడితే, వాటిని డబ్బు రూపంలో మార్చుకోవడానికి చాలా ఎక్కువ నష్టాన్ని భరించాల్సి వుంటుంది.
         ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కువగా రుణాలను ఇచ్చిన మౌలిక వసతుల ప్రాజెక్టులు పూర్తి కావడానికి, వాటి మీద చెల్లింపులు మొదలు అవడానికి చాలా కాలం పడుతుంది. వ్యవధి ఎక్కువగా పడితే దానివలన ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు కూడా ముందు అనుకున్నదానికన్నా ఎక్కువ అయిపోతుంది. అందుచేత దీర్ఘకాలిక రుణాల నుండి బ్యాంకులకు లాభాలు తొందరగా రావు. వాటిలో చాలా రుణాలు ''కొరగాని ఆస్తులు''గా మిగిలిపోతాయి. ఐతే అటువంటి రుణాలను అధికారికంగా ''కొరగాని''విగా పరిగణించరు. దానికి బదులు ''వత్తిడిలో ఉన్న'' రుణాలుగా పరిగణిస్తారు. ఆ విధంగా ప్రభుత్వం బ్యాంకులను ''వత్తిడిలో ఉన్న'' రుణాలను ఎక్కువగా మంజూరు చేయమని 'వత్తిడి' ఎక్కువగా చేస్తుంది. ఫలితంగా బ్యాంకుల పరిస్థితి ఎప్పుడైనా బద్దలవడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం మీద కూర్చున్నట్టు ఉంది.
            ఇంకా ఆ అగ్నిపర్వతం పేలకుండా లోలోపలే రాజుకునే స్థితిలోనే కొనసాగుతున్నదీ అంటే దానికి కారణం బ్యాంకులు ప్రభుత్వ రంగంలో కొనసాగడమే. తమ డిపాజిట్లను ఎటువంటి రుణాల కోసం ఏ విధంగా ఉపయోగిస్తున్నదీ ప్రజలు గమనిస్తూనేవున్నారు. కాని వారేమీ భయాందోళనలకు గురి కావడం లేదు. ఆ బ్యాంకులు ప్రభుత్వ యాజమాన్యం కిందనే నడుస్తున్నాయని, ఏదన్నా చిక్కు పరిస్థితి వస్తే ప్రభుత్వం తమ ప్రయోజనాలను కాపాడుతుందని వారు నమ్మకంతో ఉన్నారు. ప్రజల్లో నెలకొన్న ఈ విశ్వాసమే ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ఇంకా కాపాడుతోంది.
          తక్కిన ప్రపంచంలో వివిధ దేశాల్లో ఆర్థిక సంస్థలు సంక్షోభాల్లో చిక్కుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. అవి ప్రైవేటు సంస్థలుగా ఉండి, అవి ఇచ్చిన రుణాలకు, తిరిగి చెల్లించాల్సిన డిపాజిట్లకు పొంతన లేని పరిస్థితులు ఏర్పడినందువల్లనే అవి సంక్షోభాలలో కూరుకుపోయాయి. గత శతాబ్దపు చివరి సంవత్సరాలలో (1995-2000 మధ్య) తూర్పు ఆసియా దేశాలు ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం ఇందుకు సరైన ఉదాహరణ. దక్షిణ కొరియా బ్యాంకులనే తీసుకోండి. ఆ బ్యాంకులు విదేశీ కరెన్సీలలో డిపాజిట్లు సేకరించాయి. వాటిని తమ దేశంలో దీర్ఘకాలిక ప్రాజెక్టులకు రుణాలుగా ఇచ్చాయి. తద్వారా అవి రెండు విధాలుగా రుణాలకు, డిపాజిట్లకు పొంతన లేని పరిస్థితిని ఎదుర్కొన్నాయి. మొదటిది: స్వల్పకాలిక వ్యవధిలో తిరిగి చెల్లించాల్సిన డిపాజిట్లను సేకరించి దీర్ఘకాలంలో మాత్రమే తిరిగి వచ్చే రుణాలకు మళ్ళించాయి. రెండవది: విదేశీ కరెన్సీలలో సేకరించిన డిపాజిట్లను విదేశీ కరెన్సీ ఆర్జించని ప్రాజెక్టులలోకి మళ్ళించాయి. దాంతో అనివార్యంగా సంక్షోభం ఏర్పడింది. దాని ప్రభావం చాలా తీవ్రంగా పడింది.
         2008లో అమెరికాలో సంక్షోభం సైతం ఇటువంటి పొంతనలేని కారణంగానే వచ్చింది. 1933లో మహా మాంద్యం కాలంలో రూజ్‌వెల్ట్‌ ప్రభుత్వం గ్లాస్‌-స్టీగల్‌ చట్టం చేసింది. వాణిజ్య బ్యాంకింగ్‌ను, పెట్టుబడుల బ్యాంకింగ్‌ను ఆ చట్టం స్పష్టంగా విడదీసింది. వాణిజ్య బ్యాంకులు డిపాజిట్ల ఆధారంగా నడుస్తాయి. అవి స్వల్పకాలిక రుణాలకు పరిమితం కావాలి. అదే పెట్టుబడుల బ్యాంకింగ్‌లోనైతే డిపాజిట్ల మీద ఆధారపడడం ఉండదు. అందుచేత దీర్ఘకాలికమైన స్టాక్‌ మార్కెట్‌ కార్యకలాపాలకు కావలసిన రుణాలను ఇచ్చే పని అది చేయాలి. ఈ చట్టం చేయవలసిన అగత్యం ఏమొచ్చింది? ఆ కాలంలో మాంద్యం నెలకొన్న పరిస్థితులలో బ్యాంకులు స్వీకరించిన డిపాజిట్లను స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల కోసం రుణాలుగా ఇచ్చాయి. స్టాక్‌మార్కెట్‌ ఒత్తిడికి గురి కావడంతో దాని ప్రభావం ఈ బ్యాంకుల మీద పడింది. ఆ పరిస్థితి నుండి బ్యాంకులను బైటకు తేవడానికి అమెరికన్‌ ప్రభుత్వం చాలా అవస్థలు పడింది. అందులో భాగమే ఈ గ్లాస్‌-స్టీగల్‌ చట్టం. ఐతే ఆ చట్టాన్ని 1999లో రద్దు చేశారు. దాంతో మళ్ళీ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని చవి చూడవలసి వచ్చింది. ఐతే, అదొక్కటే సంక్షోభానికి కారణం అని మాత్రం చెప్పడం లేదు. ఏ రుణం వెనుక ఎంత రిస్క్‌ ఉందో అంచనా వేయడంలో చాలా తక్కువగా అంచనా వేశారు. దాంతో లేV్‌ామాన్‌ బ్రదర్స్‌ వంటి పెట్టుబడుల బ్యాంక్‌ సైతం కుప్పకూలిపోయింది. దాంతో పాటు వాణిజ్య బ్యాంకులు కూడా దెబ్బ తినిపోయాయి. ప్రభుత్వ నియంత్రణతో మార్కెట్లు నడుస్తున్న కాలంలో (నయా ఉదారవాద విధానాలకు పూర్వ కాలంలో) మాదిరిగా స్వల్పకాలిక రుణాలకు పరిమితం కాకుండా దీర్ఘకాల పెట్టుబడుల కోసం కూడా రుణాలను ఇవ్వడంతో ఈ వాణిజ్య బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకుపోయాయి.
          ఇప్పుడు భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ప్రభుత్వం తెస్తున్న వత్తిడికి లోనై వ్యవహరిస్తున్నాయి. అవి ఇంకా ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్నందువలన ప్రజలు వాటిమీద నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు గనుక ఆ బ్యాంకులు ప్రైవేటుపరం అయితే మాత్రం అగ్నిపర్వతం బద్దలు కాక మానదు. దాని వలన డిపాజిటర్లు చాలా నష్టపోతారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద దాని ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఒకవేళ బ్యాంకులు ప్రైవేటీకరించబడినా, తమ రక్షణ సంగతి ప్రభుత్వం చూసుకుంటుంది అన్న భరోసా ప్రజలలో ఉంది అని, అందుచేత బ్యాంకులను ప్రైవేటీకరించినా ఎటువంటి సంక్షోభమూ తలెత్తదని కొందరు భావించవచ్చు. కాని ప్రభుత్వమే బ్యాంకుకు యజమానిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మీద తీసుకురాగలిగినంత వత్తిడి ఆ బ్యాంకు వేరే యాజమాన్యం కిందకు మారిపోయాక తీసుకు రావడం సాధ్యం కాదు.
         ప్రభుత్వ రంగ సంస్థలమీద అనుచితంగా వత్తిడి తెచ్చి వాటిని పారుబకాయిల పాలు చేస్తున్నదీ ఈ ప్రభుత్వమే. ఇప్పుడు ఆ బ్యాంకులను ప్రైవేటీకరించి తన చేతులు దులుపుకోవాలని చూస్తున్నదీ ఆ ప్రభుత్వమే. దీనివలన డిపాజిటర్లకు తీరని ఆర్థిక నష్టం వాటిల్లడమే గాక, ప్రజలకు బ్యాంకింగ్‌ వ్యవస్థ మీదే విశ్వాసం సన్నగిల్లుతుంది. దాంతో వాళ్ళు బ్యాంకుల్లో దాచుకోవడం మానేసి నగదు రూపంలో నిల్వ ఉంచుకోడానికే మొగ్గు చూపుతారు. దానివలన దేశాభివృద్థికి అవసరమైన పెట్టుబడుల సమీకరణ దెబ్బతినిపోయి అభివృద్ధి చాలాకాలం పాటు స్తంభించిపోతుంది.

( స్వేచ్ఛానువాదం )
ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రభాత్‌ పట్నాయక్‌