
వారం రోజుల్లో మూడు అమెరికన్ బ్యాంకులు దివాళా తీయడం పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభాన్ని మరోసారి ప్రపంచం ముందుకు తెచ్చింది. దీని పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది. గత వారం రోజుల్లో అమెరికాకు చెందిన సిల్వర్‌గేట్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‌విబి), సిగేచర్ బ్యాంక్‌లు దివాళా తీశాయి. అమెరికాలోని ప్రధాన బ్యాంకుల స్టాక్ విలువ ఏడు నుంచి 12 శాతం మేర పడిపోయింది. ఎనిమిది వేల కోట్ల డాలర్ల వరకూ ఆవిరయ్యాయి. తాజా పరిణామాలతో 2008 నాటి ప్రపంచ బ్యాంకింగ్ రంగ సంక్షోభం పునరావృతమవుతుందా? అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అప్పట్లో 150కి పైగా బ్యాంకులు కుప్పకూలి అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ అల్లకల్లోలమవుతోంది. ప్రస్తుతం దివాళా తీసిన మూడు బ్యాంకుల్లో ఎస్‌విబి అమెరికాలోని 16వ అతి పెద్ద బ్యాంక్. ఈ బ్యాంకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీల నుంచి డిపాజిట్లను సేకరించి, వాటికి అధికంగా రుణాలిస్తుంది. సాధారణంగా స్టార్టప్ కంపెనీల వంటి వాటికి రుణాలిచ్చేందుకు బ్యాంకులు వెనకాడతాయి. ఈ బ్యాంక్ అందుకు భిన్నంగా రుణాలిస్తుంది. ఏడాది కాలంగా అమెరికాలోని కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. రిస్క్ తీసుకుని ఎస్‌విబి లాంటి బ్యాంక్‌లలో డిపాజిట్లు పెట్టే బదులు ఇతర బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకునేందుకు కొందరు డిపాజిట్‌దారులు మొగ్గుచూపారు. వారు తమ డిపాజిట్లను ఉపసంహరించడం మొదలుపెట్టారు. స్టార్టప్, చిన్న, మధ్యతరహా పరిశ్రమల యజమాన్యాలు కూడా డిపాజిట్లను వెనక్కి తీసుకుంటున్నాయి. ఈ పరిణామాలు ఎస్‌విబిపై ఒత్తిడి పెంచాయి. డిపాజిట్లను వెనక్కి ఇచ్చే నిధులు లేకపోవడంతో అమెరికన్ ట్రెజరీలో పదేళ్లకు పెట్టుబడిపెట్టిన బాండ్ల అమ్మకాలను ఎస్‌విబి మొదలుపెట్టింది. సాధారణంగా 3.5 శాతానికిపైగా రావాల్సిన వడ్డీ రేటు 1.77 శాతానికి తగ్గినా 21 బిలియన్‌డాలర్ల విలువైన బాండ్లను అమ్మామని, అందువల్ల 1.8 బిలియన్ డాలర్ల నష్టం వచ్చిందని ఆ బ్యాంకు తాజాగా ప్రకటించింది. దీంతో, ఒక్కరోజులో ఆ బ్యాంకు షేర్ విలువ 60 శాతం పడిపోయింది. 21 వేల కోట్ల డాలర్ల డిపాజిట్లు ఉన్న ఈ బ్యాంకులో 11 శాతం డిపాజిట్లకే ఇన్సూరెన్స్ ఉంది. ఇలా ఇన్సూరెన్స్ ఉన్న డిపాజిట్లకు 2,50,000 డాలర్ల వరకూ బ్యాంకు చెల్లిస్తుంది. మిగిలిన వాటికి ఆస్తుల అమ్మకం తర్వాత చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌విబితోపాటు దివాళా తీసిన 110 బిలియన్ డాలర్ల విలువైన న్యూయార్క్‌లోని సిగేచర్ బ్యాంక్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించి, ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డిఐసి) ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. సిగేచర్ బ్యాంక్‌తోపాటు సిల్వర్‌గేట్ బ్యాంక్ పతనానికి ఆ బ్యాంకులు క్రిప్టో డిపాజిట్లను అధికంగా స్వీకరించడమే కారణమని విమర్శలున్నాయి. ఈ బ్యాంకుల శాఖలు, అత్యధికంగా కస్టమర్లు ఉన్న మనదేశంతోపాటు చైనా, కెనడా, డెన్మార్క్, ఇజ్రాయిల్, జర్మనీ వంటి దేశాలను తాజా పరిణామాలు కలవరపరుస్తున్నాయి. ఎస్‌విబి, సిగేచర్ బ్యాంకు డిపాజిట్‌దారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇన్సూరెన్స్ ఉన్నా, లేకపోయినా... మొత్తం డిపాజిట్లను ప్రభుత్వం చెల్లిస్తుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. తాజా ప్రకటనతో బడా పెట్టుబడిదారులు కొంత ఉపశమనం పొందుతుండగా, వెంచర్ క్యాపిటలిస్టులు, ఉద్యోగ, కార్మిక వర్గాలు, నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో నిరుద్యోగంతోపాటు అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఇతర ఖర్చులు విపరీతంగా పెరిగాయి. 40 శాతం మంది తమ ఆదాయంలో 30 శాతానికిపైగా ఇంటి అద్దెకే చెల్లించాల్సి వస్తోంది.
బ్యాంకుల దివాళా ఆసియన్ మార్కెటపై తీవ్ర ప్రభావం చూపింది. వరుస నష్టాలతో సెన్సెక్స్, నిఫ్టీలు ఐదు మాసాల కనిష్టానికి పడిపోయాయి. తాజా పరిణామాలు కొత్తగా స్టార్టప్‌లు పెట్టేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే వారికి అశనిపాతంగా మారుతున్నాయి. వాటి ప్రభావం నిరుద్యోగితను మరింతగా పెంచుతుందనే ఆందోళన నెలకొంది. ప్రపంచ పెట్టుబడిదారీ విధానంలోని డొల్లతనాన్ని ముందుకుతెచ్చిన ఈ సంక్షోభం సోషలిజం ఆవశ్యకతను మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశం చేసింది.