
ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రితో సోమవారం భేటీ కావడం, అనంతరం వచ్చిన వార్తలు పరిశీలిస్తే రాష్ట్రం ప్రపంచ బ్యాంకు ప్రయోగశాలగా కొనసాగుతూనే ఉందన్న భావన ఎవరికైనా కలుగుతుంది. మరింత లోతుగా ఆ విధానాలు అమలు చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారా అనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఆనాటి ప్రభుత్వం 1990వ దశకంలో 'బ్యాంకు' నుండి స్ట్రక్చరల్ అడ్జస్ట్‌మెంట్ లోన్ తీసుకోవడం, చేపట్టిన వినాశకర విధానాల దుష్ప్రభావాలు, పర్యవసానాలు అందరికీ తెలిసినవే! విద్యుత్ సంస్కరణల పేరిట ప్రజలపై జరిగిన దోపిడి, 2000 ఆగస్టులో ప్రజా ప్రతిఘటన చరిత్ర పుటల్లో చెరిగిపోనివి. ప్రపంచ బ్యాంకు రుణం అన్నా ముఖ్యంగా వారి ఆదేశాలతో చేపట్టే సంస్కరణలన్నా తెలుగు ప్రజలకు సాధారణంగా భయం కలుగుతుంది. ధర్మాసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలంటే యూజర్ చార్జీలు చెల్లించాలనీ, రైతు తన పొలానికి సాగు నీరు ఎంత వాడారో మీటర్లు బిగించి లెక్క కడతామనీ ఆనాడు సర్కారు అమలుకు పూనుకుంది. ప్రజల మాడు పగులగొట్టేలా విద్యుత్ చార్జీల భారం వేసింది. ప్రపంచ బ్యాంకు పేరు వింటేనే ఇలాంటి విషయాలన్నీ సినిమా రీల్ మాదిరి తిరుగుతుంటాయి. మళ్లీ ఏ భారం పడుతుందోనని జనం కలవరపడడం సహజం.
రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో ప్రస్తుతం అమలవుతున్న ఎ.పి హెల్త్ సిస్టమ్ స్ట్రెంగ్తెనింగ్ ప్రాజెక్టు (వైద్య ఆరోగ్య శాఖ), సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (సాల్ట్) ప్రాజెక్టు (విద్యా శాఖ), ఎ.పి ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ ట్రాన్స్‌ఫÛర్మేషన్ ప్రాజెక్టు (వ్యవసాయం, ఇరిగేషన్ తదితర శాఖలు) అమలు తీరుపై బ్యాంకు ప్రతినిధి బృందం ముఖ్యమంత్రితో చర్చించింది. ఈ మూడు పథకాలు కలిపితే 824 మిలియన్ డాలర్లు అంటే సుమారు 6,500 కోట్ల రూపాయలు. వీటిలో మొదటి ప్రాజెక్టు 2018 లోనే మొదలు కాగా విద్యా, వైద్య రంగాల ప్రాజెక్టులు ఈ ప్రభుత్వం వచ్చాక ప్రారంభమైనవే. ఇప్పటికే సాల్ట్ ప్రాజెక్టు అమలులో భాగంగా తరగతుల విలీనం, పాఠశాలల మూసివేత వంటివి అనుభవంలోకి వచ్చాయి. కేవలం విద్యాశాఖలోనే గాక ఐసిడిఎస్ (అంగన్‌వాడీ) కూడా ప్రభావితమయ్యాయి. మరోవైపు బైజూస్‌కు విద్యా వ్యవస్థపై పెత్తనం దఖలు పడిపోతోంది. వాస్తవాలు ఇలావుండగా ప్రపంచ బ్యాంకు బృందం సర్కారుకు కితాబిచ్చింది. బ్యాంకు లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో కార్యక్రమాలు అమలవుతున్నాయని శ్లాఘించింది. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తమ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళుతోందని, మరింత ముందుకు వెళ్లేందుకు ప్రపంచ బ్యాంకు తమ ప్రభుత్వంలో మరింత భాగస్వామ్యం కావాలని, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై సమగ్రంగా అధ్యయనం చేసి ప్రపంచబ్యాంకు మరింత సహకారాన్ని అందించాలని సిఎం కోరారు. అంటే బ్యాంకు, సర్కారు బంధం బలపడుతోందన్నమాట.
ప్రపంచ బ్యాంకు రుణాలన్నీ నష్టదాయకమైనవని చెప్పలేం. కాని, విషమ షరతులతో కూడిన రుణాలు తీసుకుని ఆ 'సంస్కరణలు' అమలు చేస్తే అభివృద్ధికన్నా వినాశనమే ఎక్కువగా ఉంటుందన్నది గతానుభవం. ప్రస్తుతం సాల్ట్ అమలులో అటు పాఠశాల విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులతోపాటు అంగన్‌వాడీ లబ్ధిదార్లు, ఉద్యోగులూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అన్నం ఉడికిందా లేదా అన్నదానికి ఒక్క మెతుకు చూస్తే చాలునన్న చందంగా గడచిన రెండేళ్ల అనుభవం మన కళ్ల ముందుంది. నాడు-నేడు లేదా అమ్మ ఒడి వంటి పథకాల వల్ల సామాన్యులకు మేలు కలిగిన మాట నిజమే కాని అవి సాల్ట్ లో భాగం కాదు. సాల్ట్ ప్రాజెక్టు పర్యవసానాల్లోని ప్రతికూలాంశాలపట్ల ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించడం లేదు సరికదా ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు లేవనెత్తిన అభ్యంతరాలను తృణీకరించడం తగదు. ప్రపంచ బ్యాంకు చెప్పిందంతా అమలు చేసి, నయా ఉదారవాద విధానాలకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రయోగశాలగా చేయడం నష్టదాయకం. ప్రభుత్వం వాస్తవ దృక్పథంతో వ్యవహరించడం అవసరం. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రమాదకర విధానాలను తిప్పికొట్టాలి.