ప్రజాశక్తి-పీలేరు(అన్నమయ్యజిల్లా) : రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికై తలపెట్టిన బంద్ పీలేరులో విజయవంతమైందని ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యుఐ, టిఎన్‌ఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి, యువజన సంఘ నాయకులు తెలిపారు. పట్టణంలోని ప్రైవేటు విద్యా సంస్థలు ముందుగానే స్వచ్ఛందంగా సెలవు ప్రకటించడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలల్లో మంగళవారం జరగాల్సిన పరీక్షలు సైతం యూనివర్సిటీలు వాయిదా వేసుకోవడం జరిగిందని, జూనియర్ కళాశాల విద్యార్థులు స్వచ్ఛందంగా క్లాసులు బహిష్కరించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థి, యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాక మునుపు విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రస్తుతం విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేసే విధంగా అడుగులు వేస్తున్నాడని ఆరోపించారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తేసి వారి కడుపు కొట్టారన్నారు. విద్యాసంస్థల విలీనంతో విద్యార్థులు కొన్ని వసతి గృహాలను మూసివేయడం అన్యాయమని చెప్పారు. జిఓ నెంబర్ 77 తీసుకొచ్చి పీజీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్, ఉపకార వేతనాలు లేకుండా చేశారని, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయలేదని ఆరోపించారు. అంతేకాకుండా ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇంతవరకు పంపిణీ చేయలేదని, హాస్టళ్ళలో మౌలిక వసతులు కల్పన విస్మరించారని ఆరోపించారు. వసతి గృహాల్లోని విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఐదు నెలల బిల్లులను విడుదల, వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న వార్డెన్, వాచ్మెన్, కుక్, కమాటి పోస్టులను భర్తీ చేయలేదన్నారు. అలాగే ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు సంవత్సరాల డిగ్రీ విధానాన్ని రద్దు చేసి మూడు సంవత్సరాల డిగ్రీనే కొనసాగించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అదనపు టీచర్లను నియమించాలని, ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. పీలేరు నియోజకవర్గంలో పాఠశాలలకు సరఫరా చేస్తున్న ఇస్కాన్ భోజనం నాసిరకంగా ఉండడంతో పాటు, అర్ధరాత్రి వండి, ఉదయం ఎప్పుడో సరఫరా చేస్తూ, ఆ భోజనాన్ని పిల్లలకు పెట్టడం బాధాకరమన్నారు. వెంటనే ఆ ఇస్కాన్ భోజనాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, టి ఎల్ వెంకటేష్, రెడ్డి శేఖర్, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు అమృత తేజ, శ్రీకాంత్, సంపత్, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ నసీఫ్, ముబారక్ తదితరులు పాల్గొన్నారు.










