రామాపురం శివారు ప్రాంతంలో గంగన్న అనే గజదొంగ నివసించేవాడు. గ్రామం గుండా పొరుగూరికి వెళ్లే బాటసారులను అడ్డగించి, దోచుకునేవాడు. ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపడానికీ వెనుకాడే వాడు కాదు. అప్పుడప్పుడు రామాపురంతో పాటు చుట్టుపక్కల ఊర్లలో సంపన్నుల ఇళ్లలో జొరబడి, అందినకాడికి దోచుకునేవాడు. రామాపురానికి యాభై కోసుల దూరంలో దట్టమైన అడవుల్లో గంగన్న నివాసం. చిన్ననాటి నుండి ఆ అడవి కొట్టినపిండి కావడంతో అతడిని బంధించేందుకు పాలకులు చేసే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
ఓ రోజు రామాపురంలోని బట్టల వ్యాపారిపై గంగన్న కన్ను పడింది. పెళ్లిళ్ల కాలంలో అధిక లాభాలు గడించారని చుట్టుపక్కల ఊర్లలో చెప్పుకోవడం గంగన్న విన్నాడు. ఓ రాత్రి ఆ ఇంటికి కన్నం వేసి, లోపలకి ప్రవేశించాడు. సమయానికి ఆ ఇంట్లోవారు బంధువుల పెళ్లికి పొరుగూరు వెళ్లారు. ఇంట్లో తల్లి ఒక్కతే వుంది. గదిలో దాచిన డబ్బు, దస్కం, నగలు మొత్తం మూటగట్టి, భుజాన వేసుకుని బయటకు వెళ్లే ప్రయత్నంలో నేలపై పడిన నూనెపై కాలువేసి, జారిపడ్డాడు. గోడకు ఆనుకొని వున్న గునపం తలకు తగిలి, కళ్లు బైర్లు కమ్మి మూర్చపోయాడు.
తెలివి వచ్చాక కళ్లు తెరిచి చూస్తే తాను ఆ ముసలమ్మ ఒళ్లో పడుకున్నట్లు గమనించాడు. నుదుటిన పట్టిన చెమటను తుడుస్తూ విసినకర్రతో విసురుతోంది అవ్వ.
ఆశ్చర్యంతో లేచి కుర్చోబోయాడు గంగన్న. 'గబుక్కున లేవకు నాయనా, కళ్లు తిరుగుతాయి. దెబ్బ బాగా తగిలినట్లుంది, రక్తం కారుతుంటే లేపనం రాసి, కట్టుకట్టాను. ఈ గోళీలు రోజుకు నాలుగుసార్లు ఐదు రోజులు వేసుకుంటే అన్ని వాపులు, నొప్పి తగ్గుతుంది' ప్రేమతో చెప్పింది అవ్వ.
'నన్ను వదులు. నేను వెళ్లాలి, నేను గజదొంగను.. వదలకపోతే చంపేస్తాను' అరుస్తున్నట్లు చెప్పాడు గంగన్న.
'నువ్వెవరివైనా, ఈ అవ్వకు మాత్రం మనవడివే. ఈ పళ్లు, తీపి పదార్థాలు తిని, నీళ్లు త్రాగి, కాసేపు సేద తీరి వెళ్ళు' అంటూ కొసరి కొసరి తినిపించింది అవ్వ. ఆ తర్వాత ఒళ్లో పడుకోబెట్టుకొని, విసనకర్రతో విసరసాగింది.
ఆ వాత్సల్యానికి గంగన్న కళ్లలో నీళ్లు తిరిగాయి. గంగన్న బాధ క్షణలలో మాయమైపోయి, కొత్త శక్తి ప్రవేశించినట్లు అనిపించింది. కరడుగట్టిన హృదయం కరగసాగింది. ప్రేమ, ఆప్యాయతల ముందు ఎంతటి పాషాణమైనా కరగాల్సిందే అనిపించింది.
'అవ్వా, నేనెంతో దుష్టుడిని. ఎంతోమందిని బాధించి వారి కష్టార్జితం దోచుకొని, కొండంత పాపం మూటగట్టుకున్నాను. నన్ను చూసి భయపడేవారు, అసహ్యించుకునేవారే తప్ప, నీలా ప్రేమ చూపించేవారిని చూడలేదు. నా తల్లి కూడా పుట్టిన వెంటనే నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేసి, వెళ్లిపోయింది. నా మీద నీకు ఎందుకంత ప్రేమ అవ్వా?' కళ్లలో నీటి పొరలు కమ్ముకుంటుండగా అడిగాడు గంగన్న.
'ఈ లోకంలో పుట్టుకతోనే ఎవ్వరూ చెడ్డవారు అవ్వరు. పరిస్థితులే అలా మారుస్తాయి. అయితే, ఆ ప్రతికూలతను ఎదిరించి, మనకు కావాల్సినట్టుగా మార్చుకోవాలి.' అనునయంగా చెప్పింది అవ్వ.
ఆ మాటలు గంగన్నపై ప్రభావం చూపించాయి. 'అయితే నేను చేసిన ఈ తప్పుడు పనులకు ప్రాయశ్చిత్తం లేదా?' అడిగాడు గంగన్న.
'ఇప్పటివరకూ చేసినదంతా మరిచిపో.. వెళ్లి నగర పాలకుడికి లొంగిపో. శిక్షను అనుభవించిన తర్వాత, కొత్త జీవితాన్ని ప్రారంభించు. అంతా మంచే జరుగుతుంది' ప్రేమగా చెప్పింది అవ్వ.
అవ్వ నిష్కల్మష ప్రేమతో హృదయ పరివర్తన చెందిన గంగన్న దొంగ సొత్తుతో పాలకుడికి లొంగిపోయి, పది సంవత్సరాల కఠినశిక్ష అనుభవించాడు. అనంతరం కాయకష్టంతో జీవించడం ప్రారంభించాడు. కరడు కట్టిన గజదొంగలను సైతం ప్రేమతో మార్చవచ్చని అవ్వ నిరూపించింది.
- సిహెచ్ ప్రతాప్
91368 27102