'అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. శక్తికి నిర్వచనం స్త్రీ. అలాంటి స్త్రీ శక్తి ప్రతిరూపం దుర్గమ్మ. అమ్మవారిని 108 నామాలతో స్మరిస్తాం. నా 108వ చిత్రం భగవంత్ కేసరి ఈ నవరాత్రుల్లో విడుదల కావడం, ఈ చిత్రానికి మూలం స్త్రీశక్తి కావడం, అమ్మవారి వాహనం పులి కావడం, ఈ చిత్రం కూడా బనావో బేటికో షేర్ అనే అంశంతో చేయడం చాలా సంతోషంగా వుంది. ఇలాంటి గొప్ప సందేశాత్మక చిత్రంలో మేమంతా పాలుపంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ చలనచిత్రపరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రం 'భగవంత్ కేసరి'. ఇలాంటి అద్భుతమైన సినిమా తెలుగువారు తీశారని దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నాను. ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాన్నగారి స్ఫూర్తితో ఏదైనా వైవిధ్యంగా చేయాలనే తపనతో చిత్ర పరిశ్రమలో నా ప్రస్థానం కొనసాగుతోంది.' అని అన్నారు హీరో బాలకృష్ణ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల నటించిన భగవంత్ కేసరి ఈనెల 19న విడుదలైన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ విజయోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకురాలు నందిని రెడ్డి ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్నారు.