Jun 04,2023 07:20

వేసవి సెలవులు అయిపోయి, బడులు తెరిచే రోజు వచ్చేసింది.. బడి గంట మోగగానే.. పిల్లలంతా పరుగులు తీస్తూ గుంపులు గుంపులుగా.. ఎంతో క్రమశిక్షణతో చదువులు నేర్పే బడిలోకి వచ్చేస్తారు. నేస్తాలను కలిసే ఆనందం.. ఒకర్నొకరు ఆలింగనాలు చేసుకుంటూ.. ఆప్యాయతలు కురిపించుకుంటూ.. స్కూల్‌ని చూడగానే... కొత్తగా చేరిన చిట్టి తల్లి, బుజ్జిగాడి కళ్లల్లో మెరిసే మెరుపులు. కొత్త డ్రెస్‌లు, కొత్త బ్యాగులు, కొత్త పుస్తకాలు.. వాటికి ప్రేమతో వేసిన అట్టలను చేతితో నిమురుతూ.. ఎక్కడ నలిగిపోతాయో అని కంగారుపడే బాల్యపు జ్ఞాపకాలు మనందరివీ... ఆట, పాటతో పాఠాలు నేర్వడమే అసలైన విద్య. మరి నేటి విద్యా రంగంలో పిల్లలు స్వచ్ఛంగా వికసించే పరిస్థితులు, విధానాలు ఎలా ఉన్నాయి? పిల్లలకు అందిపుచ్చుకునేలా ఉన్నాయా? ఆటంకాలేమైనా ఉంటున్నాయా? ఇలాంటివాటిపై ప్రత్యేక కథనం..

2


మూడు నిండి నాలుగో ఏడు మధ్యలోనే పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తున్న రోజులు. నేటి పిల్లలు కూడా ఎంతో హుషారుగా.. చుట్టూ జరుగుతున్న మార్పులను త్వరత్వరగా ఆకళింపు చేసుకుని, ఇట్టే అల్లుకుపోతున్నారు కూడా. విద్యా విధానంలో అప్పటికీ ఇప్పటికీ అనేక మార్పులూ వచ్చాయి. అయితే ఆ మార్పులు వారిలో విజ్ఞానాన్ని పెంపొందించేలా ఉండాలనేదే సమాజాభ్యున్నతి కోరేవారి అభిలాష. అప్పుడే నేటి బాలలు రేపటి గొప్ప సమాజ పౌరులుగా ఎదుగుతారు. విద్య అంటే కేవలం పాఠాలు బట్టీయం పట్టడమే కాదు. సృజనను వెలికితీసేలా.. శాస్త్రీయంగా ఆలోచింపజేసేలా.. ఈ సమాజంలో తాను ఒక పౌరుడిగా బాధ్యతతో మెలిగేలా తీర్చిదిద్దబడాలి. అలాంటి విద్య కావాలి. గత కొన్నేళ్లుగా విద్యార్థులు ఎప్పుడూ లేనంతగా ఆటంకాలను ఎదుర్కొంటున్నారు. అందులో ఒకటి కోవిడ్‌ కాలం. ఈ కాలంలో పిల్లలు విద్యాలయాలకు దూరమై, బయటకు సైతం వెళ్లకుండా అల్లాడిపోయిన దుస్థితి. ఇప్పుడవన్నీ అధిగమించి, మళ్లీ స్కూల్‌కి వెళ్లడం ప్రారంభమైంది. అలా ఒక ఏడాది గడిచిపోయింది. మళ్లీ బళ్లు తెరుచుకునే సమయం ఆసన్నమైంది.

2
  • అమ్మ ఒడిలో.. నాన్న చేతిలో..

అమ్మ ఒడిలో నేర్చిన విజ్ఞానంతో చిట్టితల్లి, చిన్నికన్నా.. 'అత్తా, తాతా' అనడం నేర్చి, తనను ప్రేమగా పలకరించేదెవరో, బెదిరించేదెవరో గుర్తు పడుతూ.. పరవశించడం., బిక్కముఖం వేయడం ఆయా సందర్భానుసారం చేస్తారు. అమ్మానాన్న సాయంతో పాకడం, నిలబడడం, నడవడం, పరుగెత్తడం... నేర్చి, గొప్ప విజయం సాధించిన కాంతి ఆ చిన్నారి మోముల్లో ప్రకాశిస్తుంది. ఇలా నేర్వడం అనేది ఒక నిరంతర ప్రక్రియ.. అది మనిషి సహజశైలి. పెరుగుతున్న కొద్దీ పిల్లల్లోని సహజత్వం, జిజ్ఞాస పెంపొందాలి. పెరుగుతున్నకొద్దీ నేర్చుకోవడం, నేర్చుకున్నకొద్దీ ఎదగటం.. ఒక సహజ పరిణామక్రమంగా ఉండాలి. స్కూలుకు వెళ్లాక చివరి తరగతి వరకూ ఇలాగే అది కొనసాగాలి. పిల్లలు విద్యావనాల్లో వికసిత కుసుమాలు కావాలి. అక్కడే వారంతా వికసించి, పరిమళాలు వెదజల్లేవారిగా తీర్చిదిద్దబడాలి. విద్యాలయాల్లో ఆట, పాటతో.. కేరింతలు కొడుతూ సంతోషపు స్వరాలై పరిఢవిల్లేలా చేయాలి. నిజానికి విద్య అంటే ఒక విజ్ఞాన ప్రయాణం. తెలియనివి నేర్చుకునే వేదిక. విభిన్న వర్గాల నుంచి వచ్చిన వారితో కల్మషంలేని మైత్రీ బంధం ఏర్పడే స్థలం అదే.

  • ఒత్తిడి.. పోటీతత్వం పోవాలి..

చిట్టి బుర్రల్ని చిదిమేసే అనారోగ్యకర ర్యాంకుల విధానం.. చదువంటే.. పాఠ్యాంశాలను బట్టీయం చేయడమేననే ధోరణులు పెరిగాయి.. ఎంత ఆకళింపు చేసుకున్నారనేది కాకుండా.. మార్కులు.. ర్యాంకులతో తయారుచేసిన కొలమానాలే వారి భవితకు ప్రతిబంధకాలు. ఉపాధ్యాయులు చెప్పిన విషయాలు శ్రద్ధగా వినడం, దాన్ని మరింతగా విస్తృతపరుచుకునే ప్రయత్నం చేయడం.. అందుకు టీచర్ల సహకారం తీసుకోవడం.. ఆరోగ్యకరమైన ఎదుగుదల. కానీ తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ, యాజమాన్యాలూ.. పిల్లలు సముపార్జించిన విజ్ఞానాన్ని కాకుండా.. గ్రేడులు, ర్యాంకులు, మార్కులు.. కొలుస్తూ ఎక్కువొస్తే ఆర్భాటాలు.. తక్కువొస్తే.. హేళనలు.. చేస్తున్నారు. ఇవి పిల్లల్ని మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నాయి. తీవ్ర ఒత్తిడికి లోనై పసితనం వసివాడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. చిన్న వయసులోనే ఆత్మహత్యలకు పాల్పడటానికి ఇలాంటి ధోరణులే కారణం.. ఈ ఒత్తిడి చదువులు, అనారోగ్యకర పోటీతత్వం పోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన విజ్ఞానం విద్యార్థులు పొందగలిగేది.

3
  • అది విజ్ఞానుబంధం..

కరోనా మనకు చాలా నేర్పింది. ప్రయివేటు విద్యాలయాల, ప్రభుత్వ విద్యాలయాల తేడాని కూడా తెలియజేసింది. అంత కోవిడ్‌ విపత్కర కాలంలోనూ ప్రయివేటు విద్యాలయాలు ఆర్థికంగా ఎలా వసూలు చేశాయో తెలిసిందే. వీటికి తోడు ఆధునిక సాంకేతికతను అనుసంధానించి, ఆన్‌లైన్‌ పాఠాలు నేర్చుకునే కొత్త ఒరవడి ముందుకు వచ్చింది. అయితే ఇది ఆ సమయంలో అప్పటికి ఒక తాత్కాలిక ప్రత్యామ్నాయం. అంతేగానీ.. దీన్ని ఆసరా చేసుకుని ఆన్‌లైన్‌ విద్యావిధానమే కొనసాగించాలనుకోవడం.. అదే విద్యాభివృద్ధికి దోహదపడుతుందని అనుకోవడం.. లాభం కన్నా నష్టాన్నే ఎక్కువ కలిగిస్తుంది. ఉపాధ్యాయులతో విద్యార్థులకు ప్రత్యక్ష అనుబంధం ఉండాలి. అప్పుడే విద్యార్థి ఎంత వరకూ ఆకళింపు చేసుకున్నదీ గురువుకు అర్థమవుతుంది.. టీచర్‌ చెప్పింది అర్థంకాకపోతే విద్యార్థి సందేహం నివృత్తి చేసుకొనేది తరగతిగదిలోనే. పిల్లల మానసిక పరిస్థితిని, ఇంకేదైనా ఇబ్బందిని ఎదుర్కొంటున్నా.. ఉపాధ్యాయులే పసిగట్టగలరు. పిల్లలు ఇంటి దగ్గర కన్నా ఎక్కువ సమయం బడిలోనే గడుపుతారు. అలాంటి బడిలో ఉపాధ్యాయునితో వారి అనుబంధం అవసరం. పిల్లల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసేది ఉపాధ్యాయులే. అందుకే అలాంటి అనుబంధాలు సహజంగా, ప్రత్యక్షంగా ఉంటేనే.. పిల్లలూ మరింత ఉన్నతంగా ఎదగడానికి వీలవుతుంది.

  • విలీనాలు.. విపరీతాలు..

ప్రభుత్వ స్కూళ్ల విలీనాలతో పిల్లలు బడికి మరింత దూరమయ్యారు. పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి, తల్లిదండ్రులూ, పిల్లలూ ఆందోళన చేసినా పాలకులు పట్టించుకోనితనం. ఇది పిల్లలకు ఎంత నష్టం కలిగిస్తుందనేది ఆలోచించని వైనం. సందుకో సారాయి దుకాణం మీద ఉన్న శ్రద్ధ.. వీధికో బడి ఉండేందుకు లేదు. పిల్లలు బడికి తామంత తాముగా వెళ్లేంత దూరంలో ఉండాలి. అలాకాకుండా బస్సులు ఎక్కి వెళ్లడం ఆర్థికంగా అందరికీ సాధ్యం కాదు. పిల్లలకు సౌలభ్యంగా, సౌకర్యంగా ఉండేలా చర్యలు ఉండాలి. అదే సందర్భంలో ప్రభుత్వం చేస్తున్న కొన్ని మంచిపనులు అభినందించాల్సిందే. అది అమ్మఒడి గానీ, విద్యాదీవెన గానీ, వారి ఫీజులకు, పుస్తకాలు, యూనిఫారంకూ, బూట్లు, బెల్టు, టై వంటివి అందించడం ఆహ్వానించాల్సిన చర్యలు. ఇవి ఇవ్వడంతో పాటు పిల్లలు బడులకు సులువుగా వెళ్లేలా చూడాల్సిన బాధ్యత అంతకన్నా ఎక్కువ. అర్ధాంతరంగా స్కూళ్లను విలీనం చేయడం పిల్లల్ని అయోమయానికి, ఆందోళనకు గురిచేసే విషయమని గుర్తెరగాలి. తల్లిదండ్రులు దూరాభారాలు పంపలేక పిల్లల్ని మధ్యలోనే బడి మాన్పించేస్తున్నారు. లేదా ప్రయివేటు పాఠశాలలకు పంపాల్సిన అనివార్యతలోకి నెట్టబడుతున్నారు. చివరకు ఎవరికి లబ్ధి జరుగుతుందో తెలియంది కాదు. ఇవన్నీ ఒకవైపు చేస్తూ.. మరోవైపు 'మళ్లీ బడికి, బడికి పోదాం..' అంటూ హోరెత్తే నినాదాలతో కార్యక్రమాలు చేపట్టే పాలకులు.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుంది. పిల్లలకు బడిని చేరువ చేసే ఆలోచనలు చేయడం ఉత్తమం. విద్యాలయాల్లో, విద్యావిధానాల్లో తీసుకునే ఏ నిర్ణయాలైనా పిల్లల భవిష్యత్తుకు బంగరు బాట వేసేలా ఉండాలి. అంతేగానీ వారికవి కంటకంగా మారేలా ఉండకూడదు.

3
  • మాతృభాషలోనే ప్రాథమిక విద్య..

మాతృభాషలో ప్రాథమిక విద్య ఉండాలని అడగాల్సిన పరిస్థితి రావడమే విచారించాల్సిన విషయం. పిల్లలు మొగ్గలుగా ఉన్నప్పుడు సహజంగా వికసించేలా చూడాలిగానీ, బలవంతంగా మొగ్గల్ని విప్పారిస్తే వికసించేది పువ్వు కాదు.. అది దాని సహజ పరిమళాల్నీ కోల్పోతుంది. అందుకే వారికి చదివింది అర్థమవడం కీలకం. అందుకు అనుగుణంగానే విద్య నేర్పాలి. ఆంగ్ల భాష అవసరం లేదని కాదు.. అది మాట్లాడే నేర్పు, ఆ భాషను నేర్పించడం ప్రత్యేకంగా చేయొచ్చు. కానీ ఆంగ్లభాషలోనే విద్యా బోధన అనేదే అభ్యంతరకరమైన విషయం. అర్థంకాకపోతే చెప్పగలిగే, చదువరులైన తల్లిదండ్రులు పిల్లలందరికీ ఉండరు. ఈ విధానం వల్ల యాంత్రికంగా, బట్టీయం పద్ధతుల్లో విద్యను నేర్వాల్సి వస్తుంది. దీనివల్ల వారిలో విజ్ఞానం సహజంగా కలగాల్సిన పద్ధతుల్లో కాకుండా.. రొడ్డుకొట్టుడు వ్యవహారంగా మారుతుంది. వీరు సమాజం పట్ల బాధ్యతలేని వారిగా, కెరీరిజం వైపు కొట్టుకుపోయేవారిగా తయారవుతారు. ఇది చాలా ప్రమాదకర ధోరణి. అందుకే ప్రాథమిక విద్య వరకైనా మాతృభాషలోనే బోధన జరిగేలా చూడాలి.

  • మార్గనిర్దేశకులు..

ఉపాధ్యాయులంటే పిల్లల భవిష్యత్తుకు మార్గనిర్దేశకులు. వారు భవిష్యత్తరానికి పునాదులు వేయడంతో పాటు.. తను ఉన్న ఊరితోనూ అనుబంధం కలిగి ఉంటారు. గతంలో ఉపాధ్యాయులంటే ఊరందరికీ ఒక గౌరవం ఉండేది. తెలియని విషయాలు అడిగి తెలుసుకొనేవారు. చదువురాని వారు సైతం ఉపాధ్యాయుల వద్దకు వచ్చి, తమకు వచ్చిన నోటీసులు అయినా, మరొకటి అయినా.. వివరం అడిగి, తెలుసుకునేవారు. సమాజంలో పెడధోరణులను, మంచి చెడులను ఉపాధ్యాయులే చెబుతూ హెచ్చరిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఉపాధ్యాయులకు ప్రభుత్వాలు అనేక పనులు అప్పజెప్తున్నారు. అవి ఎంతగా అంటే కనీసం విద్యార్థులకు సిలబస్‌ పూర్తికానివ్వలేనంతంగా.. ప్రతిదీ వారి నెత్తిన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. వారు తమ హక్కుల గురించి, వేతనాల గురించి మాట్లాడితే.. అవి తీర్చకపోగా, కక్షసాధింపు చర్యలకు పాల్పడటం.. బదిలీల ప్రక్రియకు పూనుకోవడం.. సమస్యలు ఎంత మాత్రం పరిష్కారం కాదు. తమని నిలదీసినందుకు పంతం నెగ్గించుకోవాలనే ధోరణి చేపట్టడం ప్రమాదకరం. ఉపాధ్యాయులు పిల్లలకు విజ్ఞానంతోపాటు, పరమత సహనం, కుల వివక్షలు లేకుండా.. అందరూ ఈ దేశ ఉత్తమ పౌరులుగా ఉండాలని చెప్పడం బంగరు పౌరులను తయారుచేయడమే. నేటి విద్యావిధానంలో ఆ విధమైన మార్పులకు ప్రభుత్వాలు, పాఠశాలలు, విద్యావేత్తలు శ్రీకారం చుట్టాలి. చరిత్రను వక్రీకరించినా, మతోన్మాద, మనువాద అంశాలను చొప్పించాలని చూసినా ప్రభుత్వాలు, విద్యావేత్తలు అప్రమత్తంగా ఉండాలి.

6
  • ప్రయివేటు.. కార్పొరేటు.. విజృంభణ

కాస్తంత పట్టణ వాతావరణం ఉంటేచాలు.. అక్కడల్లా స్థానికంగా ఉన్నవారు ప్రయివేటు స్కూళ్లనూ, కాలేజీలను ఏర్పాటు చేశారు. ఇరుకిరుకు గదుల్లో.. ఆటస్థలాలు లేని ఆవరణల్లో.. పిల్లల ఆటపాటలు తగ్గాయి. ర్యాంకులు, మార్కులు మాత్రమే మాట్లాడే విధానం వచ్చింది.. ఈ క్రమంలోనే స్థానిక ప్రయివేటు విద్యాసంస్థలను మింగేస్తూ కార్పొరేటు విద్యాసంస్థలు బలంగా ఎదిగాయి. కార్పొరేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో చదువు'కొనే' విద్యావిధానంగా మారిపోయింది. అనారోగ్యకర పోటీలు.. ఒక్కమార్కు తగ్గితే అవహేళనలు.. విరామం లేకుండా.. మరో వ్యాపకం లేకుండా.. చదవాల్సిన పరిస్థితులు. కోళ్ల ఫారాల్లో కోళ్లలా వారిని దిగ్బంధించి, క్లాసు రూముల్లో ఉన్నవారు, హాస్టల్‌ రూములో లేకుండా.. ఏ ఇద్దరూ కలిసి ఉండకుండా.. స్నేహాలు విరియకుండా.. వారిని యాంత్రికంగా తయారుచేయడం జరుగుతుంది. ఎప్పుడూ మార్కులూ, ర్యాంకులూ అంటూ వారిని శల్యపరీక్షలు చేయడం.. వారిలోని జిజ్ఞాసను చంపేసి, సహజత్వాన్ని నులిమేసి, వారు ఏం చదువుతున్నారో తెలియనితనం ఆవరించేస్తోంది. ఇది చదువు సహజ స్వభావానికి పూర్తి విరుద్ధం. పిల్లలు ఎంత చదివితే అంత ఒత్తిడి సాధారణమైపోయింది. ఎల్‌కేజీలోనే ఐఐటి ఫౌండేషన్స్‌, ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ అంటూ ఊదరగొడుతూ.. కాసులుంటేనే ఉన్నత చదువులనే వాతావరణం సృష్టించారు. ఇలాంటి విద్యాలయాల్లో పసితనం నుంచి పదో తరగతికి వచ్చేలోపు వారు మానవసంబంధాలు లేని మరమనుషులుగా తయారవుతున్నారు. ఇదేనా మనం కోరుకునే భావిభారతం? ఒక్కసారి ఆలోచించండి. ''ఇలాంటి వాతావరణంలో చదివిన పిల్లలు మంచి సంపాదనాపరులు అయితే అవ్వొచ్చు కానీ, మంచి పౌరులుగా రాణించే అవకాశం తక్కువ'' అంటారు ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌.

5
  • పరిశీలించేలా ప్రోత్సహించాలి..

పాఠ్యపుస్తకాల్లోవి చదువుకోవడానికే పిల్లల్ని పరిమితం చేయకూడదు. గుడ్డిగా ఫాలో అవ్వకుండా చూడాలి. మక్కీమక్కీ టీచర్‌ బోర్డుపై రాసింది, నోట్‌ బుక్‌లో ఎక్కించడం, నోట్‌బుక్‌లోది హోమ్‌ వర్క్‌లో ఎక్కించడం వంటివి ప్రోత్సహించకూడదు. ఇటీవల పిల్లలు లెక్కలు కూడా బట్టీ పట్టి తీరా అక్కడ కొద్దిగా అంకెలు తేడా వచ్చినా.. రాయలేని పరిస్థితి. ఇది శాస్త్రీయమైన పద్ధతి కాదు. ఏ విజ్ఞానమైన అవగాహన చేసుకుంటేనే ప్రయోజనం. అలా అర్థం చేసుకుని రాయడం అనేది, లెక్కల్లో లాజిక్‌ తెలుసుకుని, సూత్రబద్ధంగా లెక్కను సాల్వ్‌ చేసేలా తర్ఫీదు ఉండాలి. అలాగే అప్పుడప్పుడు పిల్లల్ని దగ్గరలోవి, కాస్త దూరంలోవి ప్రణాళిక వేసి, తీసికెళ్లాలి. వాళ్లు గమనించినవి వచ్చాక వారి చేత రాయించాలి. అలా వాళ్లంతట వాళ్లు తెలుసుకుని, సముపార్జించిన విద్య చాలా విలువైనది. వారి మనసుల్లో చెరిగిపోకుండా అలా నిలిచిపోతాయి. అలాగే పొలాలకు పిల్లల్ని తీసికెళితే, మనం తినే ఆహారం ఎలా వస్తుందో వారికో సమగ్ర అవగాహన కలగడానికి వీలవుతుంది. నదులు, సముద్రాలు కూడా పిల్లలకి చూపించడం చాలా అవసరం. అలా పిల్లలు పరిసరాలు, ప్రకృతి నుంచి విషయ పరిజ్ఞానం పొందేలా ప్రోత్సహించాలి.

5

 

  • వీటిపైనా శ్రద్ధ పెట్టాలి..
  1.  తరగతి గది సౌకర్యంగా ఉండాలి.
  2. ప్రతి స్కూల్లో ఆటస్థలం తప్పనిసరిగా ఉండాలి.
  3. వారంలో ఒకరోజు సాంస్కృతిక పరమైన అంశాల పట్ల ఆసక్తి కలిగించేవి చేపట్టాలి. ప్రధానంగా పాటలు, నాటికలు, నృత్యాలు ప్రత్యేకంగానేర్పించే ఏర్పాటు చేయాలి.
  4.  పిల్లలకు ఇతర కుట్లు, అల్లికలు, క్రాఫ్ట్స్‌ వంటివి ఉండాలి.
  5.  స్కూలు ఆవరణలో తోటపని చేసేలా ప్రోత్సహించాలి.
  6. కథలు చెప్పించడం, చదివించడం, రాయించడం, కవితలు రాయించడం వంటి సాహిత్యపరమైన అభిలాష పెంపొందించాలి.

 

శాంతిశ్రీ
8333818985