అమ్మఒడి, నాన్న వేలు ఇడిసిన నాకు
బాల్యమంతా వెన్నుతట్టి నిలబడింది.. నా బడి సంచే..
ఎపుడన్నా సాయిత గాళ్ళు లేకుండా
ఒంటరిగా నడిచెళుతుంటే
ఆ జబ్బ మీద ఓ చెయ్యి
ఈ జబ్బ మీద ఓ చెయ్యేసి
నడిచే దోస్తుల్లా బడి సంచి చేతులే నడిపించేవి నన్ను
పొద్దుగాల అమ్మ పెట్టిన సద్దిగిన్నెనీ..
ఖాళీ అయిన సద్దిగిన్నెలో నింపుకున్న సంతోషాలనీ తన ఒళ్లనే దాచుకునేది..
పలక మీద రాసి రాసి అరుగుతున్న బలపం
కరుగుతున్న నా బాల్యపు ఆనందపు రూపమని
బడి సంచికి ముందే ఎరుకేమో
బలపం ముక్కలన్నిటినీ భద్రంగా దాచేది
పిల్లలైతయని అమాయకంగా
నెమలీకలను పొదిగే పొత్తాల గంపయ్యేది
జనవరి ఒకటి నాడు
దోస్తులిచ్చిన గ్రీటింగ్ కార్డులన్నిటిని
పుస్తకాల పొత్తిళ్ళలో పాయిరంగ దాచుకునేది
ఆడి ఆడి అలసిపోయి నిదురోయేటప్పుడు
బడిసంచే నెత్తికింద మెత్తయ్యేది
నచ్చిన బొమ్మ, ఇష్టమైన పెన్నో పోయినపుడు
ఎక్కిళ్ళ కన్నీటిని తుడిచే అమ్మ కొంగు అయ్యేది
అమ్మానాన్న ఇచ్చిన పైసలను
భద్రంగా దాచే స్విస్ బ్యాంకయ్యేది బడి సంచే..
యాంత్రిక జీవితపు పరుగుల్లో కాలం
గెద్దెత్తుకెల్లిన బాల్యపు గురుతులన్నిటికి
బడి సంచే గవాయి..
దిలీప్.వి
8464030808