
మిహాయిల్ సెర్గియోవిచ్ గోర్బచేవ్ మరణం అనామక ఘట్టంగా ముగిసిపోయింది. జీవన్మృతు డిలా కాలం వెళ్లబుచ్చుతూ కన్నుమూశాడాయన. తమ అవసరం కోసం ఆయనను ఆహా.. ఓహో.. అని కీర్తించిన పాశ్చాత్య ప్రపంచం ముఖ్యంగా అమెరికా బొత్తిగా పట్టించుకోలేదు. చాలా పత్రికలు లోపల ఎక్కడో బుల్లివార్తతో సరిపెట్టాయి. కొంతమంది విశ్లేషణలు ఇచ్చినా అవి వర్తమానంతో నిమిత్తం లేని గత కథనాల పునరుల్లేఖనాలే. మన దేశంలో మాత్రం మీడియా గోర్బచేవ్ పాత్ర అనుకూల, ప్రతికూల అంశాలంటూ చర్చ కొంత వరకూ కథనాలు ఇచ్చింది. ప్రగతిశీల వాదులమ నుకునే కొంతమంది కూడా సమతుల్యత పేరిట ఆయన ఏదో కొంత మేలు చేసినట్టు మాట్లాడ్డం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే తన మహా దేశాన్ని కూల్చి తనకే మనుగడ లేకుండా చేసుకున్న వ్యక్తిలో ప్లస్, మైనస్ ఎలా చూస్తాం? మొత్తం శూన్యం, ఇంకా చెప్పాలంటే హైన్యం. నైచ్యం. గోర్బచేవ్ అధికార పగ్గాలు చేపట్టిన కాలంలో హంగామా, ఆయన ప్రతి మాటకూ ఉధృత ప్రచారం ఇప్పుడు చూసుకుంటే నవ్వూ ఏడుపూ వస్తాయి. చరిత్ర వీరులనే గుర్తుపెట్టుంకుంటుంది గాని భీరువులను కాదు. దార్శనికులను గుర్తుపెట్టుకుంటుంది గాని వినాశకులను కాదు. ప్రపంచంలో తొలి సోషలిస్టు దేశాన్ని అమెరికాను నిలవరించగల అమేయ శక్తిగల సామ్యవాద దుర్గాన్ని విచ్ఛిన్నం చేసిన గోర్బచేవ్ నిస్సందేహంగా స్వయం వినాశకుడు.
గోర్బచేవ్ నాయకత్వంలోకి రావడానికి చాలాకాలం ముందు నుంచి కమ్యూనిస్టు అగ్రనేతల దగ్గర కీలక బాధ్యతలు నిర్వహించిన వాడే. వట్టిగొడ్డుకు అరుపులెక్కువన్నట్టు సోషలిస్టు వ్యవస్థలో లోపాలపై గగ్గోలు పెట్టినవాడే. సామాజిక దుర్లక్షణాలు ప్రబలి, ఆర్థికంగా ప్రతిష్టంభనలో పడిపోయిన నాటి సోవియట్ వ్యవస్థలో సంస్కరణలు అవసరమన్నదీ నిజమే. అయితే కంట్లో నలుసు పడిందని కనుపాపనే పెరికేసినట్టు తను పురిటి నీళ్లతోపాటు పుట్టిన శిశువునూ పారేశాడు. భవనానికి మరమ్మతులు చేస్తానని చెప్పి పునాదులతో సహా కూలగొట్టాడు. కనుక తను నిర్మాత కాదు, నిర్మూలకుడు అయ్యాడు.
సమస్యల మధ్య ప్రస్థానం
ప్రథమ సోషలిస్టు రాజ్యమైన సోవియట్ చరిత్రనంతటినీ ఏకరువు పెట్టడం సాధ్యం కాదు గానీ ఒకసారి విహంగ వీక్షణం చేయొచ్చు. చరిత్రలో తొలిసారి విప్లవం విజయం సాధించిన తర్వాత లెనిన్ నాయకత్వం చుట్టుముట్టిన 14 దేశాల ముట్టడిని ఎదుర్కొంది. సామ్రాజ్యవాద ప్రపంచం బహిష్కరించింది. వ్యాపార సంబంధాలు అనుమతించలేదు. దేశంలో విప్లవ ప్రతీఘాత శక్తులూ కుట్రలు సాగించాయి. వీటిని తట్టుకుంటూ పరిస్థితికి తగిన ఆర్థిక వ్యూహాలతో కమ్యూనిస్టు పార్టీ నిలదొక్కుకుంది. 1922 నాటికి ప్రపంచ ఉత్పత్తిలో ఒకశాతం మాత్రమే చేస్తున్న సోవియట్ స్టాలిన్ నాయకత్వంలో 1930ల నాటికి పది శాతం ఉత్పత్తికి పెరిగింది. దీనికి వ్యతిరేకంగా సాగిన ప్రతీఘాత శక్తుల కుట్రలను కూడా స్టాలిన్ ఎదుర్కొనవలసి వచ్చింది. ఆ ప్రక్షాళనలో కొన్ని పెద్ద పొరబాట్లు కూడా జరిగాయి. కమ్యూనిస్టు వ్యతిరేకతతో మొదట్లో హిట్లర్‌ను రెచ్చగొట్టిన బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్‌లు తర్వాత తమ పైనే దాడి పెరిగేసరికి ఆ రష్యాతో జత కట్టక తప్పలేదు. ఆ యుద్ధంలో రెండు కోట్లమంది ప్రాణాలర్పించి ఫాసిజాన్ని అడ్డుకున్నారు. 1700 పట్టణాలు, 70 వేల గ్రామాలు ధ్వంసమయ్యాయి. పొలాలు, ఫ్యాక్టరీలు సరేసరి. ఆ జన ధన నష్టాన్ని అధిగమించి అభివృద్ధి చెందడం చరిత్ర ఎరగని సవాలు. యుద్ధంలోనూ నిర్మాణంలోనూ అగ్రభాగాన నిలిచి దేశాన్ని ఉత్తేజపర్చిన స్టాలిన్ తిరుగులేని నాయకు డయ్యాడు. అంతర్గతంగా కొన్ని తప్పులు కూడా ఆ కాలంలో జరిగిన మాట నిజమే. కాని ఆయన చుట్టూ తిరిగి తర్వాత నాయకుడైన కృశ్చేవ్...స్టాలిన్‌పై నియంత ముద్ర వేసి కమ్యూనిస్టులనూ ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేశాడు. సామ్రాజ్యవాదం కోటు గుండీ వంటిదని తీసి పారేయడమే గాక ఐరాస వేదికపై చెప్పు చూపించే అహంభావానికి పాల్పడ్డాడు. తర్వాత బ్రెజ్నెవ్. అమెరికాపై గట్టి వైఖరి తీసుకున్నాడు. 1970 నాటికి సోవియట్ ప్రపంచ ఉత్పత్తిలో అయిదో వంతు సోవియట్‌దే. 144 దేశాలతో సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే బ్రెజ్నెవ్ కూడా దేశంలో స్తంభనను తొలిగించలేకపోయాడు.
గోర్బచేవ్ వినాశక పంథా
మరో ఇద్దరు స్వల్పకాలిక నాయకుల తర్వాత 1985లో గోర్బచేవ్ పగ్గాలు చేపట్టాడు. అప్పుడు సోవియట్ మూల మలుపులో వుంది. కృశ్చేవ్ విధానాలతో ప్రభావితులై ఇరవయ్యవ మహాసభ సంతానం అని పిలవబడే మేధావులు, నాయకుల బృందం ఒకటి సోవియట్‌లో కొనసాగుతూ వచ్చింది. మాస్కోకు దూరంగా సైబీరియాలో యూనివర్సిటీల సముదాయం ఒకటి స్థాపించారు. సోషలిజంలో ఇమడటం ఇష్టం లేని మేధావులు రాజధానికి దూరమైనప్పటికీ యథేచ్ఛ వుంటుందనే ఉద్దేశంతో అక్కడ తిష్టవేశారు. సోషలిజాన్ని కాపాడుకోవడానికి తొలి దశలో ఆంక్షలు కఠినంగా వున్నా రానురాను వాటిని సడలించాలన్నది నిజమే. కాని ఈ మేధావులలో చాలా మంది కోరుకున్నది ప్రజా బాహుళ్య దృష్టితో కాదు. తమ కెరీర్ కోసమే. ఇష్టానుసారం చేసే పరిశోధనలు, రచనలు పాశ్చాత్య ప్రపంచంలో ప్రచారం చేసుకుని లబ్ధి పొందాలనేది వారి ఏకైక కాంక్ష. వారు ఎప్పుడూ ప్రజలు, దేశం కోణంలో గాక వ్యక్తివాద దృష్టితో ఇంటర్వ్యూలు ఇస్తుండేవారు. పదవుల కోసం పార్టీలో చేరి పైస్థాయికి ఎగబాకారు. గోర్బచేవ్, ఆయన కుడి భుజమైన బోరిస్ ఎల్సిన్ వంటి వారు మొదట తీవ్రవాదుల్లా పార్టీ స్వచ్ఛత గురించి మాట్లాడి పై నాయకులను ఆకర్షించి నిచ్చెన ఎక్కగలిగారు. ఉత్పత్తి వనరులు, శక్తుల దశ వీటి మధ్య సంబంధం వంటి విషయాలతో నిమిత్తం లేకుండా పెరిస్త్రోయికా గ్లాస్‌నాస్త్ అంటూ మొదలెట్టారు. వ్యవస్థకు సంబంధించిన పెరిస్త్రోయికా అంటే పునర్‌వ్యవస్థీకరణతో బలోపేతం చేయడం కన్నా ముందే ఇష్టానుసార స్వేచ్ఛ (గ్లాస్‌నాస్త్) తీసుకున్నారు. తాను తేదలచిన సంస్కరణలు, మార్పుల గురించి పార్టీలో చర్చించే బదులు మీడియాలో వదిలాడు. నాటక సినీ రంగాలలోనూ ప్రవేశపెట్టాడు. 70 ఏళ్ల పాటు అమెరికాకు దీటైన అగ్రరాజ్యంగా వుంటూ సామ్యవాద భావజాలానికి, శాంతికి, వర్థమాన దేశాలకు సహాయపడిన సోవియట్‌ను నిర్బంధ రాజ్యంగా చిత్రించే భావాలు విచ్చలవిడిగా వదిలాడు. సర్వేలు చేశాడు. పశ్చిమ దేశాల మీడియాతో మాట్లాడ్డం, పర్యటించడం గొప్ప విషయంగా భావించాడు. రేడియో ఫ్రీ యూరప్ వంటి విష ప్రచార సంస్థలతోనూ ఏజంట్లతోనూ సోవియట్‌ను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న అమెరికాకు ఇది వరప్రసాదమైంది. వారు గోర్బచేవ్‌ను ఆకాశానికెెత్తినట్టు నటిస్తూ సోషలిజం, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. గత చరిత్రలో త్యాగాలనూ విజయాలను కప్పిపుచ్చి కొత్త తరాలను అసత్యాలలో ముంచెత్తారు. ఇది అనతికాలంలోనే గోర్బచేవ్ కిందకూ నీరు తెచ్చింది.
సంస్కరణల క్రమం...
ధర్మరాజు జూదంలో ద్రౌపదితో సహా ఫణంగా పెట్టినట్టు ఈ అంతర్గత బాహ్య శత్రువుల తాకిడిలో గోర్బచేవ్ సోషలిస్టు వ్యవస్థ మూల సూత్రాలనే వదులుకోసాగాడు. కమ్యూనిస్టు నిర్మాణ సూత్రాలకే తిలోదకాలిచ్చాడు. బండి ముందు గుర్రం వెనక అన్నట్లు ఇల్లు సర్దుకోకుండా తలుపులు తీసిన గోర్బచేవ్ నాయకత్వం శత్రుశక్తుల తాకిడిలో పట్టు కోల్పోయింది. లిగచెవ్ వంటి వారు విమర్శిస్తున్నా పోరాడలేకపోయారు. పరిస్థితి మరీ క్షీణించాక 1991లో యెనయెవ్ అనే సీనియర్ నాయకత్వంలో ఒక బృందం తిరుగుబాటుకు ప్రయత్నించినా అప్పటికే దుర్బలమైన కమ్యూనిస్టు పార్టీ పతనాన్ని అడ్డుకోలేకపోయింది. విద్రోహిగా తయారైన ఎల్సిన్ రంగప్రవేశం చేసి వీరుడిలా ట్యాంకు పైకెక్కి తిరుగుబాటును విఫలంచేశారు. కొద్ది కాలంలోనే గోర్బచేవ్‌్‌ను పదవీచ్యుతుణ్ని చేసి తను అధినేత అయ్యాడు. రిపబ్లిక్‌లన్నీ విడిపోయాక రష్యా అధ్యక్షుడయ్యాడు. తన శిష్యుడుగా బయిలుదేరిన వ్లదిమిర్ పుతిన్ తర్వాత నాయకత్వం చేపట్టి అవిచ్ఛిన్నంగా కొనసాగుతు న్నాడు. సోషలిజంలో స్వేచ్ఛ వుండదని చెప్పిన వారంతా ఇప్పుడు పుతిన్ వ్యక్తిగత నిరంకుశత్వం ముందు తల వంచుకున్నారు. అవకాశవాదులైన అప్పటి కమ్యూనిస్టు నేతలు రష్యా పాలక కూటమిలో కొత్త పేర్లతో కొనసాగుతుంటే కమ్యూనిస్టులు పోరాడుతున్నారు. ఈ పోరాటంలో నూ గోర్బచేవ్ కనీసం పాలుపంచుకోలేదు. ఏవో స్వంత సిద్ధాంతాలతో కాలక్షేపం చేసి కన్నుమూశాడు.
కమ్యూనిస్టు పార్టీని అంతర్గత ప్రజాస్వామ్యంతో కాపాడుకుంటూనే సైద్ధాంతిక నిబద్ధత, నిరంతర ప్రక్షాళన లేకపోతే ఏం జరుగుతుందనే దానికి గోర్బచేవ్ ఒక పెద్ద ఉదాహరణ. అయితే ఆ తర్వాత చరిత్రాంతం అన్నవారికి ఇప్పుడు నడుస్తున్న ప్రజా పోరాటాలు, లాటిన్ అమెరికాలోనే ప్రత్యామ్నాయ ప్రభుత్వాల విజయాలు, వామపక్ష శక్తుల పునరేకీకరణ, కృషి...అన్నిటినీ మించి చైనా మహత్తర ఆర్థిక పురోగమనం సమాధానం చెబుతాయి. అదే రష్యాలో పుతిన్‌పై అమెరికా కూటమి కత్తి కట్టింది. ఆయన తన పూర్వపు రిపబ్లిక్ అయిన ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నారు. పాత రిపబ్లిక్‌లు అనేకం సమస్యలతో సతమతమం అవుతున్నాయి. శత్రువులకు సింహస్వప్నంగా ప్రకాశించిన సోవియట్ విచ్ఛిన్నమై ఈ దుస్థితి దాపురించిందంటే దానికి కారణం గోర్బచేవ్ వినాశకర విధానాలతోనే మొదలైంది. ఇప్పటికీ వివిధ దేశాల్లో వివిధ రూపాలలో సాగుతున్న ఈ పెడ ధోరణులను సైద్ధాంతిక స్ఫూర్తితోనే ఎదుర్కోవలసి వుంటుంది. కమ్యూనిస్టులను అపహాస్యం చేసిన వారెందరో వారి తోడ్పాటు కోరుతున్నారంటే సిద్ధాంత బలం, నిబద్ధత కాపాడుకోవడమే కారణం. అయినా సవాళ్లు తీవ్రమైనవేననడం నిస్సందేహం. ప్రజా వ్యతిరేకులైన గోర్బచేవ్ వంటి శల్యసారథులను నిలవరిస్తేనే ఉద్యమాలు, వ్యవస్థలకు రక్షణ.
తెలకపల్లి రవి