రంగబయలులో నాసిరకంగా తారు రోడ్డు : చర్యలు తీసుకోవాలి : సిపిఎం డిమాండ్
ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు) : అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం మారుమూల ప్రాంతం రంగబయలు పంచాయితీలో శుక్రవారం సిపిఎం బృందం పర్యటన చేసింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటి సభ్యులు కొర్ర త్రినాధ్, వైస్ ఎంపిపి పి.సత్యనారాయణ మాట్లాడుతూ ... ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా నిర్మాణం చేసిన తారు రోడ్డు వారం క్రితం పూర్తి చేశారని అన్నారు. వనుగుమ్మ నుండి జడిగుమ్మ వరకు 22 కిలో మీటరు సుమారుగా 17 కోట్ల రూపాయలు ఖర్చుతో నిర్మాణం చేశారని తెలిపారు. తారు రోడ్డు నిర్మాణం నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. గాటి మలుపులో సిమెంటు రోడ్ 2 కిలో మీటర్లు నిర్మాణం చేయవలసి ఉన్నప్పటికీ ఎక్కడ చేయలేదని మండిపడ్డారు. మట్టి, గ్రావెల్ వేసి నీరు పోసి సక్రమంగా రోలింగ్ చేయకుండానే తారు పోశారని అన్నారు. అందుకే ఒక రోజు కురిసిన వర్షంకు సుమారు మూడు కిలో మీటర్లు పొడవున్న పూర్తిగా పాక్షికంగా రోడ్ కోతకు గురి కోతుకు పోయిందన్నారు. గతంలో సిపిఎం నాయకత్వంలో ఈ ప్రాంతంలో తారు రోడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసులతో అనేక పోరాటాలు చేయడం ఫలితంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తారు రోడ్డు కల నెరవేరిందని గుర్తు చేశారు. ఆదివాసులు ఆనందిస్తుంటే ఒక రోజు వర్షంకే మొత్తం రోడ్ దెబ్బతిన్నదని, అందుకే నాసిరకంగా తారు రోడ్డు నిర్మాణం చేసిన కాంట్రాక్టర్, పర్యవేక్షణ చేయని ఇంజినీరింగ్ అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే భవిష్యత్తులో ఆదివాసులతో ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.భీమరాజు, ఎంఎం.శ్రీను, కె.శంకర్రావు, ఎస్.దొన్నో, కె.నర్సయ్య, కే.కొండయ్య, కే.విక్రమ్, ఎన్. సాడ్డురం, ఎస్.చండల్, ఎస్.సంతన్న పాల్గొన్నారు.










